ముస్లిం పర్సనల్ లా ప్రకారం పెళ్లయినా సరే
చట్టాల నుంచి ఎలాంటి మినహాయింపులుండవు
ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ముస్లిం పర్సనల్ లా కింద గుర్తింపు పొందిన వివాహం చేసుకున్నప్పటికీ, 18 ఏళ్ల లోపు వయసున్న మైనర్ భార్యతో లైంగిక చర్యకు పాల్పడటం నేరమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పర్సనల్ లా పేరుతో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో), భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద నమోదైన కేసుల నుంచి రక్షణ పొందలేరని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ నరుల తీర్పు వెలువరించారు.
మైనర్ భార్యతో లైంగిక చర్యకు పాల్పడిన కేసులో నిందితుడిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 64(1), పోక్సో చట్టం సెక్షన్ 6 కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు జస్టిస్ సంజీవ్ నిరాకరించారు. తమపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఓ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి పైవ్యాఖ్యలు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, వేధింపులకు గురి చేసినందుకు పరిహారం చెల్లించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనలను కొట్టివేశారు.
వైద్య పరీక్షలకు వెళ్లడంతో..
వివాహం జరిగే నాటికి పిటిషనర్లలో భార్య వయసు 16 ఏళ్ల మూడు నెలలు కాగా, ఆమె భర్త వయసు 28 ఏళ్లు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆమె వయసు 18 ఏళ్ల కంటే తక్కువని తేలడంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తమ వివాహం ఇద్దరి సమ్మతంతో ఇరు కుటుంబాల అంగీకారంతో జరిగిందని పిటిషనర్ కోర్టుకు తెలిపింది. తన భర్తకు బెయిలివ్వాలని కోరింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం రజస్వల అయిన ముస్లిం బాలిక వివాహానికి అర్హురాలని, తమ వివాహం చట్టబద్ధమే కాబట్టి లైంగిక చర్య నేరంగా పరిగణించరాదని వారు వాదించారు.
సమ్మతి ఉన్నా నేరమే
పిటిషనర్ల వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. వివాహ సివిల్ చట్టబద్ధతకు, మైనర్‌తో లైంగిక చర్యకు సంబంధించిన క్రిమినల్ పరిణామాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కోర్టు ఎత్తిచూపింది. ముస్లిం పర్సనల్ లా కింద వివాహం చెల్లుబాటైనప్పటికీ, పోక్సో లేదా బీఎన్‌ఎస్ చట్టాలకు దానిని మినహాయింపుగా పరిగణించలేమని జస్టిస్ సంజీవ్ నరుల స్పష్టం చేశారు. ‘వివాహం జరిగినంత మాత్రాన బాలిక వయసు పెరగదు. పెళ్లికి ముందు 16 ఏళ్లు ఉన్న వ్యక్తి వయసు ఆ తర్వాత కూడా 16 ఏళ్లే ఉంటుంది. సమ్మతి తెలిపే చట్టపరమైన సామర్థ్యాన్ని వయసే నిర్దేశిస్తుంది’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.


