ప్రముఖ గ్లోబల్ క్లౌడ్ సర్వీసెస్ దిగ్గజం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)కు ఆదాయపు పన్ను శాఖ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు నుంచి ఊరట లభించింది. 2020-21 అంచనా సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2020-21) సంబంధించి సుమారు రూ.4,500 కోట్లకు పైగా విదేశీ చెల్లింపులకు పన్ను వేసేందుకు ఐటీ శాఖ జారీ చేసిన రీఅసెస్మెంట్ నోటీసును ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. జస్టిస్ దినేష్ మెహతా, జస్టిస్ రజనీష్ కుమార్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
వివాదం నేపథ్యం
ఐటీ శాఖ తన రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఆర్‌ఎంఎస్) డేటా ఆధారంగా రూ.4,000 కోట్లకు పైగా విలువైన విదేశీ రెమిటెన్సులపై పన్ను మినహాయింపు జరగలేదని భావించి మార్చి నెలలో ఏడబ్ల్యూఎస్‌కు నోటీసు ఇచ్చింది. అయితే, ఈ అంశంపై కంపెనీ స్పందిస్తూ, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థకు చెందిన గ్లోబల్ ఆదాయం (9.2 బిలియన్లు డాలర్లు), భారతదేశ డేటా సెంటర్ల నిష్పత్తి ఆధారంగా ప్రభుత్వానికి చెందాల్సిన రాబడిని ఐటీ శాఖ ఇదివరకే అసెస్ చేసిందని పన్ను నిపుణులు, లాయర్లు స్పష్టం చేశారు. గతంలో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు చెందిన రూ.2,966 కోట్ల రెమిటెన్సులపై ఇప్పటికే సమగ్ర పరిశీలన పూర్తయిందని కంపెనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
హైకోర్టు కీలక ఆదేశాలు
ధర్మాసనం ఈ వ్యవహారాన్ని సమగ్రంగా విచారించిన అనంతరం అసెస్సింగ్ ఆఫీసర్ (ఏఓ) కంపెనీ ప్రతినిధులకు పర్సనల్ హియరింగ్ (వ్యక్తిగత విచారణ) అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. సదరు లావాదేవీలను ఇప్పటికే అసెస్ చేశారా లేదా అన్నది నిర్ధారించుకున్న తరవాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. భారత్‌లోని క్లౌడ్ కంప్యూటింగ్ సేవల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాయల్టీగా పరిగణించలేమని 2025లోనే ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. తగిన ఆధారాలు, విచారణ అవకాశం లేకుండా రీఅసెస్మెంట్ ప్రక్రియ చేపట్టడం చెల్లదని స్పష్టం చేస్తూ కేసును తిరిగి ఆదాయపు పన్ను శాఖకే ధర్మాసనం పంపింది.
ఇదీ చదవండి: వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్!


