‘హుషారు పిట్టలు’ మూవీ రివ్యూ | Husharu Pittalu Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘హుషారు పిట్టలు’ మూవీ రివ్యూ

Aug 14 2026 7:10 PM | Updated on Aug 14 2026 7:26 PM

Husharu Pittalu Movie Review And Rating In Telugu

అన్షు, వాసవి గణేషన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు. బిక్షు దర్శకత్వం వహించారు. ఆగస్ట్‌ 15న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్‌ షో వేశారు మేకర్స్‌. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
తెలంగాణలో ఓ గ్రామానికి చెందిన రవి(అన్షు) టెన్త్‌ క్లాస్‌ టాపర్‌. చదవు తప్ప ఇంకేమి తెలియదు. అలాంటి వాడికి ఆ ఊర్లో ఉండే రవి బ్యాచ్‌ బలవంతంగా అశ్లీల వీడియోలు చూపించి..  అతనిని వాటికి అడిక్ట్ అయ్యేలా చేస్తాడు. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన పుట్ట చిట్టి(వాసవి గణేశన్)... స్కూల్ టాపర్ అయిన రవికి ఆకర్షితురాలవుతుంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన ఆకర్షణ కాస్తా... ఇద్దరూ ఒక్కటయ్యేంత వరకూ వెళుతుంది. దాంతో రవి చదువు పక్కదారి పడుతుంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన టీనేజ్ ఆకర్షణ... చివరకు కడుపు తెచ్చుకునే దాకా వెళ్తుంది. దాంతో వీరిద్దరు వివాహం చేసుకోవాలనుకుంటారు. అందుకు పెద్దలు అంగీకరించారా? వీరి టీనేజ్ లవ్ స్టోరీ చివరకు ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు పుట్ట చిట్టి అంత చిన్న వయసులోనే శారీరక వాంఛలకు ఎందుకు ఆకర్షితురాలైంది?  తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు వీరిద్దరి జీవితంలో ఎలాంటి మలుపులు తీసుకొచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
నేటి 5జీ ప్రపంచంలో సెల్‌ఫోన్‌ పిల్లల చేతిలో ఓ సాధారణ వస్తువుగా మారిపోయింది. అరచేతిలోనే ప్రపంచాన్ని చూసే అవకాశం రావడంతో మంచి విషయాలతో పాటు, వయసుకు మించిన కంటెంట్‌ కూడా వారి ముందుకు సులభంగా వస్తోంది. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లలపై నీలి చిత్రాలు, సోషల్‌ మీడియా ప్రభావం ఎలా ఉంటుంది? ఆ ప్రభావం వారి ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను ఎలా మార్చుతుంది? తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను వినోదంతో పాటు సందేశాత్మకంగా చూపించే ప్రయత్నమే ఈ  ‘హుషారు పిట్టలు’.

సినిమాలో రసూల్‌ యాదవ్‌ అనే చిన్నారి స్కూల్‌లో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి గల కారణాలను చూపించిన విధానం ఆలోచింపజేస్తుంది. పిల్లల ప్రవర్తన వెనుక తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితం, ఇంట్లో వారు మాట్లాడే విధానం, పిల్లలు చూసే కంటెంట్‌ ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో దర్శకుడు బిక్షు చక్కగా ప్రస్తావించారు.

అలాగే పసితనంలో ఓ టీనేజ్‌ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో హద్దులు మీరి ప్రవర్తించడం, ఆ సంఘటనలను చూసిన చిన్నారి పెరిగి టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత తాను కూడా అలాగే ప్రవర్తించాలని భావించడం వంటి అంశాలను ‘పుట్ట చిట్టి’ క్యారెక్టర్‌ ద్వారా చూపించారు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? వారి ఎదుగుదలలో ఎలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి? అనే విషయాలను దర్శకుడు సందేశాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు.

సినిమా ఫస్టాఫ్‌ మొత్తం రొమాంటిక్‌, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. అయితే రొమాన్స్‌ని పదే పదే చూపించడంతో కథలు అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథను తెరపైకి తీసుకువచ్చి ప్రేక్షకులను కథతో కనెక్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. గతంలో ఇలాంటి అంశాలతో కొన్ని సినిమాలు వచ్చినా.. తల్లిదండ్రులను ఆలోచింపజేసే స్థాయిలో ఈ సినిమాలో సందేశాన్ని అందించే ప్రయత్నం కనిపిస్తుంది.

ముఖ్యంగా నేటి 5జీ నెట్‌వర్క్‌ ప్రపంచంలో పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియకుండా సెల్‌ఫోన్‌లో ఏం చేస్తున్నారు? ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారు? సోషల్‌ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరాన్ని కూడా సినిమాలో చూపించారు. అయితే కొన్ని రొమాటిక్‌ సన్నివేశాలతో  పాటు డబుల్‌ మీనింగ్‌ డైలాగులు కూడా ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందికరం. యాత్‌ మాత్రం ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తారు. 

ఎవరెలా చేశారంటే.. 
రవి పాత్రలో అన్హు బాగా నటించాడు. కామెడీ, రొమాన్స్, సంభాషణలు అన్నింటిలోనూ తన ఈజ్ ను చూపించారు. అలాగే వాసవి గణేశన్ కూడా తన క్యూట్ నెస్ అండ్ గార్జియస్ లుక్స్ తో యూత్ ను మెస్మరైజ్ చేస్తుంది. హీరోయిన్ తండ్రిగా నటించిన గోవర్ధన్... అతని తండ్రిగా నటించిన వృద్ధుడు కూడా బాగా నటించారు. అలాగే హీరో తండ్రి పాత్రలో నటించిన రమేష్ నకిరే కంటి... అతని భార్య కూడా నిత్యం కలహాలతో ఉండే భార్య భర్తలుగా ఆకట్టుకుంటారు. వీరి చిన్న కుమారుడిగా నటించిన రసూల్ యాదవ్ పాత్ర కూడా కథలో భాగమైంది. కుర్రాడు తన పాత్రకు న్యాయం చేశాడు. మిగతా పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి.సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement