టాలీవుడ్ నటి అనసూయ పేరు మరోసారి తెరపైకొచ్చింది. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న అనసూయ వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా వివాదాలతో కాదు. సనాతన ధర్మంపై ఆమె చేసిన కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా నిలిచింది. అనసూయ సనాతన ధర్మాన్ని అవమానించేలా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలోనే అనసూయ తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చింది.
కొందరు తన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని పేర్కొంది. తాను ఏ మత విశ్వాసాలనూ కించపర్చేలా మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. తాను మాట్లాడింది కేవలం కొందరి గురించి మాత్రమేనని తెలిపింది. తనపై వల్గర్ కామెంట్స్.. పర్సనల్ ఎటాక్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడే వాళ్ల గురించి అని తన పోస్ట్‌లో వెల్లడించింది. అందుకే తాను వివరణ ఇవ్వాల్సి వచ్చిందని అనసూయ రాసుకొచ్చింది.
అనసూయ తన పోస్ట్‌లో రాస్తూ..'కొందరు కావాలనే నా మాటలను వక్రీకరిస్తున్నారు. అందుకే నేను వివరణ ఇవ్వాల్సి వస్తోంది. నేను కొందరి గురించి మాత్రమే మాట్లాడా. నాపై అభ్యంతర కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు దిగే వాళ్ల గురించి మాత్రమే చెప్పా. అది ఏ మతాన్ని గానీ, వర్గాన్ని గానీ కించపరచలేదు. నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్లకు స్పష్టంగా చెప్పాలనుకుటున్నా. నేను సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని. నా ధర్మం, విలువలు, విశ్వాసాల పట్ల నాకు ఎలాంటి చింత లేదు. ధైర్యంగా ఉండటం.. నిజం వైపు నిలబడటం, తప్పును తప్పు అని చెప్పడం, ఎదుటివారిని మనిషిగా గౌరవించడం.. ఇవన్నీ నాకు ధర్మమే నేర్పింది. నన్ను నేను హనుమాన్ జీ కుమార్తెగా భావిస్తా. ఆయన బలమే నాకు స్ఫూర్తి' అంటూ పోస్ట్ చేసింది.
అంతేకాకుండా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండటం నా నైజం కాదని తెలిపింది. నా మాటల్లో అసలు విషయం పక్కనపెట్టి.. సనాతన ధర్మాన్ని అవమానించినట్లుగా వక్రీకరించినట్లు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికింది. మతం ఆధారంగా నేను ఎవరిపైనా ఓ నిర్ణయానికి రాను. నన్ను వేధించే వాళ్లను మాత్రమే ప్రశ్నిస్తానని రాసుకొచ్చింది. అందువల్ల ఎడిట్ చేసిన క్లిప్‌లు, సగం సగం కథనాలు చూసి మోసపోవద్దని సుదీర్ఘ పోస్ట్ చేసింది.


