లోకేశ్‌ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Lokesh Kanagaraj DC Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Aug 7 2026 3:02 PM | Updated on Aug 7 2026 4:03 PM

Lokesh Kanagaraj DC Movie Review And Rating In Telugu

ఖైదీ, విక్రమ్‌, లియో, కూలీ లాంటి చిత్రాలతో దర్శకుడిగా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు లోకేశ్‌ కనకరాజు. ఆయన హీరోగా చేసిన తొలి సినిమా డీసీ(DC). అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ నేడు(ఆగస్ట్‌ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
గ్యాంగ్‌స్టర్‌ సర్కార్‌ టీమ్‌లో కీలకంగా పని చేస్తే వ్యక్తి దేవదాస్‌ అలియాస్‌ దాసు(లోకేశ్‌ కనకరాజ్‌). పోలీసులు ఆయుధాలు దొంగిలించడం వీళ్ల పని. అలా ఓ సారి పోలీసుల వాహనంపై దాడి చేసి ఆయుధాలు దొంగిలిస్తారు. అదే ప్రాంతంలో ఓ సామాన్య వ్యక్తి తన కొడుకు చదవుకు కోసం పొలం అమ్మి రూ. 7లక్షలు తీసుకెళ్తుంటాడు. ఈ  డబ్బులను ఓ పోలీసు అధికారి తీసుకొని, అతన్ని దారుణంగా చంపేస్తాడు. దీంతో అతని భార్య దేవదాస్‌ బృందాన్ని ఆశ్రయిస్తుంది. 

విషయం తెలుసుకున్న దాసు.. ఆ పోలీసు అధికారిని హత్య చేస్తాడు. దీంతో బోగరాజు నేతృత్వంతోని ఓ ప్రత్యేక పోలీసు బృందం.. దాసు గ్యాంగ్‌ కోసం వెతుకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో దాసు..తన బృందంతో కలిసి  విజ‌య‌వాడ‌లోని ఓ బార్‌లో త‌ల‌దాచుకుంటారు. అక్క‌డ బార్‌ సింగ‌ర్ పార్వ‌తిని (సంజ‌నా కృష్ణ‌మూర్తి) చూసి దేవ‌దాస్ ప్రేమ‌లో ప‌డ‌తాడు.  అయితే పోలీసుల దాడితో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత వేశ్యగా ఉన్న చంద్ర(వామికా గబ్బి)కు విముక్తి కలిపిస్తాడు దేవదాస్‌. దీంతో ఆమె కూడా దాస్‌ వెంటనే వస్తుంది. వీరి జర్నీ ఎలా కొనసాగింది? అసలు చంద్ర ఎందుకు వేశ్యగా మారింది? దేవదాస్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? పేదవాడి కొడుకు చదువు కోసం దేవదాసు చేసిన పోరాటం ఎలా ముగిసింది? అనేదే ఈ సినిమా అసలు కథ. 

ఎలా ఉందంటే.. 
డీసీ.. కొత్త కథేమి కాదు. రొటీన్‌ గ్యాంగ్‌స్టర్‌ స్టోరీనే కానీ..అంతర్లీనంగా ఓ మంచి ప్రేమ కథతోపాటు ఓ బలమైన సామాజిక అంశాన్ని ఇందులో చర్చించారు.  ఇంత రా అండ్ రస్టిక్ కథలో కూడా భావోద్వేగాలను పెద్ద పీట వేయడంతో ఓ డిఫరెంట్‌ గ్యాంగ్‌స్టర్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. 

ఓ పేదవాడు తన కొడుకును గొప్పగా చదివించాలని ఆశ పడడం.. పోలీసు అధికారి అత్యాశతో పోయి అతన్ని చంపేయడం..ఇలా కథ ప్రారంభమే ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు, గ్యాంగ్‌స్టర్ మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరుగడంతో అసలు కథలోకి దర్శకుడు తీసుకెళ్తాడు.  పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దేవదాస్‌ గ్యాంగ్‌ విజయవాడకు వెళ్లడం..అక్కడ పార్వతి పరిచయంతో కథ మరో మలుపు తీరుగుతుంది. 

పార్వతి ఎపిసోడ్‌ మొత్తం హృదయాలకు హత్తుకునేలా సాగుతుంది. ఇక చంద్ర ఎంట్రీ..ఆమె ప్లాష్‌బ్యాక్‌ మరింత  భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ అదిరిపోతుంది. రొటీన్‌ సన్నివేశాలు, యాక్షన్‌ సీన్స్‌ అయినప్పటికీ.. అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ దాన్ని కొత్తగా మార్చేసింది.  కొన్ని చోట్ల అనిరుధ్‌ ఇచ్చిన బీజీఎంకి థియేటర్‌ అంతా ఊగిపోతుంది. 

సెకండాఫ్‌లో కూడా కథనం పరుగులు పెడుతుంది. చంద్ర కూడా దాస్‌ టీమ్‌తో కలిసి ప్రయాణం చేయడం.. పోలీసులు వీరి కోసం వెతకడం..తప్పించుకునే క్రమంలో వచ్చే యాక్షన్‌ సీన్లు.. అన్నీ అదిరిపోతాయి.  డబ్బుల కోసం చంద్ర వేసిన ప్లాన్‌ థియేటర్స్‌లో ఈళలు వేయిస్తుంది.  కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగినా.. అనిరుధ్‌ బీజీఎంతో బోర్‌ కొట్టకుండా చేశాడు. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది.  అయితే లోకేశ్‌ మినహా మిగతా నటీనటులు తెలుగు ప్రేక్షకులను అంతగా తెలియకపోవడంతో ఆ పాత్రలతో పెద్దగా కనెక్ట్‌ కాలేకపోతాం. సర్‌ప్రైజింగ్‌ ఫ్యాక్టర్స్‌ కూడా పెద్ద ఉండవు. కథ మొత్తం ఒకే లైన్‌ మీద సాగుతుంది. అలాగే మితిమీరిన హింస కూడా ఓ వర్గం ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపిస్తుంది. గ్యాంగ్‌స్టర్‌ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే.. 
ఇనాళ్లు తెర వెనుక ఉన్న లోకేశ్‌.. తొలిసారి తెరపై కనిపించి, ఆకట్టకున్నాడు. దేవదాస్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. పెద్ద పెద్ద డైలాగులు లేకుండా  కేవలం తన కళ్ళతో, హావభావాలతోనే  చెప్పాల్సిన విషయం అర్థమయ్యేలా చెప్పేశాడు. వేశ్య చంద్ర పాత్రకి వామికా గబ్బి వందశాతం న్యాయం చేసింది. నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్ర అది.  సెకండాఫ్‌లో  ఆమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఇక సంజన..తెరపై కనిపించేది కాసేపే అయినా..తనదైన నటనతో ఆకట్టుకుంది. పోలీసులు అధికారితో పాటు దాస్‌ గ్యాంగ్‌ మెంబర్స్ కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. అనిరుధ్‌ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో రొటీన్‌ గ్యాంగ్‌స్టర్‌ కథను తెరపై డిఫరెంట్‌గా కనబడేలా చేశాడు. ఓ యాక్షన్‌ సీన్‌కి పెళ్లి బరాత్‌ బీజీఎం ఇవ్వడం హైలెట్‌. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement