‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల హీరోలుగా, ‘సిద్ధార్థ్ రాయ్’ ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అదే నీవు అదే నేను’. కొండల్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ పై గోవిందు కాండ్రేగుల నిర్మించిన ఈ మూవీ నేడు(జులై 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
కొత్త జంట సాగర్ (యశ్వంత్ పెండ్యాల), శ్రీవల్లి (తన్వీ నేగి) ఓ గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతుంది. సాగర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. శ్రీవల్లి హౌస్ వైఫ్ గా ఇంటి పనులు చూసుకుంటుంది. సాగర్ తల్లి సావిత్రి (కల్పలత) వల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇలా సంతోషంగా ఉన్న శ్రీవల్లీ జీవితంలోకి కార్తీక్ అనే యువకుడు వస్తాడు.కెనడాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే కార్తీక్.. ఓ ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్ వచ్చి.. శ్రీవల్లీ ఎదురు ఫ్టాట్‌లోకి దిగుతాడు.
తన మాట తీరుతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే కార్తీక్.. పెళ్లైన శ్రీవల్లీని బుట్టలో పడేస్తాడు. తను తప్పు చేస్తున్నానని తెలిసిన శ్రీవల్లీ..అతనికి దూరంగా ఉండలేకపోతుంది. కొన్నాళ్ల తర్వాత కార్తీక్.. పెళ్లి ప్రపోజల్ పెడతాడు. అదే సమయంలో భర్త సాగర్ గురించి ఆమెకు కొన్ని నిజాలు తెలుస్తాయి. అవేంటి? శ్రీవల్లీ తీసుకున్న తీవ్రమైన నిర్ణయం ఏంటి? అసలు కార్తీక్..వల్లీకి ఎందుకు దగ్గరయ్యాడు? అతని నేపథ్యం ఏంటి? కార్తీక్ వల్ల వల్లీ జీవితంలో వచ్చిన మలుపులు ఏంటి? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తిగా దర్శకుడు కొండల్ ఈ కథను తెరకెక్కించారు. ప్రేమ గొప్పదనాన్ని తెలియజేస్తూనే.. పెళ్లిలోని పవిత్రతను చాటి చెప్పే చిత్రమిది. శ్రీవల్లీ తన కారులో రెండు మృతదేహాలను తీసుకెళ్లే సీన్‌తో కథ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ ప్లాష్‌బ్యాక్‌లో వెళ్లి..గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యం, అటు సాఫ్ట్ వేర్ కంపెనీ ఎపిసోడ్స్ తో సరదాగా సాగుతుంది. సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో మంగళవారం పాత్రలో సూర్యతేజ, రీమిక్స్ రీల్ స్టార్ రవి క్యారెక్టర్ లో బిత్తిరి సత్తి చేసిన కామెడీ నవ్విస్తుంది.
అయితే అసలు కథ ఏంటో చెప్పకపోవడంతో కొంత సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ఎందుకు పెట్టారో అర్థం కాదు. అయితే ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఫస్టాఫ్‌లో వేసిన చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా ఊహకు అందకుండా రివీల్ చేస్తూ సెకండాఫ్ ను ఆద్యంతం ఆసక్తికరంగా మార్చారు. ఫస్టాఫ్‌లో ప్రేక్షకుల్లో కలిగిన అపార్థాలన్నీ సెకండాఫ్ లో తొలగిపోతాయి. ట్విస్టులను చివరిదాక ఊహించలేరు. ఫస్టాఫ్‌ని ఇకాంస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
కమిటీ కుర్రోళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల ఈ చిత్రంలో తమ పాత్రలతో మెప్పించారు. తన్వీ నేగి తన పర్ ఫార్మెన్స్, అందంతో ఆకట్టుకుంది. కార్తీక్ గా పక్కింటి కుర్రాడి పాత్రకు టైలర్ మేడ్ అనిపించారు త్రినాథ్ వర్మ. తన్వీ నేగి ఇప్పటికే పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచితమైంది. ఈ సినిమాలో ఆమెది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అనేక లేయర్స్, షేడ్స్ ఉన్న శ్రీవల్లి పాత్రకు తన్వీ పూర్తి న్యాయం చేసింది.
మరో హీరోయిన్ సహర్ కృష్ణన్ రూబీ పాత్రలో గ్లామర్ యాడ్ చేస్తూ తన పర్ ఫార్మెన్స్ తోనూ మెప్పించింది. ఫ్రెండ్ స్నేహ పాత్రలో సునయన, సావిత్రిగా కల్పలత ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కనిష్క బీజీఎం బాగుంది. పాటలు పర్వాలేదు. నిమ్మల జయపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపించింది. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ సీన్స్ ను క్రిస్ప్ గా కట్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


