విజయ్‌ సర్కార్‌ను కూల్చేందుకు రూ.180 కోట్ల డీల్‌..! | Rs 180 crore deal to topple Vijay government | Sakshi
Sakshi News home page

విజయ్‌ సర్కార్‌ను కూల్చేందుకు రూ.180 కోట్ల డీల్‌..!

Jul 5 2026 4:35 AM | Updated on Jul 5 2026 4:35 AM

Rs 180 crore deal to topple Vijay government

పోలీసుల విచారణలో వెల్లడించిన నిందితులు 

ప్రలోభాలకు లొంగని టీవీకే ఎమ్మెల్యేలు 

విచారణకు రావాలని సెంథిల్‌ బ్రదర్స్‌కు సమన్లు జారీ చేసిన పోలీసులు 

వారి తల్లిదండ్రులకు అందజేత 

మరికొందరు కీలక నేతలపేర్లూ బయటకు వస్తాయంటున్న పోలీసు వర్గాలు

సాక్షి, చెన్నై: తమిళనాడులో జోసెఫ్‌ విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారీ డీల్‌ కుదిరినట్లు వెల్లడైంది. టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ఏకంగా రూ.180 కోట్ల మేర డీల్‌ కుదిరినట్లు సమాచారం. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన 8 మంది నిందితులు విచారణలో వెల్లడించిన విషయాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 3 నెలల్లో శాసనసభ ఎన్నికలు రావచ్చని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, వాటిని డీఎంకే ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్‌. భారతి సమర్థించడం తెలిసిందే. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్ర బయటపడింది. 

కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే డాక్టర్‌ ఇళయరాజాకు ఫోన్‌ చేసిన కొందరు అసెంబ్లీలో స్పీకర్‌కు వ్యతిరేకంగా తీసుకువచ్చే అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే రూ.35 కోట్లు ఇస్తామని ఆశ చూపారు. దీనికి నిరాకరించిన ఎమ్మెల్యే.. తనను, తన కుటుంబాన్ని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెన్నై పోలీస్‌ కమిషనర్‌ అమల్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వంపై జరుగుతున్న కుట్ర బయటకు వెల్లడైంది. దీనిపై ట్రిప్లికేన్‌ పోలీసులు కేసు నమోదు చేసి, పొలిటికల్‌ సర్వే సంస్థ నిర్వహిస్తున్న తిరునావుక్కరసు, త్యాగరాజన్, నరేష్, రమేష్, కార్తీ సహా 8 మందిని అరెస్ట్‌ చేశారు. 

సెంథిల్‌ సోదరులకు సమన్లు 
ఈ కేసులో నిందితుల స్టేట్‌మెంట్‌ ఆధారంగా డీఎంకే మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్‌ కుమార్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారిద్దరూ పరారీలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అశోక్‌కుమార్‌ మద్రాస్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కుట్ర కేసులో విచారణ కోసం వీరిద్దరినీ చెన్నై పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించేందుకు పోలీసులు కరూర్‌ రామేశ్వరపట్టిలోని సెంథిల్‌ బాలాజీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. 

సెంథిల్‌ కుమార్, అశోక్‌కుమార్‌ ఈ నెల 20న ట్రిప్లికేన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. వాటిని వారి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కేసులో డీఎంకే, అన్నాడీఎంకేకు చెందిన మరికొందరు కీలక రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని, ఇది తమిళనాడు రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు దారితీయవచ్చని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. 

నిందితుల వాంగ్మూలంలో షాకింగ్‌ విషయాలు
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. విచారణలో నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో షాకింగ్‌ విషయాలు బయటపడుతున్నాయి. డీఎంకే మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్‌ కుమార్‌ సూచనల మేరకే తాము ఈ ఆపరేషన్‌కు ఒడిగట్టినట్లు నిందితులు వెల్లడించారు. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చడానికి మొదట అసెంబ్లీలో స్పీకర్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్లాన్‌ చేశారు. దీనికి 10 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో, ఒక ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థ ద్వారా ఈ ఆపరేషన్‌ కోసం రూ.180 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్లు నిందితులు తెలిపారు. 

ఈ ప్లాన్‌ సక్సెస్‌ అయితే తమకు కూడా భారీగా ముట్టజెబుతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు చర్చలు రహస్యంగా జరగాయి. ఇందుకోసం నిందితులు గిండిలోని ఓ ప్రముఖ హోటల్‌లో బస చేశారు. ప్రలోభ పెట్టాల్సిన టీవీకే ఎమ్మెల్యేల జాబితాను తమకు ఇచ్చారని, దాని ప్రకారం కొందరితో మాట్లాడామని నిందితులు తెలిపారు. అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా డబ్బు ఆశకు లొంగలేదని, అందరూ తిరస్కరించారని వారు వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement