లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. ఛప్రా నుండి లక్నో చేరుకున్న గోమతినగర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ గుర్తుతెలియని ఓ మహిళ తలలేని మృతదేహం బయటపడటం తీవ్ర కలకలం రేపింది. అత్యంత కిరాతకంగా మహిళను హత్య చేసి, శరీర భాగాలను విడదీసి బాక్సుల్లో ప్యాక్ చేసిన తీరు చూసి రైల్వే అధికారులు సైతం నివ్వెరపోయారు.
ఎస్ వన్ కోచ్‌లో భయానక దృశ్యం
ఛప్రా నుండి బయలుదేరిన గోమతినగర్ ఎక్స్‌ప్రెస్ (15114) లక్నోకు చేరుకున్న తర్వాత, ఒక పారిశుధ్య కార్మికుడు ఎస్ వన్ స్లీపర్ కోచ్ (217570 NER S1) శుభ్రం చేయడానికి లోపలికి వెళ్ళాడు. ఒక బెర్త్ కింద అనుమానాస్పదంగా ఉన్న ఒక బాక్సు, ఒక బ్యాగ్‌ను గమనించిన అతను వెంటనే అప్రమత్తమై సీనియర్ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎప్), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
పెట్టెలో మొండెం.. మరో బ్యాగులో కాళ్లు, చేతులు
పోలీసులు ఆ బాక్సును తెరిచి చూడగా, అందులో సుమారు 30 నుండి 35 ఏళ్ల వయసున్న ఒక మహిళ మొండెం మాత్రమే కనిపించింది. దాని పక్కనే ఉన్న మరో బ్యాగులో పాలిథిన్ కవర్‌లో చుట్టి ఉన్న ఆమె కాళ్లు, చేతులు లభ్యమయ్యాయి. వెంటనే ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పంచనామా నిర్వహించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతురాలి గుర్తింపు ఆరా
మే 17 ఆదివారం నాడు ఈ భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చినట్లు జీఆర్పీ అధికారులు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. వివిధ మార్గాల ద్వారా ఆ మహిళ ఎవరనేది గుర్తించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం అధికారులు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే, పొరుగు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను సైతం సేకరిస్తున్నారు.


