భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (మే 18) ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో కుప్పకూలిన సూచీలు ద్వితీయార్థంలో దేశీయ కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,043 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమైనప్పటికీ ముగింపు సమయానికి నష్టాలన్నింటినీ పూడ్చుకుని స్వల్ప లాభాల్లోకి చేరుకున్నాయి. చివరకు నిఫ్టీ 50 సూచీ 6 పాయింట్లు పుంజుకొని 23,649 వద్ద, సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 75,315 వద్ద స్థిరపడ్డాయి.
ఆరంభ పతనానికి కారణాలు
అమెరికా-ఇరాన్ మధ్య సరికొత్తగా రేగిన ఉద్రిక్తతలు, గల్ఫ్ రీజియన్‌లో డ్రోన్ దాడుల వార్తలు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి. ఇది గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 111 డాలర్ల మార్కును దాటింది. భారతదేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున క్రూడాయిల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను, కరెంట్ అకౌంట్ లోటు ఆందోళనలను పెంచింది.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 4.60% దాటడంతో భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 96.2 మార్కుకు బలహీనపడింది. ఇది విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు 1 శాతానికి పైగా నష్టపోగా నేడు ఆసియా మార్కెట్లయిన జపాన్ నిక్కీ, హ్యాంగ్ సెంగ్ సైతం నష్టాల్లో ట్రేడ్ అవ్వడం దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.
ముగింపులో రికవరీకి కారణాలు
రూపాయి బలహీనపడటం ఐటీ, ఎగుమతి ఆధారిత రంగానికి లాభసాటిగా మారడంతో ఇన్వెస్టర్లు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్ల వైపు మొగ్గు చూపారు.
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ షేరు నేడు సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను దాటేసి రూ.11.80 లక్షల కోట్లతో దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ క్యాప్ గల కంపెనీగా నిలిచింది. ఈ స్టాక్ ర్యాలీలో కీలక పాత్ర పోషించింది.
దేశీయంగా మార్చి త్రైమాసికం (2026 క్యూ4) ఆర్థిక ఫలితాల సీజన్ నడుస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో 10% వృద్ధి నమోదు చేయడం, టాటా స్టీల్ నికర లాభం రెండింతలు పెరగడం వంటి అంశాలు మార్కెట్‌కు స్థిరత్వాన్ని ఇచ్చాయి.
నిఫ్టీ 23,300 స్థాయికి పడిపోయిన తరుణంలో విలువ ఆధారిత కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దిగువ స్థాయిల వద్ద దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేయడంతోపాటు ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్‌లో షార్ట్ కవరింగ్ జరగడం వల్ల సూచీలు రికవరీ అయ్యాయి.
ప్రస్తుతానికి దేశీయ ఆర్థిక మూలాధారాలు బలంగా ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల గమనం రాబోయే రోజుల్లో మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించడం శ్రేయస్కరం.
ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!


