మే చివరినాటికి ‘కేఫే-3’ నిబంధనలు | India Set Notify CAFE Phase 3 Rules May End Ethanol Roadmap Pushes Auto Industry | Sakshi
Sakshi News home page

మే చివరినాటికి ‘కేఫే-3’ నిబంధనలు

May 18 2026 2:40 PM | Updated on May 18 2026 3:00 PM

India Set Notify CAFE Phase 3 Rules May End Ethanol Roadmap Pushes Auto Industry

దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని మలుపు తిప్పే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేపే) ఫేజ్-3 నిబంధనల నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధమైంది. ఇథనాల్ రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా చివరి నిమిషంలో కొన్ని సాంకేతిక మార్పులు (E25 రీకాలిబ్రేషన్) జరిగినప్పటికీ ఈ నెల చివరి నాటికే తుది నిబంధనలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) తుది ఫార్ములాను సిద్ధం చేస్తోంది.

ప్రధాని కార్యాలయం పర్యవేక్షణ..

భారతదేశ ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించడం, పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ అడుగులు వేస్తోంది. ఈ వ్యవహారాన్ని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నేరుగా పర్యవేక్షిస్తుండటం దీని ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

కేఫే నిబంధనల ఉద్దేశం

వాహనాల ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. సరళంగా చెప్పాలంటే ఒక వాహన తయారీ సంస్థ (ఉదాహరణకు మారుతి సుజుకి లేదా టాటా మోటార్స్) ఒక ఆర్థిక సంవత్సరంలో విక్రయించే అన్ని కార్ల సగటు ఇంధన వినియోగం, ఉద్గారాలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడి ఉండాలి.

E20 నుంచి E25/E27 వైపు..

ఇథనాల్ బ్లెండింగ్‌ను E20 (20% ఇథనాల్) నుంచి E25/E27 (25%-27% ఇథనాల్) స్థాయికి వేగంగా తీసుకెళ్లాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఫార్ములాను మారుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మార్పుల కేఫే-3 లక్ష్యాల్లో ఎటువంటి మార్పు ఉండదని కేవలం ఇంధన రసాయన లక్షణాల ఆధారంగా లెక్కించే పద్ధతిని మాత్రమే సవరించినట్లు నిపుణులు స్పష్టం చేశారు. దీనివల్ల ఇథనాల్ వాడకం వల్ల వాహన సామర్థ్య అంచనాలో ఆటోమొబైల్ కంపెనీలకు నష్టం జరగదు. ‘చర్చలన్నీ పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకల్లా తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వాహన తయారీదారులు తమ భవిష్యత్తు ఇంజిన్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంది’ అని ఈ చర్చల్లో పాల్గొన్న ఒక సీనియర్ ఆటోమొబైల్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

ఆటోమొబైల్ కంపెనీలకు 11 నెలల గడువు

ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుంచి అమలులోకి రానున్నాయి. మే చివరినాటికి నోటిఫికేషన్ వస్తే వాహన తయారీ కంపెనీలకు సన్నద్ధమవడానికి కేవలం 11 నెలల సమయం మాత్రమే మిగులుతుంది. ఈ నిబంధనల ఆధారంగానే ఈవీలు, హైబ్రిడ్‌, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ఇచ్చే కంప్లయన్స్ క్రెడిట్లను లెక్కిస్తారు. ఏ సాంకేతికత కలిగిన వాహనాల తయారీ చౌకగా మారుతుందో, ఏవి ఖరీదవుతాయో ఈ నిబంధనలే డిసైడ్ చేయనున్నాయి.

స్పష్టత వస్తేనే పెట్టుబడులు

వాహన తయారీదారులు ఇప్పటికే ఆర్థిక సంవత్సరం 2028కి సంబంధించిన ప్రొడక్ట్ ప్లానింగ్‌లో ఉన్నారు. నిబంధనలపై స్పష్టత వస్తేనే సప్లయర్లతో ఒప్పందాలు, ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడం కంపెనీలకు సాధ్యమవుతుంది. రాబోయే దశాబ్ద కాలంలో భారత ఆటోమొబైల్ రంగం ఏ దిశగా సాగాలో నిర్దేశించే ఈ రూల్‌బుక్ కోసం పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఇదీ చదవండి: రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి!

Advertisement
 
Advertisement
Advertisement