సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే విమర్శలు చేయడం లేదా అంచనా వేయడం సరి కాదని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. మదురై విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని ఆయన కోరారు.
రెండు రోజుల్లో చెబితే అది జోస్యం అవుతుంది..
సీఎం విజయ్ పాలన ఎలా ఉందనే ప్రశ్నపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. ‘విజయ్ ముఖ్యమంత్రి అయి రెండు రోజులే అవుతోంది. అప్పుడే ఆయన పాలన ఎలా ఉందో చెప్పమంటే అది జోస్యం చెప్పినట్లే అవుతుందని చమత్కరించారు. ఆరు రోజుల్లోనో, పదిహేను రోజుల్లోనో ప్రభుత్వ పనితీరుపై సమీక్షలు చేయడం కూడా అంతే అని వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం స్థిరపడటానికి, వారి విధానాలు అమలు కావడానికి కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని కమల్ పేర్కొన్నారు.
ప్రజలు నమ్మి ఓటేశారు..
రాజకీయాల్లోకి కొత్త రక్తం రావడంపై స్పందిస్తూ... కొత్తవాళ్లు చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే రాజకీయాలకు ఇది కొత్తేమీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బాధ్యతలు స్వీకరించిన వారంతా కొత్తవారేనని పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి, ఆ పాలన సజావుగా సాగుతుందా లేదా అనేది గమనించాలన్నారు. తాము కూడా దాన్నే గమనిస్తున్నాం అని చెప్పారు.
తమిళనాట పుడితే అది ద్రావిడ పార్టీనే
తమిళనాడు రాజకీయ సిద్ధాంతాలపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తన ఉద్దేశం ప్రకారం.. తమిళనాడులో తమిళం మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తే, అది కచ్చితంగా ద్రావిడ పార్టీనే అవుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ.. నూతన విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయాలని ఎవరూ బలవంత పెట్టలేరని స్పష్టం చేశారు.
మా ఇద్దరి మధ్య కేవలం పోటీ మాత్రమే
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యల (ఒకవేళ కమల్ సీఎం అయినా తనకు అసూయ ఉండదన్న వ్యాఖ్యల) ప్రస్తావన రాగా, కమల్ హాసన్ వారి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. తాను, రజనీకాంత్ ఎప్పుడూ ఒకరిని చూసి ఒకరం అసూయ పడలేదన్నారు. అయితే, తమ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదన్నారు. తాము సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పోటీ పడ్డాం.. ఒకవేళ మేం క్రికెట్ ఆడి ఉన్నా సరే, ఇలాగే పోటీ పడేవాళ్లం తప్ప అసూయ పడేవాళ్లం కాదన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం విజయ్ ప్రభుత్వానికి ఇప్పుడే మార్కులు వేయకుండా, కొంతకాలం వేచి చూడాలనే రజినీకాంత్ అభిప్రాయాన్ని కమల్ హాసన్ కూడా సమర్థించడం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.


