ప్రముఖ కంటెంట్ క్రియేటర్, ఫిన్‌ఫ్లూయెన్సర్ అంకుర్ వారికూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎడ్యుకేషన్ రంగంలో ఎంతో విజయవంతంగా నడుస్తూ దాదాపు రూ.100 కోట్ల బిజినెస్ సామ్రాజ్యంగా ఎదిగిన తన ఆన్‌లైన్ లెర్నింగ్ (అప్‌స్కిల్లింగ్ కోర్సులు) వేదికను మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో అటు వ్యాపార వర్గాలు, ఇటు నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గత ఆరేళ్లుగా అద్భుతమైన ఆర్థిక వృద్ధిని కనబరుస్తున్నప్పటికీ ఈ వ్యాపారాన్ని ఇకపై ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి అర్థం లేదు అని వారికూ స్పష్టం చేయడం గమనార్హం.
రూ.100 కోట్ల విక్రయాలు.. రూ.25 కోట్ల లాభాలు!
తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ అంకుర్ వారికూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ‘రూ.100 కోట్ల విలువైన నా కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నాను. 2020లో మేము ఈ వెంచర్‌ను ప్రారంభించినప్పుడు ఇది ఇంతటి భారీ విజయాన్ని అందుకుంటుందని నేను ఊహించలేదు. ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు మా కోర్సుల్లో చేరారు. రూ.100 కోట్ల అమ్మకాలు జరిగాయి, అలాగే రూ.25 కోట్ల నికర లాభాలను కూడా ఆర్జించాం. వ్యాపారపరంగా ఇంత పెద్ద సక్సెస్ ఉన్నప్పటికీ.. దీనిని ఇలాగే కొనసాగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు’ అని వారికూ పేర్కొన్నారు. అయితే, ఈ హఠాత్తు నిర్ణయానికి గల పూర్తి కారణాలను, తన తదుపరి కార్యాచరణను త్వరలో ఒక ప్రత్యేక వీడియో ద్వారా పంచుకోనున్నట్లు ఆయన తెలిపారు.
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై తిరుగులేని సామ్రాజ్యం
2020లో కోర్సుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన అంకుర్ వారికూ, చాలా తక్కువ సమయంలోనే దేశంలోనే టాప్ కంటెంట్ క్రియేటర్లలో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా యువతకు కెరీర్ గైడెన్స్, పర్సనల్ ఫైనాన్స్, టైమ్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై కోర్సులను అందిస్తూ భారీ డిజిటల్ ఉనికిని చాటుకున్నారు. ప్రస్తుతం ఆయనకు.. యూట్యూబ్‌లో 7 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 4 మిలియన్ల ఫాలోవర్లు, ఎక్స్‌లో 7 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
వారికూ చేసిన ఈ ప్రకటన డిజిటల్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఆన్‌లైన్ కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నారా? అని ఒక యూజర్ ప్రశ్నించగా.. వారికూ సమాధానమిస్తూ.. ‘అవును, అది కూడా ఒక కారణంగా ఉంది’ అని బదులివ్వడం ఐటీ, ఎడ్‌టెక్ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరికొందరు నెటిజన్లు దీన్ని విమర్శిస్తున్నారు. ఇదంతా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా హైప్ క్రియేట్ చేయడానికి చేస్తున్న గిమ్మిక్ (పబ్లిసిటీ స్టంట్) అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు


