సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పాత ఉద్యోగాలను వేగంగా మార్చేస్తోంది. గ్లోబల్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) దిగ్గజం సేల్స్ఫోర్స్ ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐ కార్యకలాపాల నేపథ్యంలో అంతర్గత పునర్నిర్మాణం, బడ్జెట్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా సాంప్రదాయక విధుల్లో ఉన్న సుమారు 3,000 మంది ఉద్యోగులను కొత్త నైపుణ్యాలతో సేల్స్ విభాగంలోకి మళ్లించినట్లు కంపెనీ చీఫ్ డిజిటల్ ఎవాంజెలిస్ట్ వాలా అఫ్షర్ వెల్లడించారు. మే 18న తన తొలి అధికారిక భారత పర్యటనలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్
గతంలో మానవ వనరులు అవసరమైన కొన్ని తక్కువ ప్రభావం చూపే పనులను ఇప్పుడు ఏఐ ఏజెంట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని వాలా అఫ్షర్ పేర్కొన్నారు. దీనివల్ల కంపెనీలో మిగిలిన ప్రతిభావంతులైన ఉద్యోగులను తొలగించకుండా వారికి తగిన శిక్షణ ఇచ్చి సేల్స్ ఫంక్షన్కు అనుగుణంగా మార్చినట్లు తెలిపారు.
‘ఏఐ ఏజెంట్ల వినియోగం భారీగా పెరిగింది. ఇప్పటివరకు ఆయా పనులు నిర్వహించిన ఉద్యోగులకు రీ-స్కిలింగ్ అందించాం. బయటి నుంచి ఎవరినీ కొత్తగా నియమించుకోకుండానే అంతర్గత వ్యాపార విభాగాల నుంచే ఈ 3,000 మందిని సేల్స్ పాత్రల్లోకి డిప్లాయ్ చేశాం. ఈ ప్రక్రియ బడ్జెట్ వ్యయాలపై కూడా ప్రభావం చూపుతుంది. బడ్జెట్లు మారుతాయి. కొన్నిసార్లు నాయకత్వ శైలి మారుతుంది. దీనివల్ల మధ్యస్థాయి మేనేజ్మెంట్ తగ్గి కంపెనీ మరింత సమర్థంగా మారుతుంది. అందుకు అనుగుణంగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్లను కూడా పునసమీక్షించుకోవాల్సి ఉంటుంది’ అని వాలా అఫ్షర్ చెప్పారు.
2024లోనే కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ బెనియోఫ్ కోడింగ్, ఉత్పాదకత పెంపునకు ఏఐ సాధనాలే సరిపోతాయని, భవిష్యత్తులో ఎక్కువ మంది ఇంజినీర్లను నియమించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. తాజా వ్యూహం దానికి అద్దం పడుతోంది. 2026 నాటికి ఆంత్రోపిక్ టోకెన్ల కోడింగ్ అవసరాల కోసమే కంపెనీ దాదాపు 300 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని బెనియోఫ్ అంచనా వేశారు.
ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!


