ఐటీఆర్‌ ఫైలింగ్‌.. జూలై 31 లాస్ట్ డేట్! | ITR-1 Complete Guide to Eligibility Rules and Filing Process | Sakshi
Sakshi News home page

ఐటీఆర్‌ ఫైలింగ్‌.. జూలై 31 లాస్ట్ డేట్!

May 18 2026 11:52 AM | Updated on May 18 2026 3:22 PM

ITR-1 Complete Guide to Eligibility Rules and Filing Process

2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మీరు వేయవలసిన ఆదాయపు రిటర్నులలో రెండు ఫారాలు ఉంటాయి. ఒకటి నంబర్‌ 1, రెండోది నంబర్‌ 4. వీటిని దాఖలు చేయడానికి డిపార్టుమెంటు వారి తరఫున ప్లాట్‌ఫాం రెడీ అయ్యింది. ఇందుకు అవసరమైన యుటిలిటీలను, సాధనాలను వారు సన్నద్ధం చేశారు. ఈ వారం ఐటీఆర్‌1 గురించి తెలుసుకుందాం. దీన్నే సహజ్‌ అని కూడా అంటారు. మీరు ఆన్‌లైన్‌ ద్వారా లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా వేయొచ్చు.

ఎవరు దాఖలు చేయొచ్చు..
కేవలం రెసిడెంట్‌ వ్యక్తులైన వారు మాత్రమే ఈ ఫారం ఐటీఆర్‌–1 లేదా సహజ్‌ వేయగలరు. ఇతరులెవ్వరూ ఈ ఫారంను వేయడానికి లేదు.  

ఎంత ఆదాయం వచ్చే వారు వేయొచ్చు.. 
ఈ కింది మార్గాల్లో ఆదాయాలు వచ్చే వారు ఈ ఫారం వాడాలి.  

  • పెన్షన్

  • జీతాలు

  • ఒకటి/రెండు ఇళ్ల మీద ఇంటద్దె వచ్చే వాళ్లు

  • ఇతర ఆదాయం

  • వ్యవసాయ ఆదాయం రూ. 5000 లోపు ఉన్న వారు

ఇతర షరతులు..
మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటిన వారు ఈ ఫారం కింద ఆదాయం డిక్లేర్‌ చేయకూడదు. భార్య ఆదాయం, పిల్లల ఆదాయం, భర్త కేసులో కలిపే సందర్భం ఏర్పడితే, రూ. 50,00,000 దాటనంత వరకు ఈ ఫారం వాడొచ్చు. రూ. 1,25,000 లోపల లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ఉంటే, అటువంటి వారు ఫారం 1 వాడొచ్చు.

ఏయే కాగితాలు ఉండాలి..
పాత చట్టం ప్రకారం 16, 16ఎ, ప్రీమియం మొదలైన వాటి రశీదులు, అద్దె రశీదులు, మొదలైనవి మీ ఫైల్‌లో ఉండాలి. రిటర్నుతో పాటు జతపరచనవసరం లేదు కానీ రెడీగా ఉంచుకోండి.

ఎవరు ఫారం 1 దాఖలు చేయకూడదు..

  • మీ మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితే.

  • వ్యవసాయం మీద నికర ఆదాయం రూ. 5,000 దాటితే.

  • లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ రూ. 1,25,000 దాటితే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎలాగు రూ. 1,25,000 వరకు మినహాయింపు ఉంటుంది. లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ రూ. 1,250,000 వరకు పన్ను భారం ఉండదు.  

  • వృత్తి మీద ఆదాయం ఉన్నవారు.

  • వ్యాపారం మీద ఆదాయం ఉన్నవారు.

  • ఒకటి, రెండు దాటి .. అంటే మూడో ఇంటి మీద ఆదాయం వచ్చే వాళ్లు వేయకూడదు.

  • ఏదైనా కంపెనీలో డైరెక్టర్‌ అయితే

  • అన్‌లిస్టెడ్‌ ఈక్విటీ షేర్ల మీద ఆదాయం ఉంటే

  • విదేశాల్లో ఆస్తులున్నా, వాటి మీద హక్కులున్నా

  • మీరు నాన్‌ రెసిడెంటు అయినా

  • విదేశాల నుంచి ఆదాయం ఉన్నా

  • 194ఎన్‌ (పాత చట్టం) ప్రకారం టీడీఎస్‌ రికవరీ అయితే, అతి పెద్ద నగదు విత్‌డ్రాయల్స్‌ మీద

  • ఉద్యోగస్తుల స్టాక్‌ / షేర్ల మీద ఎటువంటి చెల్లింపులు, రికవరీలు ఉన్నా

  • గత సంవత్సరపు సర్దుబాటు నష్టాలున్నా

  • ఏ ఆదాయం నుంచైనా సర్దుబాటు చేయాల్సిన నష్టాలున్నా

చివరగా..
ఫైలింగ్‌ చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31. ఆన్‌లైన్‌లో వేయొచ్చు లేదా ఎక్సెల్‌లాంటి యుటిలిటీ ద్వారా డౌన్‌లోడ్‌ చేసి దాఖలు చేసుకోవచ్చు. ఎన్నెన్నో సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. మీరే స్వయంగా వేయొచ్చు లేదా వృత్తి నిపుణులు ఉన్నారు. సమాచారం సరైనది. సమగ్రమైనది. సంపూర్ణమైనది. రెడీగా ఉంటే సరైనదే, సమగ్రంగా, సంపూర్ణంగా, రెడీగా ఉంటే సులభతరంగా వేయొచ్చు. ఫారంలు చాలా స్నేహపూర్వకంగానే ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement