ఎఫ్‌ఐఐ వర్సెస్‌ డీఐఐ రిటైలర్లు చూడని కథేంటి?  | Explanation Of FII and DII Investors Special Story | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఐఐ వర్సెస్‌ డీఐఐ రిటైలర్లు చూడని కథేంటి? 

May 18 2026 1:18 AM | Updated on May 18 2026 1:18 AM

Explanation Of FII and DII Investors Special Story

దేశీ ఇన్వెస్టర్లతో పోలిస్తే ఎఫ్‌ఐఐల చేతిలో ఆయుధాలెక్కువ

అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా కదలికలు

ముడిచమురు, బంగారం, వెండి, డాలర్‌ కదలికలను బట్టి నిర్ణయాలు

ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచుతుంటే ఇక్కడ ఎఫ్‌ఐఐల అమ్మకాలు సహజం

ఎందుకంటే రూపాయి పతనమైతే వారికి షేర్లలో వచ్చిన లాభాలు ఆవిరి

భౌగోళిక అనిశ్చితులను దృష్టిలో పెట్టుకునే కొన్నాళ్లుగా విక్రయాలు

‘సిప్‌’లతో దేశీ ఫండ్లలో పెరిగిన బలం... కొనుగోళ్లతో గట్టి మద్దతు

పదేళ్ల కిందట ఇలా ఎఫ్‌ఐఐలు విక్రయిస్తే మార్కెట్లు కుదేలయ్యేవి

దేశీయంగా ఫండ్ల బలం పెరిగిందనటానికి ప్రస్తుత మద్దతే నిదర్శనం

రిటైలర్లు ఇవన్నీ కాకుండా... కొనే కంపెనీల్లో సత్తాను చూస్తే బెటర్‌

దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో పెట్టుకుని విలువైన కంపెనీలను కొంటే చాలు

కొంచెం ఓపిక పడితే వాటితోనే సంపద సృష్టి సాధ్యం  

రమణమూర్తి మంథా 
‘‘ఈ రోజు ఎఫ్‌ఐఐలు రూ.5,000 కోట్ల విలువైన షేర్లు అమ్మారు. డీఐఐలు రూ.5,267 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.’’  క్రికెట్‌ స్కోరులా కొన్నాళ్లుగా ఇన్వెస్టర్లు రోజూ ఇదే వార్త చూస్తున్నారు. అంకెలు మారొచ్చు కానీ... అమ్ముతున్నది ఎఫ్‌ఐఐలే. 

కొంటున్నది దేశీ ఫండ్లే. ఎందుకిలా? విదేశీ ఇన్వెస్టర్లకు మన మార్కెట్లపై విశ్వాసం తగ్గుతోందా? లేదా మన దేశీ మ్యూచువల్‌ ఫండ్లు బలోపేతమయ్యాయా? నిజమేంటి? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిందొక్కటే. ఇదేదో స్మార్ట్‌ మనీకి, నడమంత్రపు సిరికి జరుగుతున్న యుద్ధమేమీ కాదు. రెండు భిన్నమైన పవర్‌ సెంటర్ల మధ్య పోరాటం. కాకపోతే ఎఫ్‌ఐఐల దగ్గరున్న ఆయుధాలు పెద్దవి. ఆ ఆయుధాల్ని ఎలా వాడతారో వివరించేదే ఈ వెల్త్‌ స్టోరీ...

దేశీ ఫండ్లు ప్రధానంగా భారత స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల గురించే ఆలోచిస్తుంటాయి. కానీ విదేశీ ఫండ్లు అమెరికా వడ్డీ రేట్లను, డాలర్‌ కదలికల్ని, ముడిచమురు– బంగారం ధరల్ని, బాండ్‌ ఈల్డ్స్‌ని, కమోడిటీ సైకిల్స్‌ని, గ్లోబల్‌ లిక్విడిటీని గమనిస్తుంటాయి. ఇదే పెద్ద తేడా. మన దేశీ ఫండ్లు ఒక బోర్డ్‌పై చెస్‌ ఆడుతుంటే... విదేశీ ఫండ్లు ఒకేసారి పది బోర్డులపై ఆడుతుంటాయి. అలాగని ఎఫ్‌ఐఐలే ఎప్పుడూ గెలుస్తారని కాదు. రిస్క్ లను వాళ్లు ముందే గమనిస్తారన్నది మాత్రం వాస్తవం.

ఎఫ్‌ఐఐలు ఎందుకు చేస్తారంటే...
ఉదాహరణకు అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచిందనుకోండి. తక్షణం అమెరికన్‌ బాండ్లు ఆకర్షణీయంగా మారతాయి. డాలర్‌ బలపడి... ఎమర్జింగ్‌ మార్కెట్ల కరెన్సీలు వీక్‌గా మారతాయి. భారత్‌ వంటి మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కెళ్లటం జరిగిపోతాయి. అంతేతప్ప ఇన్ఫోసిస్‌ ఒక్కరోజులో మారిపోవటమో, హెచ్‌డీఎఫ్‌సీ నష్టాల్లోకి జారిపోవటమో, ఎయిర్‌టెల్‌ సబ్ర్‌స్కయిబర్లను కోల్పోవటమో జరగలేదని గుర్తుంచుకోవాలి. ఎఫ్‌ఐఐలు విక్రయించారంటే దానర్థం... వారికి ఎక్కువ లాభాలు వచ్చే మార్కెట్లోకి డబ్బును మళ్లిస్తున్నారని. అందుకే కొన్నిసార్లు కంపెనీల ఫలితాలు అదరగొట్టినా మార్కెట్లు మాత్రం పడిపోతూ ఉంటాయి.  

కరెన్సీయే ప్రధాన సమస్య!
ఇన్వెస్టర్లు పొరపడేది ఇక్కడే. ఎందుకంటే మన ఇన్వెస్టర్లు రూపాయిల్లో ఆలోచిస్తే విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లలో ఆలోచిస్తారు. ఒకవేళ మన మార్కెట్లలో 10 శాతం లాభం వచ్చినా... రూపాయి గనక 8 శాతం పడిపోతే నికరంగా విదేశీ ఇన్వెస్టరుకు దక్కేది 2శాతం లాభమే. అందుకే ఎఫ్‌ఐఐలు రూపాయి కదలికల్ని, దిగుమతి బిల్లు పెంచే చమురు, బంగారం, వెండి ధరల్ని, ద్రవ్యలోటును, ఆర్‌బీఐ పాలసీని నిశితంగా గమనిస్తుంటారు. వీటిలో దేన్నీ దేశీ ఇన్వెస్టర్లు నియంత్రించే పరిస్థితి లేదు. దేశంలోని అత్యుత్తమ మ్యూచువల్‌ ఫండ్లు కూడా పెరుగుతున్న డాలర్‌తో పోరాడే పరిస్థితి లేదు.  

మాటే... బంగారం 
మార్కెట్ల పరిస్థితిని ముందు చెప్పేది బంగారమే. ఎందుకంటే అనిశ్చితి పెరుగుతున్న కొద్దీ బంగారం ధరలు పెరిగి.. డాలర్‌ బలోపేతమవుతుంది. ఎమర్జింగ్‌  మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు జాగ్రత్తపడతారు. బంగారమంటే కేవలం నగలు కాదు. అంతర్జాతీయంగా ఇదో థర్మామీటర్‌. ఇటీవల ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులన్నీ దూకుడుగా బంగారం కొన్నాయి. ఎందుకని? భౌగోళిక అనిశ్చితి పెరిగి కరెన్సీ ఊగిసలాడుతుందని, వృద్ధి మందగిస్తుందని అవి ఊహించడం వల్లే. ఈ సంకేతాల్ని మొదట అందుకునేది విదేశీ ఇన్వెస్టర్లే.  

రిటైలర్లు చేయాల్సిందేంటి?
రిటైలర్లు గమనించాల్సిందొకటే. ఎవరు అమ్ముతున్నారు... ఎవరు కొంటున్నారని కాదు. దేన్ని అమ్ముతున్నారు... దేన్ని కొంటున్నారనేది. ఎఫ్‌ఐఐలు భయపడి అమ్మేస్తున్నపుడు కొంటే దీర్ఘకాలంలో సంపద  సృష్టి సాధ్యమేనని నిరూపించిన కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, టైటాన్‌ కంపెనీ, ఐటీసీ వంటివి ఉన్నాయి. బలమైన క్యాష్‌ ఫ్లో, మార్కెట్‌ లీడర్‌షిప్, దీర్ఘకాల చరిత్ర వీటి సొంతం. ఎఫ్‌ఐఐలు విక్రయించేసినంత మాత్రాన వీటి వృద్ధి దెబ్బతినదు. కానీ రిటైలర్లు ఇవన్నీ పట్టించుకోకుండా రాకెట్లలా పెరుగుతున్న షేర్ల వెంట పరుగులు తీస్తేనే సమస్య వస్తుంది. డిఫెన్స్, పీఎస్‌యూ, రెన్యూవబుల్‌ ఎనర్జీ, కొత్త తరం టెక్‌ కంపెనీలంటూ స్టోరీలు ప్రత్యక్షమై... ఆ స్టోరీల వెంబడి కొన్ని షేర్లు హద్దూ అదుపూ లేకుండా పెరగటం... వాటి వెనక పడటమే అసలైన ప్రమాదకరం. ఎందుకంటే కంపెనీల ఆదాయాలు గనక వాటి షేర్ల ధరను ప్రతిఫలించకపోతే విదేశీ ఇన్వెస్టర్లు పట్టించుకోరు. అందుకే వారు లాభాలతో బయటపడతారు.

గెలిచేదెవరంటే...? 
ఎఫ్‌ఐఐలు విక్రయిస్తున్నంత మాత్రాన రిటైలర్లు భయపడాల్సిన పని లేదు. ఎందకంటే ఎఫ్‌ఐఐలు– డీఐఐల లక్ష్యాలు వేరు. ఎఫ్‌ఐఐలు గ్లోబల్‌ అలొకేషన్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ గురించి ఆలోచిస్తే... డీఐఐలు సిప్‌ పెట్టుబడులు, రిటైర్మెంట్‌ నిధి, బీమా నిధులు, దేశ దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో పెట్టుకుంటారు. దీనివల్ల ఆసక్తికర పరిస్థితులు తలెత్తుతాయి. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ఎఫ్‌ఐఐలు విక్రయిస్తే... దేశ దీర్ఘకాలిక వృద్ధిలో భాగమయ్యే షేర్లను డీఐఐలు కొంటుంటారు. అంటే... ఇద్దరూ గెలిచినట్టే.  

భారత్‌ది నిర్మాణాత్మక బలం.. 
స్టోరీలను పక్కనబెడితే దేశీయంగా బలమైన ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యవస్థ ఉంది. నెలవారీ సిప్‌ ప్రవాహాలు చాలా బలంగా ఉంటున్నాయి. మార్కెట్లలోకి బీమా, పింఛన్‌ నిధుల రాక పెరిగింది. డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య పెరుగుతోంది. ఇదో నిర్మాణాత్మక మార్పు.  

ఓ పదేళ్ల కిందట చూస్తే... ఈ స్థాయిలో ఎఫ్‌ఐఐలు గనక షేర్లను విక్రయిస్తే మార్కెట్లు కుప్పకూలేవి. కానీ ఇపుడు డీఐఐలు ఆదుకోగలుగుతున్నాయి. కాకపోతే ఈ మద్దతును ఆధిపత్యంగా చూడలేం. ఎందుకంటే లిక్విడిటీని, విలువను, కరెన్సీని, ఆఖరికి మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగలిగేది విదేశీ ఇన్వెస్టర్లే. దీన్ని విస్మరించలేం.  

మార్కెట్‌ని మార్కెట్‌గానే చూడాలి... 
విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించినంత మాత్రాన అదేదో చెత్త కంపెనీ అని... డీఐఐలు కొన్నంత మాత్రాన మంచి కంపెనీ అని అనుకోవటానికి లేదు. ఆదాయం, క్యాష్‌ ఫ్లో, గవర్నెన్స్‌ బాగున్న కంపెనీలనే మార్కెట్‌ ఆదరిస్తుంది. ఓపిగ్గా వేచిచూడటంతో పాటు, విలువల పరంగా క్రమశిక్షణ చూపించే ఇన్వెస్టర్లకే లాభాలొస్తాయి.  

Advertisement
 
Advertisement
Advertisement