పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో జనవరి–మార్చి త్రైమాసికంలో తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు వార్షికంగా 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పడిపోయాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. ఇటీవలి కాలంలో 18 త్రైమాసికాల తర్వాత అమ్మకాలు లక్ష యూనిట్ల మార్కు కంటే దిగువకు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ తేల్చింది. దేశంలో అలాంటి అమ్మకాల తగ్గుదల చూసిన తొమ్మిది ప్రధాన నగరాలైన ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, నవీ ముంబై, థానే, బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా ఉన్నట్లు తెలిపింది.
నగరాల వ్యాప్తంగా పరిస్థితి ఇదీ..
ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం.. చెన్నైలో గృహాల అమ్మకాలు 4 శాతం తగ్గాయి. హైదరాబాద్‌లో 16 శాతం పడిపోయాయి. ముంబైలో 20, నవీ ముంబైలో 14 శాతం, థానెలో 24 శాతం, పుణెలో 25 శాతం పడిపోయాయి. చివరగా కోల్‌కతాలో గృహాల విక్రయాలు 8 శాతం తగ్గాయి. బెంగళూరులో 3 శాతం కొనుగోళ్లు పెరిగాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో గృహ విక్రయాలు 13 శాతం పెరిగాయి.
మొత్తంగా చూస్తే..
గత ఏడాది జనవరి–మార్చి కాలంలోని 1,13,602 యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది నివాస గృహాల అమ్మకాలు 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పడిపోయాయి. తొమ్మిది నగరాల్లో మొత్తం అమ్మకాలు గత త్రైమాసికంలోని(అక్టోబర్–డిసెంబర్ 2025) 1,05,527 యూనిట్లతో పోలిస్తే 6 శాతం తగ్గాయి. అయితే ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు నగరాలు దీనికి మినహాయింపుగా నిలిచాయి.
డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక..
గత ఏడాది జనవరి–మార్చి కాలంతో పోలిస్తే 2026 మొదటి త్రైమాసికంలో దాదాపు 22 వేల యూనిట్లు తక్కువగా సరఫరా అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 1,14,718 యూనిట్లతో పోలిస్తే, కొత్త గృహాల సరఫరా 19 శాతం తగ్గి 92,411 యూనిట్లకు పడిపోయింది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం తగ్గడానికి పశ్చిమ ఆసియా యుద్ధంతో ఏర్పడిన అనిశ్చితి కొనుగోలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.


