సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు కేవలం శారీరక శ్రమతో కూడిన పనులకే పరిమితమవుతుందని భావించిన ఆటోమేషన్ ఇప్పుడు ఏకంగా మేధోసంపత్తితో కూడిన వైట్-కాలర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. రాబోయే 12 నుంచి 18 నెలల్లోనే కార్పొరేట్ ప్రపంచంలో అకౌంటెంట్లు, న్యాయవాదులు, మార్కెటింగ్ నిపుణుల ఉద్యోగాలు కనుమరుగయ్యే లేదా పూర్తిగా ఆటోమేట్ అయ్యే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ డివిజన్ హెడ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరిక చేశారు.
మానవ మేధస్సుకు సవాల్
గతంలో ఆంత్రోపిక్ అధినేత డారియో అమోడీ వంటి టెక్ దిగ్గజాలు ఊహించిన పరిణామాలనే సులేమాన్ తాజా వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. ప్రస్తుతం మానవులు మాత్రమే చేయగలరని భావిస్తున్న అత్యంత సంక్లిష్టమైన వైట్-కాలర్ విధులను 2027 సంవత్సరానికి ముందే ఏఐ చేజిక్కించుకోనుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ప్రభావితమయ్యే రంగాలు..
అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగంలో లెక్కల విశ్లేషణ, ఆడిటింగ్ ప్రక్రియలు పూర్తిగా ఆటోమేట్ అవుతాయి.
లీగల్ వర్క్ (న్యాయ విభాగం)లో కేసుల డాక్యుమెంటేషన్, లీగల్ రీసెర్చ్‌లను ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తుంది.
మార్కెటింగ్, కంటెంట్‌పరంగా వినియోగదారుల ట్రెండ్స్ గుర్తించడం ఏఐ చేతుల్లోకి వెళ్తుంది.
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో వర్క్‌ఫ్లోల సమన్వయం, ప్రణాళికల అమలు మానవ ప్రమేయం లేకుండానే సాగుతుంది.
ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు తమ రోజువారీ కోడింగ్ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఏఐ అసిస్టెంట్లను విస్తృతంగా వాడుతున్నారని, త్వరలోనే కంప్యూటింగ్ సామర్థ్యం పెరిగి మెజారిటీ మానవ ప్రోగ్రామర్ల కంటే ఏఐ మోడల్స్ అత్యుత్తమ కోడింగ్ చేయగలవని ఆయన విశ్లేషించారు.
సహాయకారి నుంచి ప్రత్యామ్నాయంగా!
ప్రస్తుత తరుణంలో ఏఐ కేవలం మనుషుల పనిభారాన్ని తగ్గించే ఒక ఉత్పాదకత సాధనంలాగా మాత్రమే కనిపిస్తోంది. కానీ, ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. కేవలం సహాయం చేసే స్థాయి నుంచి మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేసే దిశగా సాంకేతికత పరిణామం చెందుతోందని సులేమాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
పరిష్కారం ఏంటి?
మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ఇచ్చిన ఈ హెచ్చరిక కేవలం ఊహాజనితం కాదు, ఇది పరిశ్రమ వర్గాలకు ఒక మేల్కొలుపు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మన నైపుణ్యాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేసుకోకపోతే వైట్-కాలర్ ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!


