మొయినాబాద్ పెద్దమంగళారంలో రెవెన్యూ అధికారులు కూల్చేసిన ఇళ్లు
అక్రమ లేఅవుట్‌లో తెలియక ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకున్న గిరిజనులు
కోర్టుకెక్కిన భూయజమాని.. ఇళ్లు కూల్చేయాలని కోర్టు ఆదేశం
జేసీబీలతో కూల్చేసిన అధికారులు.. లబోదిబోమన్న బాధితులు
మొయినాబాద్: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాటలు నమ్మి కొందరు అమాయక గిరిజనులు నిండా మునిగారు. వేరొకరి పట్టా భూమిలో ప్లాట్లు కొని నిర్మాణాలు చేపట్టగా మున్సిపల్ అధికారులు మంగళవారం తెల్లవారుజామున జేసీబీలతో నేలమట్టం చేశారు. దీంతో వారు రోడ్డున పడ్డారు. మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూ 210, 211, 212 సర్వే నంబర్లలో ఉన్న 16 ఎకరాలను హరికిషన్, హర్ష అనే వ్యక్తులు 2019లో అక్రమంగా లేఅవుట్ వేయగా సంతోష్‌నాయక్ అనే మధ్యవర్తి 2020 నుంచి కొడంగల్, పరిగి, షాద్‌నగర్ ప్రాంతాలకు చెందిన ప్రాంతాలకు చెందిన 50 మంది గిరిజనులకు ప్లాట్లు విక్రయించాడు. సబ్‌రిజిస్ట్రార్‌ను మ్యానేజ్ చేసి గిరిజనులకు అక్రమార్కులు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది.
ప్లాట్లు కొన్న వారిలో పది మంది ఇళ్లు నిర్మించుకోగా విదేశాల నుంచి రెండేళ్ల క్రితం తిరిగి వచ్చిన జి.శ్రీనివాస్‌గౌడ్ అనే భూ యజమాని తన స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయంటూ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం మున్సిపల్ అధికారులు పది ఇళ్లను నేలమట్టం చేసి 40 ప్లాట్ల ప్రహరీలను కూల్చేశారు. కళ్ల ముందే తమ కలల సౌధాలు శిథిలాలుగా మారడంతో గిరిజనులు గుండెలవిసేలా రోదించారు. మధ్యవర్తిని నమ్మి రూ. లక్షలు పెట్టి మోసపోయామని లబోదిబోమన్నారు. కనీసం ఇళ్లలోని సామగ్రిని తీసుకెళ్లేందుకు కూడా అధికారులు అవకాశం ఇవ్వలేదని వాపోయారు.
భూమి అమ్మి ప్లాటు కొన్నాం
షాద్‌నగర్ ప్రాంతంలో అర ఎకరం భూమి అమ్మి రెండేళ్ల క్రితం ఇక్కడ ప్లాటు కొని ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. ఇంటికి కరెంటు మీటర్ కూడా ఇచ్చారు. మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలగొట్టారు. సామాన్లన్నీ అందులోనే పోయాయి. ఇప్పుడు మేం ఎక్కడికి పోవాలి? – అంబు, బాధితురాలు
చావే దిక్కు
మా సొంతూరు కొడంగల్. అత్తాపూర్‌లో ఉంటున్నా. నా భర్త చనిపోయాడు. ఐదుగురు పిల్లలు ఉన్నారు. పనిచేసి పిల్లలను సాకుతున్నా. కొన్నేళ్ల కిందట 100 గజాల ప్లాటు కొన్నా. ఈ ప్లాటే ఆధారం అనుకున్నా. ఇప్పుడు నా గతేం కావాలి. నాకు, నా పిల్లలకు చావే దిక్కు. – ముడావత్ సోని, బాధితురాలు


