సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి టీడీపీ నేతల దాష్టీకానికి దిగారు. ఓ ఇంటిని రెండు జేసీబీలతో నేలమట్టం చేసేశారు. ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులను టీడీపీ నేతలు బయటకు లాగి పడేశారు. ఇల్లు కూల్చడం వెనుక టీడీపీకి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డి ఉన్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులను సైతం బలవంతంగా టీడీపీనేతలు బయటకు లాగేశారు. కూల్చిన ఇంటి వద్దే బాధితులు ఆందోళనకు దిగారు.
టీడీపీ నేతలు కూల్చివేసిన ఇంటిని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట పరిశీలకులు సురేష్ బాబు పరిశీలించారు. బాధితులను వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. దళితులమైన తమపై దౌర్జన్యంగా రాత్రికి రాత్రి దాడి చేశారని బాధితులు వివరించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి దగ్గర బంధువులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో జేసీబీలతో ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వందమంది టీడీపీ మూకలు ఒక్కసారిగా ఇంటిపై దాడి చేశారని బాధితులు తెలిపారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్‌సీపీ నేతలు హామీ ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీ నేతలు, అంజాద్ బాషా, సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోందని.. బలహీన వర్గాలు, దళితులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ‘‘అర్ధరాత్రి ఎర్రముక్కపల్లిలో ఎమ్మెల్యే అనుచరులు 100 మంది గుండాలతో దళితుల ఇళ్లను కూల్చివేశారు. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు అని చూడకుండా ఇల్లు కూలదోశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? ఆఫ్గనిస్తాన్ లో ఉన్నామా..?. ఎమ్మెల్యే అనుచరుల కన్ను పడితే దాడులు చేసి దోచుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో దళితులని కూడా చూడకుండా రోడ్డున పడేశారు. ఈ ఇళ్ల కూల్చివేతను వైఎస్సార్సీపీ పూర్తిగా ఖండిస్తున్నాం

..రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు దీన్ని ఖండిచాల్సి ఉంది. చట్టం మాకు చట్టం అంటూ ఒక కుటుంబాన్ని రోడ్డున పడేశారు. 100 మంది తాగి ఆ ఇంటిపై, మహిళలపై దాడికి దిగటం రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. కడప ఎమ్మెల్యే లాంటి ప్రజా ప్రతినిధులు మనకు అవసరమా...?’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు.


