‘కృత్రిమ మేధ (ఏఐ) చేసే సృజన – కాపీరైట్’పై దేశంలోని ‘పారిశ్రామిక,ఆంతరంగిక వర్తక ప్రోత్సాహక శాఖ’ 2025 చివరలో ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించింది. ఏఐ యుగంలో కాపీ రైట్‌ను కాపాడడమెలా అనే జటిలమైన అంశాన్ని ఒక నిపుణుల కమిటీ పరిశీలించి ఆ నివేదికను రూపొందించింది. సమీప భవిష్యత్తులో, ఈ అంశంపై భారత్ అనుస రించబోయే విధానానికి ఆ నివేదికలోని అంశాలే ప్రాతిపదికగా మారే అవకాశాలున్నాయి.
ఛాట్ జీపీటీ, జెమినీ, పర్‌ప్లెక్సిటీ వంటి జనరేటివ్ ఏఐ ప్రొడక్టులు భారీ లాంగ్వేజి మోడళ్ళు. యూజర్లు చేసే సూచనలను ఆధారంగా చేసుకుని అవి కంటెంట్‌ను సృష్టిస్తాయి. ఉదాహరణకు, మనం ఇతివృత్తాన్ని ఇచ్చి ఆర్.కె. నారాయణ్ లేదా ప్రేమ్‌చంద్ శైలిలో కథానికను రాసివ్వాలని ఛాట్ జీపీటీని అడిగితే అది రాసి పెడుతుంది. అలాగే డయల్–ఈ, మిడ్ జర్నీ వంటివాటికి మనం ఒక వచనాన్ని లేదా కవితను అందిస్తే, దాన్నిబట్టి అవి పెయింటింగ్ వేయడం లేదా వీడియో సృష్టించడం చేస్తాయి. జెమినీరాయ్ లేదా ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగుల మాదిరిగా ఉండాలని కూడా మనం కోరవచ్చు. అంతేకాదు, సత్యజిత్ రే తరహాలో ఒక చిన్న మూవీ క్లిప్‌ను రూపొందించి ఇమ్మని అడిగినా అవి ఆ పని పూర్తి చేసేస్తాయి.
ఆ పని ఎలా చేయగలుగుతున్నాయంటే వాటికి ఇచ్చిన ట్రయినింగును అనుసరించి అని మనం జవాబు చెప్పు కోవాల్సి ఉంటుంది. నారాయణ్ నవలలు, హుస్సేన్ పెయింటింగులు వంటి రకరకాల వనరుల నుంచి అవి డేటాను గ్రహిస్తాయి.
ఏఐ మోడళ్ళకు ట్రయినింగు ఇచ్చేటపుడు ఉపయోగించే డేటా వివిధ కేటగిరీలకు చెందినదై ఉండవచ్చు. అందులో కాపీరైట్ ఉన్నవీ, కాపీరైట్ గడువు తీరిపోయినవి కూడా ఉంటాయి. ‘సమంజస వినియోగానికి’ పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న డేటా మాదిరిగా అది వివిధ వనరుల నుంచి తెచ్చుకున్నదై ఉంటుంది. జనరేటివ్ ఏఐ మోడళ్ళ కమర్షియల్ వెర్షన్లను టెక్నాలజీ సంస్థలు ప్రారంభించినప్పటి నుంచి పుస్తకాలు, పరిశోధన పత్రాలు, ఫోటోలు, సినిమాలు, సృజనాత్మక శక్తిని వ్యక్తపరచిన ఇతర రూపాల లోని కాపీరైట్ మెటీరియల్‌ను వాడుకోవచ్చునా అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే, ఏఐ డేటాబేస్‌కి అవి పునాదిగా మారాయి. ఇది సంక్లిష్టమైన లీగల్, నైతికపరమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ చిక్కు ముడులే ఇంకా విడలేదనుకుంటే, ఏఐ జనరేట్ చేసినవాటి కర్తృత్వం, కాపీరైట్ హక్కుల వర్తింపునకు సంబంధించిన అంశం మరో అపరిష్కృత అంశంగా తయారైంది.
ఏఐ మోడళ్ళకు డేటా ట్రైనింగ్ అనే సరికొత్త సమస్యతో మనమే కాదు, చాలా దేశాలలోని ప్రభుత్వాలు, కోర్టులు సతమతమవు తున్నాయి. ఏఐ మోడళ్ళు కాపీరైట్ ఉన్న పుస్తకాలను లేదా ఫోటో లను కాపీ చేయడం లేదా చౌర్యం చేయడం లేదనీ, కనుక అవి కాపీరైట్ హక్కును ఉల్లంఘిస్తున్నట్లు కాదనీ ఇండియాలోని కంపె నీలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ కంపెనీలు వాది స్తున్నాయి. కొత్త కంటెంట్‌ను జనరేట్ చేయడానికి వీలుగా సరళులు, శైలులు, నిర్మాణ రీతులకు సంబంధించి కలన గణితాలను ట్రైన్ చేసుకునేందుకు, గణాంకాలతో సరిపోల్చుకునేందుకు వాటిని విభా గిత డేటాసెట్లుగా మాత్రమే వినియోగించుకుంటున్నాయని చెబు తున్నాయి. సృజనాత్మక వర్కులను సమంజసమైన రీతిలో వినియో గించుకోవచ్చన్న సాధారణ ఆమోదిత లోకోక్తినే అవి అనుసరిస్తున్నా యని ఆ కంపెనీలు తమ వ్యాసంగాన్ని వెనకేసుకొస్తున్నాయి.
కానీ, ఏఐ మోడళ్లు ఒరిజినల్ వర్కులను ‘కాపీ’ చేయడం లేదని, వాటి నుంచి ’నేర్చుకోవడం మాత్రమే చేస్తున్నాయని అనడం వాదనకు నిలిచే అంశం కాదు. ఏఐ సిస్టం ట్రైనింగ్ ప్రక్రియలో అనేక దశలుంటాయి. వాటిలో డేటా (ఒరిజినల్ వర్కుల) కాపీయింగ్, స్టోరేజి కూడా ఒకటి. అది కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇది మహా అయితే ‘సాంకేతిక చొరబాటు’ కిందకు వస్తుంది కానీ, ‘లీగల్ పరమైన ఉల్లంఘన’ కిందకు రాదని ఏఐ పరిశ్రమ వాదించవచ్చు.
ఏ విధమైన కాపీరైట్ లైసెన్సింగ్ అవసరం లేదనే భావనను నిపుణుల కమిటీ కూడా తిరస్కరించింది. భారత్‌లో అమలుకు ఒక హైబ్రిడ్ చట్రాన్ని సిఫార్సు చేసింది. కాపీరైట్ హక్కుదారులకు రాయల్టీ చెల్లించే పక్షంలో, కాపీరైట్ సంరక్షణ ఉన్న వర్కులను గ్రహించి ఏఐ డెవలపర్లు వాడుకోవచ్చని, ట్రైనింగ్ ఇచ్చేందుకు వాటిని వినియోగించుకోవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. కానీ, ఏఐ సిస్టంలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు తమ వర్కులను ఇవ్వకుండా నిలిపి ఉంచే అవకాశం కాపీరైట్ హక్కుదారులకు లేదు.
ఏఐ డెవలపర్ల నుంచి ఆ (రాయల్టీ) చెల్లింపులను వసూలు చేసే బాధ్యత లాభాపేక్ష లేని ఒక కేంద్రీకృత సంస్థకు ఉండాలని కమిటీ పేర్కొంది. మొత్తానికి, అసలు సృజనశీలురకు రాయల్టీలను చేర్చ వలసిన బాధ్యతను ఆ సంస్థకు అప్పగించాలని చెప్పింది. కాపీరైట్ కంటెంట్‌ను వాడుకున్న ఏఐ సిస్టంలు తద్వారా గడించిన ఆదాయంలో కొంత శాతాన్ని ఆ కాపీరైట్ ఉన్నవారికి చెల్లించాలి. రేట్లను ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ సిఫార్సుల పట్ల, కమిటీలో ఉన్న పరిశ్రమ (నాస్‌కామ్) ప్రతినిధి తన అసమ్మతిని వ్యక్తపర చారు.
ఏఐ మోడళ్ళ రాబడిలో కొంత శాతాన్ని రాయల్టీలుగా చెల్లించాలన్న సిఫార్సుతో సదరు సభ్యుడు విభేదించారు. టీడీఎంకు వీలుగా తమ వర్కు పబ్లిక్‌గా అందుబాటులో లేకుండా నివారించుకోవలసిన బాధ్యత కాపీరైట్ హక్కుదారులపైనే పెట్టాలని ‘నాస్‌కామ్’ ప్రతినిధి సూచించారు. వారి రచన బహిరంగంగా అందుబాటులో ఉందని భావించినపుడు, దాన్ని ఇతరులు వాడుకునేందుకు వీలులేకుండా, ‘ఆప్ట్ ఔట్’ అవకాశాన్ని రచయిత లకు ఇవ్వవచ్చని ఆ ప్రతినిధి సూచించారు.
ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కోట్లాది పుస్తకాలలోని అంశాలను టెక్నాలజీ కంపెనీలు తవ్వి తీసేశాయి. ఏఐ మోడళ్ళ ట్రైనింగుకు వాడుకు న్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆప్ట్ ఔట్’ కూడా ఆచరణసాధ్యమైన పరి ష్కారంగా కనిపించడం లేదు. నిపుణుల కమిటీ సిఫార్సులు ఏఐ పరిశ్రమకు తోడ్పడేవిగా ఉన్నాయి కానీ, రచయితలకు ఊతమిచ్చే విగా లేవు. దేశంలో కాపీ రైట్ చట్రాన్ని రూపొందించేవాళ్ళు పరి శ్రమకు చెందినవారి కన్నా, మూల రచయితలకు పెద్ద పీట వేసే వారుగా ఉండాలి.
నిపుణుల కమిటీ సిఫార్సులు ఏఐ పరిశ్రమకు తోడ్పడే విగా ఉన్నాయి కానీ, రచయితలకు ఊతమిచ్చేవిగా లేవు. దేశంలో కాపీరైట్ చట్రాన్ని రూపొందించేవాళ్ళు పరిశ్రమకు చెందిన వారి కన్నా, మూల రచయితలకు పెద్ద పీట వేసే వారుగా ఉండాలి.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో)


