భారతదేశ చిత్రపటం 1953 నుంచి మారిపోతూ వచ్చింది. దీనికి కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు నెరిపిన శాంతియుత సత్యాగ్రహ పోరాటం. పరిపాలన సవ్యంగా, అర్థవంతంగా సాగాలంటే తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని తన ప్రాణాలను పణంగా పెట్టి మద్రాసులో 58 రోజులు కఠోర దీక్షను చేస్తూ తుదకు 1952 డిసెంబర్ 15న రాత్రి 11 గంటల 23 నిమిషా లకు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణై అమరజీవిగా మారారు. కనుకనే పొట్టి శ్రీరాములును భారతదేశ చిత్రపటాన్ని పునర్లిఖించిన ‘ది మెర్కేటర్ ఆఫ్ ఇండియా’ అని ప్రముఖ చరిత్రకారులు డాక్టర్ రామచంద్ర గుహ కొనియాడారు.
పూర్వీకులు పడమటిపల్లి గ్రామానికి చెందిన వారైనా, పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న పుట్టింది మద్రాసులోనే! మొదటి 20 సంవత్సరాలు మద్రాసులోని అష్టకష్టాల జీవితాన్ని కొనసాగించి తర్వాత ఒక దశాబ్దం పాటు చదువు, ఉద్యోగం కారణంగా బొంబాయి (ముంబై) నగరంలో శ్రీరాములు నివాసం ఉన్నారు. పిమ్మట అర దశాబ్దం మించి గాంధీజీ అనుచరులుగా ఆయన బాటలో సాగుతూ తొలుత సబర్మతి ఆశ్రమం, వార్ధా ఆశ్రమం, కారాగారవాసం, బిహార్ భూకంప పునరావాస ప్రాంతాలు, గుజరాత్‌లోని ఆశ్రమాలలో శ్రీరాములు ప్రజాజీవితం గడిచింది.
తర్వాత 1936 నుంచి ఒక దశాబ్దిన్నర కాలంపాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఎన్నో రకాల సంస్క రణాత్మక కార్యక్రమాలు చేపట్టారు. హరిజనుల అభ్యున్నతి కోసం బ్రిటిష్ పాలనలో రెండుసార్లు, స్వతంత్రం వచ్చిన తర్వాత మరో రెండు సార్లు దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రమంటూ చేసిన దీక్ష ఐదవదీ, చివరిది!
పొట్టి శ్రీరాములు వంటి నిస్వార్థ పరులైన దేశభక్తులు పది, పన్నెండు మంది తన అనుచరులుగా ఉండి ఉంటే స్వరాజ్యాన్ని ఏనాడో సాధించే వాడినని మహాత్మాగాంధీ 1946లో మద్రాస్‌లో జరిగిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవాలలో శ్లాఘించారు. వారి ఆమరణ నిరాహార సత్యాగ్రహదీక్ష వల్లనే తెలుగువారితో పాటు తమిళులు, మలయాళీలు, కన్నడిగులు... తర్వాత మహారాష్ట్రీ యులు, గుజరాతీయులు, బిహారీలు, పంజాబీలు... ఇలా పలు భాషల వారు ప్రత్యేక రాష్ట్రాలను సిద్ధింప చేసుకున్నారు.

సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి వీఆర్ కృష్ణయ్యర్ 1985 మార్చి 16న మద్రాసులో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక ప్రసంగం చేస్తూ ఇలా స్పష్టం చేశారు: ‘భారతీయ ఫెడరల్ రాజ్యాంగ విధానానికి సంబంధించిన ఉత్తమ సూత్రానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గొప్ప బలం చేకూర్చారు. తన ఆత్మహుతితో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను త్వరితం చేశారు. గుడిసెలలో జీవించే కోట్లాదిమంది సామాన్య జనంతో కలిసి మెలిసి జీవిస్తూ వారికి జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ప్రకటించిన గాంధీజీ వంటి మహాత్ముల కోవకు చెందినవారు పొట్టి శ్రీరాములు.
శాంతి, హింస, సత్యాగ్రహం అనే వాటిని రాజకీయాల్లో పట్టు వదలకుండా ప్రయోగించి తన గురువు గాంధీజీ లాగానే విజయం సాధించిన అపురూపమైన వ్యక్తి శ్రీరాములు.’ పొట్టి శ్రీరాములు జీవనశైలినీ, ఆలోచనా ధోరణినీ ఆచరించ గలిగితే మరింత మేలైన మానవులుగా పరిణమించడం తథ్యం. వారి త్యాగమయ జీవితం, పోరాటశీలత, దృఢచిత్తం, నిస్వార్థ స్వభావం నేటికీ సదా స్మరణీయం. ఆయన సత్యాగ్రహ దీక్ష కారణంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు సాధించుకున్న పలు భాషల భారతీయులందరికీ ఆయన ఆరాధ్యనీయులు.
– డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
పొట్టి శ్రీరాములుపై పరిశోధకులు – ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి
నేడు పొట్టి శ్రీరాములు 125వ జయంతి


