అభిప్రాయం
‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’పై బురద చల్లే కార్యక్రమాన్ని ఆపి సీమను ఆదుకునే పనిపై సంబంధిత పక్షాలన్నీ దృష్టి పెట్టాలి. ఈ పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా తప్పు పట్టడం, ఆ పథకం ప్రాధాన్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దీనికి ప్రత్యామ్నాయం అన్నట్లు మాట్లాడటం సరికాదు. కొంత మంది రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదనీ, 800 అడుగుల నుంచి నీరు తీసుకుంటే నీళ్లు కాదు బురద వస్తుందనీ మాట్లాడటం అభ్యంతరకరం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయం కాదు. అసలు రెండు ప్రాజెక్టులకు పోటీ పెట్టి మాట్లాడటమే పొరపాటు. రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమకు నీటిని గరిష్ఠ స్థాయిలో ఎలా తీసుకోవాలి అనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలి.
ముచ్చుమర్రి ఎలా ప్రత్యామ్నాయం?
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడుతున్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 798 అడుగులు ఉన్నపుడు కూడా నీటిని తోడే అవకాశం ముచ్చుమర్రి ద్వారా సాధ్యం అవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే ముచ్చుమర్రి. 2007లో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయల ఖర్చుతో పాలనాపరమైన, ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు దాదాపు 50 శాతం పనులు పూర్తి చేశారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రి వలన ప్రయోజనాలు, పరిమితులను నిజా యతీగా విశ్లేషించుకోవాలి.
ఈ పథకం ద్వారా కేసీ కెనాల్‌కు 1,000 క్యూసెక్యులు,హంద్రీ–నీవా ప్రాజెక్టుకు 3,000 క్యూసెక్యుల నీటిని రెండు మార్గాల ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు. మల్యాల నుంచి మరో 3,000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా హంద్రీ–నీవాకు సరఫరా చేస్తున్నారు. అయితే మల్యాల నుంచి లిప్ట్ చేయాలంటే శ్రీశైలంలో 834 అడులు నీరు ఉంటేనే సాధ్యం. ముచ్చుమర్రి దగ్గర కృష్ణానది నుంచి సిద్ధేశ్వరం దాకా 7 కి.మీ. మేరకు కాలువ తవ్వడం వలన నీటిని ఎత్తిపోతల ద్వారా హంద్రీ– నీవా, కేసీ కెనాల్‌లకు పరిమిత స్థాయిలో సరఫరా చేయవచ్చు. 11,574 క్యూసెక్కులు నిరాటంకంగా తోడితే ఒక టీఎమ్‌సీ నీటిని తోడవచ్చు.
ఒక్క హంద్రీ–నీవాకే 40 టీఎమ్‌సీలు అవసరం. 2017లో ప్రారంభమైన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా గడిచిన 7, 8 సంవత్సరాలలో ఏడాదికి 7 నుంచి 9 టీఎమ్‌సీల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. హంద్రీ–నీవాకు 40 టీఎమ్‌సీలూ, కేసీ కెనాల్‌కు పూర్తి స్థాయి అవసరాలకూ అనుగుణంగా నీరు సరఫరా సాధ్యం కావడం లేదు. అలాంటి పరిస్థితిలో అదనంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీరు విడుదల చేయా ల్సిన ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్, కేసీ కెనాల్, తెలుగుగంగ, నెల్లూరు జిల్లా సోమశిల వంటి వాటికి ముచ్చుమర్రి ద్వారా నీరు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది?
పోతిరెడ్డిపాడు కింద ఎస్‌ఆర్‌ఎమ్‌సీ వద్ద రోజుకు మూడు టీఎమ్‌సీల నీటిని సరఫరా చేసే అవకాశం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా లభిస్తుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ముచ్చుమర్రి ద్వారా మొత్తం సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నట్లు మాట్లా డటం సరికాదు. ముచ్చుమర్రి ద్వారా వచ్చే పరిమిత ప్రయోజ నాలను కొనసాగిస్తూ అదనపు ప్రయోజనాలకు అనుగుణంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.
అవగాహన లేని వ్యాఖ్యలు
కొందరు ఏకంగా శ్రీశైలంలో 800 అడుగులు నుంచే నీరు లిఫ్ట్ చేస్తే బురద వస్తుందనడం అభ్యంతరకరం. మరి అంతకన్నా కొన్ని అడుగుల క్రింద నుంచే గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా ముచ్చుమర్రి ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల కింద నుంచే నీటిని లిఫ్ట్ చేస్తోంది. అక్కడెక్కడా రాని బురద రాయలసీమ ఎత్తిపోతల పథకంలో మాత్రమే వస్తుందనడం న్యాయమా? కొందరు మంత్రులు ఏకంగా ముచ్చుమర్రి నుంచే పోతిరెడ్డిపాడుకు నీరు లిఫ్ట్ చేసుకుందాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ముచ్చుమర్రి, మల్యాల నుంచి హంద్రీ–నీవా అవస రాలకు 40 టీమ్‌సీల నీరు అవసరం అయితే, అందులో సగం నీరు కూడా తీసుకోలేని దుఃస్థితిలో ఉంటే... అదనంగా పోతిరెడ్డిపాడుకు కూడా ముచ్చుమర్రి నుంచే నీరు లిఫ్ట్ చేసుకుందాం అనడం దారుణం.
రాయలసీమ ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లతో నికర జలాలు సగం కూడా తీసుకోలేక పోతున్నాము. ఇంక వరద జలాలపై ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలుగొండ, సోమశిలలకు నీరు ఎలా తీసుకుంటాం? బాధ్యత గల ప్రభుత్వాలు శ్రీశైలం నుంచి అవకాశం ఉన్న మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని తీసుకునేందుకు మార్గాలను అన్వేషించాలి. సింహ భాగం పూర్తి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తే నష్టపోయేది రాయలసీమ ప్రజలే!
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త


