దేవాదుల 100 టీఎంసీలు | Capacity of Devadula Lift scheme will be increased from 38 to 100 TMC | Sakshi
Sakshi News home page

దేవాదుల 100 టీఎంసీలు

Mar 4 2026 6:18 AM | Updated on Mar 4 2026 6:18 AM

Capacity of Devadula Lift scheme will be increased from 38 to 100 TMC

సాక్షి, హైదరాబాద్‌: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 38 నుంచి 100 టీఎంసీలకు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఈ మేరకు వచ్చిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. దేవాదుల సామర్థ్యం పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు.  

తొలుత 50 టీఎంసీలు: గోదావరి ఎత్తిపోతలు పథకం పేరుతో 1995–2000 మధ్య దేవాదుల ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. గోదావరి నుంచి జూన్‌–నవంబర్‌ మధ్యకాలంలో 150 రోజుల పాటు 50 టీఎంసీలు తరలించి 2 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలని అప్పట్లో యోచించారు. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనం జరపడానికి 2001లో జీవో జారీ చేశారు. అయితే తొలి దశ కింద 5.18 టీఎంసీలు తరలించి 1.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2003లో, రెండో దశ కింద 7.25 టీఎంసీలను తరలించి 1.93 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2005లో, మూడో దశ కింద 25.75 టీఎంసీలను తరలించి 2.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2007లో పరిపాలనపరమైన అనుమతులు జారీ అయ్యాయి. మొత్తం మూడు దశల్లో 38.16 టీఎంసీలను తరలించి 5,56,722 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.  

ప్రాజెక్టు ప్రారంభించిన వైఎస్‌ ప్రభుత్వం 
2005లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం కింద ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 2005లోనే ప్రాజెక్టుకి పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. మూడు దశలు కలిపి మొత్తం రూ.6,016 కోట్ల వ్యయం అంచనాలతో ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళిక సంఘం పెట్టుబడి అనుమతులు (ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌) ఇచ్చింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) 2007లో అనుమతులు జారీ చేసింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం 2015లో దేవాదుల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 నుంచి 60 టీఎంసీలకు పొడిగించింది. కానీ సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో 38.16 టీఎంసీలకే పరిమితమయ్యింది. మూడు దశల కింద హనుమకొండ, వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, ములుగు జిల్లాల్లో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.  

వచ్చే కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం! 
‘సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)’కింద ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2005–06లో రూ.6,016 కోట్లుగా ఉండగా.. 2016–17 నాటికి రూ.13,445 కోట్లకు చేరింది. తాజాగా రూ.18,400 కోట్లకు చేరింది. దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదించాల్సి ఉంది. అంచనాల పెంపుతో పాటు, తాజాగా ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలనే నిర్ణయం తీసుకోవడంతో ఈ రెండు ప్రతిపాదనలపై తదుపరి కేబినెట్‌ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

ఎస్‌ఆర్‌ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణ! 
ప్రాజెక్టు సామర్థ్యం 100 టీఎంసీలకు పెంచితే ఏడాదిలో 300 రోజుల పాటు నీళ్లను తరలించి దేవాదుల ఆయకట్టుతో పాటు ఎస్‌ఆర్‌ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణకు వీలుంటుందని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.14,359 కోట్ల వ్యయంతో పనులు జరిగాయి. అయితే భూసేకరణ, నిధుల సమస్యలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు.  

మరో రూ.4 వేల కోట్లు అవసరం 
మొత్తం 34,089 ఎకరాలకు గాను 31,953 ఎకరాలు సేకరించారు. మరో 2,136 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు కింద దాదాపు 5.57 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటిదాకా 3.38 లక్షల ఎకరాలకే సాగునీరు అందిస్తున్నారు. మిగతా 2,136 ఎకరాలు సేకరిస్తే మిగిలిన 2.23 లక్షల ఎకరాలకు కూడా నీరందుతుంది. ప్రభుత్వం రూ.600 కోట్లను విడుదల చేస్తే భూసేకరణ పూర్తికానుంది. పెరిగిన అంచనాల ప్రకారం భూసేకరణతో సహా మిగులు పనుల పూర్తికి మరో రూ.4 వేల కోట్లు అవసరం కానున్నాయి. మొత్తం మీద వచ్చే 18 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి 2.23 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement