డిసెంబర్ 2న 'షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' కొత్తగా 200కు పైగా 'మర్చెంట్ షిప్స్' కొంటున్నట్లు ప్రకటించింది. ఉన్నట్టుండి మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇలా మారడం 'మీడియా'ను సైతం విస్మయపర్చింది. గత వైభవం తర్వాత కనుమరుగైన ఈ 'మినీరత్న' సంస్థ గురించి ఓ ఆంగ్ల పత్రిక వెంటనే ఒక 'బైలైన్ స్టోరీ' కూడా రాసింది. నిజానికి ఈ రంగం గత ఐదేళ్లుగా ప్రైవేట్ చేతుల్లోకి మారుతుండగా, అకస్మాత్తుగా మారిన కేంద్రం వైఖరి ఇది. ఈ కొత్త నౌకల కొనుగోళ్లను ప్రభుత్వమే చేయబోతున్నది.
“ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న 'జియో పాలిటిక్స్' పరిణామాలు మనకు కూడా 'నేషనల్ షిప్పింగ్ సర్వీసెస్' ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. దేశ ఆర్ధిక భద్రత కోసం 'మర్చెంట్ నేవీ' ప్రాధాన్యం ఏమిటో ఇన్నాళ్ళకు ప్రభుత్వం గుర్తించింది" అని "నేషనల్ షిప్ ఓనర్స్ అసోషియేషన్' సీఈఓ అనిల్ దేవళి అన్నట్టు ఆ వ్యాసంలో రాశారు. మారుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇలా ఉంటే, డిసెంబర్ 24న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు- 'క్వాంటమ్ టాక్ బై సీబీన్' కార్యక్రమంలో "రెండేళ్లలో అమరావతిలోనే కంప్యూటర్లు తయారుచేసి, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తాము" అన్నారు..
మన పక్కన వెయ్యి కిలోమీటర్ల మేర సముద్రం ఉన్నప్పుడు, ముందు 'మెరైన్ ఎకానమీ'లో మన వృద్ధి 'రికార్డు' అయితే పెరిగే వేసవి ఎండల తీవ్రతకు 'బ్లేజ్ వాడ' అని పిలవబడే ప్రాంతానికి 'క్వాంటమ్ వ్యాలీ' అని పేరు పెడితే దానికి 'వ్యాలీ' క్లైమేట్ వస్తుందా? ఉపాధితో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి 'మార్కెట్'లో ఇక్కడి ఉత్పత్తుల 'డిమాండ్' పెరుగుతుంది. సముద్రం ఎండేది కాదు. కనుక పెరిగే నౌకా వాణిజ్యంతో ఏపీ 'బ్లూ ఎకానమీ' స్టేట్ అవుతుంది. ఆ తర్వాత దశలో 'క్వాంటమ్ వ్యాలీ' వంటి మొదటి శ్రేణి సాంకేతికత గురించి కూడా మాట్లాడవచ్చు.
అయినా వేసవి ఎండల తీవ్రతకు 'బ్లేజ్ వాడ' అని పిలవబడే ప్రాంతానికి 'వ్యాలీ' అని పేరు పెడితే దానికి 'వ్యాలీ' క్లైమేట్ వస్తుందా? భౌగోళిక శాస్త్ర ప్రమాణాల ప్రకారం ఒక ప్రాంతం సముద్ర మట్టానికి 1,850 మీటర్ల ఎత్తున ఉంటే, దాని శీతోష్ణ స్థితుల కారణంగా 'వ్యాలీ' అంటారు. మరి సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తులో ఉన్న అమరావతిలో 'క్వాంటమ్ వ్యాలీ' అంటే, అది కేవలం 'మార్కెటింగ్ వ్యూహం కావొచ్చు.
మన ఆలోచనలు అక్కడ ఉంటే, విశ్వకర్మ జయంతి సంద ర్భంగా గత సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ భావ నగర్ 'సముద్ర సే సమృద్ధి' సభలో మాట్లాడుతూ "ఒకప్పుడు స్వదేశీ నిర్మిత నౌకల ద్వారా మన రవాణా 40 శాతం సాగేది. మన నౌకానిర్మాణ రంగాన్ని బలోపేతం చేయకుండా, విదేశీ నౌకలకు అద్దె చెల్లించడం మీద మనం శ్రద్ధ పెట్టాము. దాంతో, మన నౌకా వాణిజ్యం రెవెన్యూ 40 నుంచి 5 శాతానికి పడిపోయింది.
ఒక 'రీసెర్చి' ప్రకారం 'షిప్ బిల్డింగ్ రంగంపై మనం ఒక రూపాయి. ఖర్చు పెడితే, అది రెండింతలై మనకు తిరిగివస్తుంది. 'షిప్ యార్డు'లో ఒక ఉద్యోగం మనం సృష్టిస్తే, బయట 'సప్లై చైన్' మార్కెట్లో ఆరేడు కొత్త ఉద్యోగాలు పుడతాయి. అంటే, వంద ఉద్యోగాలు ఇక్కడ వస్తే, బయట ఆరు వందల మందికి వేర్వేరు రంగాల్లో పని దొరుకుతుంది" అన్నారు.
"నౌకా వాణిజ్యంతో నావికుల ('సీ ఫేరర్స్') అవసరం పెరుగుతుంది. పదేళ్ళ క్రితం మన దేశంలో వీళ్ళు 1 లక్ష 25 వేలు ఉంటే, ఈ రోజున అది మూడు లక్షలు దాటింది. ప్రపంచ దేశాలకు వీరిని సరఫరా చేసే మూడు దేశాల్లో మనం ఉన్నాము. రాబోయే రోజుల్లో యువతకు ఈ రంగం వల్ల విశేషమైన ఉపాధి దొరుకుతుంది..." ఇలా ప్రధాని ప్రసంగం సాగింది. ఒక వారం తర్వాత 'కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ' రీసెర్చ్ స్కాలర్ సంగమూన్ హన్సింగ్ ఒక ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో "ఇండియా ఎగుమతుల ఎకానమీ అంతా కొన్ని చోట్ల కేంద్రీకృతమై ఉంది.
గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక 70 శాతం నౌకా వాణిజ్యం చేస్తుంటే, అందులో గుజరాత్ వాటా 33 శాతంగా ఉంది. రాజకీయంగా అన్నింటా ముందుండే ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లో అది 5 శాతం మాత్రమే" అని రాశారు. ఏపీ ప్రభుత్వాలతో బీజేపీకి 'వర్కింగ్ రిలేషన్స్' ఉన్నప్పటికీ, మోదీ ప్రసంగంలో పదేళ్లనాడు ఏర్పడిన తీర ప్రాంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. పోనీ ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళే బాబుకు మోదీ సలహా ఇచ్చారా? అంటే, 'ఎన్డీఏ' కూటమి 'మీకు మీరే మాకు మేమే' తీరుతో చివరికి రాష్ట్రం బలవుతున్నది. ఏపీ 'మెరైన్' రంగంలో ఈ పదేళ్ళలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మొదలైన పూనిక అంటూ ఏదైనా ఉందంటే, అది 'కోవిడ్' రోజుల్లో కూడా వైసీపీ పాలనలోనే కనిపిస్తున్నది.
-జాన్‌సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత


