విశ్లేషణ
దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్టకేలకు అధిక వృద్ధి బాట పట్టిందని వ్యాఖ్యాతలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ముందస్తు అంచనాలను కూడా లెక్కలోకి తీసుకుంటే, గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వృద్ధి రేటు 8.1 శాతం. నమోదైనవాటిలో ఇదే ఉత్తమం. కానీ, దీన్ని సందర్భానుసారంగా చూడాలి. గడచిన ఐదేళ్ళ రికార్డు, చతికిల పడిన స్థితి నుంచి చూసి చెబుతున్నది. కోవిడ్ ఏడాది 2020–21లో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కోవిడ్‌కు ముందరి ఏడాది (2019–20)ని ప్రాతిపదికగా చేసుకుంటే, తాజాగా ఆరేళ్ళలో వృద్ధి రేటు 5.7 శాతంగా తేలుతుంది. అంతకుముందు 19 ఏళ్ళలోని వృద్ధి రికార్డు కన్నా అది మందగమనం కిందనే లెక్క. కోవిడ్‌కు ముందరి ఏడాది వరకు సగటున 6.5 శాతం వృద్ధి రేటు నమోదైంది.
తాజా వృద్ధిరేటు 2020–21 క్షీణత నుంచి ఏ మేరకు కోలుకున్నామనేదానికి ప్రాతినిధ్యం వహిస్తోందా అనేది కీలక ప్రశ్న. నిలకడగా సాధించగలిగిన వృద్ధిరేటు ఇపుడు ఎంతని చెప్పగలం? వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6.5 శాతం వృద్ధిరేటు ఉండగలదని కొందరు అంచనాలు వెల్లడించారు. దాన్ని ప్రాతిపదికగా చేసుకుంటే, మూడేళ్ళ (2024–27) చక్రభ్రమణంలో సగటు వృద్ధి రేటు 6.8 శాతం ఉండవచ్చు. మోదీ ప్రభుత్వ మొదటి హయాంలో కూడా అదే రేటు ఉంది. స్థిర వృద్ధి రేటులో గణనీయమైన పెరుగుదల ఇంకా ఏదీ లేదని ఇది సూచిస్తోంది.
విరుద్ధ సూచికలు
గతంలో చాలా సందర్భాలలో, ఏదో ఒక ఆర్థిక సూచి సరైన స్థితిలో లేనట్లుగానే కనిపించేది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండ టమో, లేదా ద్రవ్యలోటు మాదిరిగానే వాణిజ్య లోటు ఎక్కువగా ఉండటమో జరిగేది. దానికి భిన్నంగా నేటి ఆర్థిక వ్యవస్థ స్వర్ణ యుగ దశలో ఉన్నట్లుగా చిత్రితమవుతోంది. అయినా, స్థూల గణాంకాలు అప్రమత్తతను సూచిస్తున్నాయి. ద్రవ్యలోటు తగ్గుతున్న బాటలోనే ఉంది. కానీ, స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో అది 4.4 శాతంగా ఉంది. అంటే, మోదీ ప్రభుత్వ మొదటి హయాంలో (3.6 శాతం) కన్నా అధికం. ప్రభుత్వం పెట్టుబడుల ప్రవాహాన్ని ఉధృతం చేయడం, మరింత నిజాయతీతో కూడిన పద్దులు... బహుశా అందుకు కారణం కావచ్చు. ప్రభుత్వ రుణం కూడా తగ్గుతున్న సరళిలోనే ఉన్నప్పటికీ, అధికంగానే కొనసాగుతోంది. జీడీపీలో 81 శాతంగా ఉన్న ప్రభుత్వ రుణం, ఒకవేళ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారితే, దాన్ని ఎదుర్కోగల ద్రవ్యాచరణకు అది వెసులుబాటు కల్పించగలిగినదిగా లేదు.
కాగా, వృద్ధికి కీలకమైన పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్ రేట్లు గతంలో కన్నా తక్కువగా ఉన్నాయి. స్థూల స్థిర మూలధన సమీకరణ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి జీడీపీలో 30 శాతంగా ఉంది. ఇది 2012–13 వరకు ఉన్న ఎనిమిదేళ్ళ సగటు 34 శాతం కన్నా తక్కువ. ఆర్థిక కలాపంలో వస్తువులు, సరుకుల ఎగుమతుల వాటా కొంత కాలంగా తగ్గుతూ వస్తోంది. సాధారణంగా, దీన్ని వేగవంతమైన వృద్ధి రేటుకు విరుద్ధమైన సూచిగానే చూస్తారు.
బాగుంది కానీ...
వృద్ధి రేటు పెరుగుతున్న సరళికి ఆలంబనగా నిలిచే డేటా ఏదైనా కావాలనుకుంటే, ఇతరత్రా సంఖ్యలను చూడక తప్పదు. ఐక్యరాజ్య సమితి రూపొందించిన మానవ అభివృద్ధి సూచిలో మన దేశం ఈ ఏడాది ‘మధ్యస్థ’ నుంచి ‘అధిక’ కేటగిరీలోకి పురోగమించవచ్చునని భావిస్తున్నారు. ఇది విద్యాస్థాయులు, ఆయుర్దాయం, ఆదాయాలలో వచ్చిన స్థిర మెరుగుదలను ప్రతిబింబిస్తోంది. దీంతో మురిసిపోవడానికి లేదు. ఈ సూచిలో ‘అత్యధిక’ కేటగిరీ కూడా ఉంది. దానిలో 70కి పైగా దేశాలున్నాయి. ఆర్థిక నిర్వహణ విషయానికి వస్తే, పన్ను రేట్లు (కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను, జీఎస్టీ) గతంలో కన్నా హేతుబద్ధంగా ఉన్నాయి. డిజిటల్ ప్రభుత్వ మౌలిక వసతులు విస్తృత వినియోగాన్ని సంతరించుకున్నాయి. భౌతిక మౌలిక వసతుల్లో భారీ పెట్టుబడులు అభినందనీయం. ఇవి రోడ్డు, రైలు మార్గాలలో సరుకుల రవాణాను వేగవంతం చేశాయి. అదే సమయంలో, వాణిజ్య వాహనాల అమ్మకాలలో అది ప్రతికూల ప్రభావం చూపడం వేరే సంగతి.
సంస్కరణల వల్ల స్థిరాస్తి, వస్తూత్పత్తి వంటి రంగాలు లబ్ధి పొందాయి. ఎలక్ట్రానిక్స్ రంగ నేతృత్వంలో వస్తూత్పత్తి ఎట్టకేలకు కొంత వేగాన్ని అందిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా కింది స్థాయి వరకు కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. కానీ పారిశ్రామిక విభాగాల్లో మూలధన వస్తువుల ఉత్పత్తి నత్తనడకన సాగుతోంది. తీవ్ర పేదరికం నుంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరగడం శుభ సూచకం. కానీ, అది వినియోగ వస్తువుల డిమాండ్ బాగా పెరిగేటంతగా తోడ్పడకపోవచ్చు. వ్యవసాయ రంగాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నవారు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. దానిలోంచి కొందరు బయటకు రావడానికి బదులుగా కొత్తవారు కూడా ఉపాధికి అదే రంగాన్ని ఆశ్రయిస్తున్నారు.
చేయాల్సింది ఎంతో!
ఆదాయ నిచ్చెనలో పై మెట్లపై ఉన్నవారి వినియోగ రుణం ఎక్కువగా ఉంది. గృహోపయోగ వస్తువులపై రుణాలు 2021–22లో ఉన్న రూ. 8.99 ట్రిలియన్ల నుంచి 2023–24లో రూ. 18.79 ట్రిలియన్లకు రెట్టింపయ్యాయి. ఇప్పటికే చేసిన అప్పులు చెల్లించ వలసి రావడం వల్ల భవిష్యత్ వినిమయంపై దాని ప్రభావం పడుతుంది. చాలా రంగాల్లో వృద్ధి ఇప్పటికే మందంగా ఉంది. ముఖ్యంగా, రైళ్ళలో ప్రయాణించే వారి సంఖ్య నెమ్మదిగానే పెరుగుతూ వస్తోంది. వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్న ప్పటికీ అదీ పరిస్థితి. వినియోగదారులలో అగ్ర భాగాన ఉన్న 20 శాతం మందిపైనే దృష్టి పెడుతున్నట్లు మొన్నామధ్య ఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అందుకే ఆశ్చర్యం కలిగించలేదు. కానీ విమాన ప్రయాణికుల సంఖ్య 2024 వరకు గడిచిన ఐదేళ్ళలో 11 శాతం మాత్రమే వృద్ధి చెందింది.
దేశం 1991లో సంస్కరణల బాట పట్టిన తర్వాత, ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన మార్పు తగినంత చోటుచేసుకోలేదని వీటన్నింటి బట్టి తెలుస్తోంది. తలసరి ఆదాయాలు దాదాపు ఐదు రెట్లు పెరిగినప్పటికీ, జీడీపీలో పరిశ్రమ వాటా అప్పటిలానే ఇప్పుడు కూడా ఒకటో వంతుగానే ఉంది. వ్యవసాయ రంగ వాటా కూడా క్షీణించింది. పంట దిగుబడులు ప్రపంచ ప్రమాణాల కన్నా తక్కువ స్థాయులలో ఉన్నాయి. సేవల రంగమే ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగంగా పరిణమించింది. అది చాలా వరకు, ఆర్థిక వ్యవస్థలో అవ్యవస్థీకృత భాగంగానే కొనసాగుతోంది. సరైన ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా సత్వర సేవల రంగాన్ని చూపలేం. ఉత్పాదకత పెంపుదల మూడు సంస్థాగత మార్పులపై ఆధార పడి ఉంది. వస్తూత్పత్తి రంగం గణనీయమైన రీతిలో పెద్దదిగా మారాలి. ఆర్థిక వ్యవస్థ మరింత నియతమైనదిగా మారాలి. పట్టణీ కరణ వేగంగా సాగాలి. ఆర్థికవ్యవస్థ తగినంత వేగాన్ని పుంజు కోవడానికి చేయవలసింది చాలా ఉంది.
టి.ఎన్. నైనన్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)


