అభిప్రాయం
అమెరికా ఇటీవల కాలంలో తాను వేసుకున్న ముసుగును పూర్తిగా తొల గించి బాహాటంగానే దురాక్రమణ కాంక్షను వ్యక్తం చేస్తోంది. వరుసగా ఒక దేశం తరువాత మరొక దేశాన్ని ఆక్రమించడానికి వేగంగా పావులు కదుపుతోంది. వెనిజులా అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసి పట్టుకుపోవడం, గ్రీన్‌ల్యాండ్ తమదేనని ప్రకటించడం, తాజాగా ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు అండగా ఉంటామని ప్రకటించడం... ఇవన్నీ అమెరికా దూకుడును సూచించే అంశాలే. ముఖ్యంగా అణు పాటవం సంతరించుకోకుండా ఇరాన్‌ను అడ్డుకోవడం, దాని చమురు సంపదను చేజిక్కించుకోవడంపై అమెరికా ఎప్పటి నుంచో కన్నేసింది. దాని కొనసాగింపే ప్రస్తుత ఇరాన్ సంక్షోభం.
2015 అణు ఒప్పందం నుండి అమెరికా ఏకపక్షంగా బయటకు రావడంతో ఇరాన్‌తో అమెరికా ఘర్షణ ముదిరింది. ఇరాన్‌కు చెందిన సుమారు 100 బిలియన్ డాలర్ల నిధులను అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా స్తంభింపజేయడమే కాకుండా, కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించింది. గడిచిన కొద్ది నెలలుగా ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో ఏడు బి–2 స్టెల్త్ బాంబర్లు, అత్యంత శక్తిమంతమైన 14 బంకర్ బస్టర్ బాంబర్లు, 30,000 పౌండ్ల మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఫోర్డో, నటాంజ్, ఇస్ప హాన్ వంటి కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 400 మందికి పైగా ఇరా నీయులు ప్రాణాలు కోల్పోగా, 3,000 మందికి పైగా గాయపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూల మధ్య ఇటీవల జరిగిన భేటీ పశ్చిమ ఆసియాలో యుద్ధ తీవ్రతను పెంచేలా ఉంది. గాజాలో ప్రతిఘటనను తుడిచిపెట్టడమే కాకుండా, ఇరాన్ పుంజుకుంటే తీవ్రంగా దెబ్బతీస్తామని వారు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఇరాన్ లోపల వ్యూహాత్మక అల్లర్లు ప్రారంభమయ్యాయి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న కరెన్సీ విలు వపై ప్రజల్లో అసహనం పెంచుతూ నిరసనలను, సమ్మెలను అమెరికా ప్రోత్సహిస్తోంది. శాంతియుత నిరసనల ముసుగులో జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటికే వందలాదిమంది మర ణించారు. నిరసనకారులకు అమెరికా బాసటగా నిలుస్తామని ప్రకటించడం వెనుక ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టే పక్కా ప్లాన్ ఉంది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురి పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఆర్థిక విధ్వంసం – చమురు రాజకీయం
2025 జూన్ నాటి యుద్ధ పరిస్థితులు, చమురు ధరల పతనం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. నిత్యా వసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజల జీవన ప్రమా ణాలు పడిపోయాయి. విద్యుత్ కోతలు పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీయగా, వాతావరణ మార్పుల వల్ల వర్షాలు లేక వ్యవసా యోత్పత్తి తగ్గి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అమెరికా చర్యలను ఇరాన్ నేత ఖమేనీ తీవ్రంగా ఖండిస్తున్నారు. పాత కాలపు షా రాజరికం లాంటి బానిసత్వాన్ని ‘నయా వలస వాదం’ రూపంలో అమెరికా మళ్లీ రుద్దాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. దేశంలోని కార్పొరేట్ శక్తులు తమ స్వార్థం కోసం అమెరికా, ఐరోపా దేశాలతో చేతులు కలుపు తున్నాయనీ, దీనివల్ల కార్మికులు, గ్రామీణ ప్రజలపై భారం పెరుగుతోందనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ ముడిచమురు నిల్వల్లో ఇరాన్ వాటా 13 శాతం ఉండగా, అమెరికా అడుగులకు మడుగులొత్తే సౌదీ అరేబియా వద్ద 16 శాతం నిల్వలు ఉన్నాయి. వెనిజులా నిల్వలను కూడా కలిపితే, ప్రపంచ చమురులో 50 శాతాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని అమెరికా ఆశిస్తోంది. రష్యా, చైనాలు అమెరికా చర్యలను ఖండించే ప్రకటనలకే పరిమితం అవుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగకపోవడం గమనార్హం.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తన గూఢ చారి సంస్థ ‘సీఐఏ’ ద్వారా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేసింది. 1954లో గ్వాటెమాల, 1963లో ఈక్వె డార్, 1964లో బ్రెజిల్, 1973లో చిలీ... ఇలా సుమారు 20కి పైగా దేశాల్లో అమెరికా తన తోలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు కుట్రలు చేసింది. క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రోను హతమార్చేందుకు 621 సార్లు విఫలయత్నం చేయడం అమెరికా దురహంకారానికి పరాకాష్ఠ. డ్రగ్స్‌పై పోరాటం పేరుతో మెక్సికో, కొలంబియా వంటి దేశాల్లో అరాచ కాలు సృష్టించింది. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ట్యారిఫ్ యుద్ధాలు, సైనిక బెదిరింపులతో నూతన సామ్రాజ్యవాదాన్ని విస్తరించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.
బుడ్డిగ జమిందార్
వ్యాసకర్త ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం’
జాతీయ కార్యవర్గ సభ్యులు


