స్పెషల్‌ అలవెన్సులు.. పన్ను భారాలు | Special Allowances in Salary Tax Rules Explained | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ అలవెన్సులు.. పన్ను భారాలు

Mar 16 2026 12:43 PM | Updated on Mar 16 2026 12:59 PM

Special Allowances in Salary Tax Rules Explained

జీతంలో కొంత భాగాన్ని స్పెషల్‌ అలవెన్స్‌ రూపంలో ఇస్తారు. ఉద్యోగస్తులు వాళ్ల సీటీసీ అంటే ’కాస్ట్‌ టు ది కంపెనీ’లో ’టేక్‌ హోమ్‌ పే’ ఎక్కువగా ఉండాలని ఆశిస్తారు. బేసిక్‌ పే కాకుండా అదనంగా ఇచ్చే జీతాన్ని స్పెషల్‌ అలవెన్స్‌ అంటారు. ఇవి కాకుండా ఇంటద్దె అలవెన్స్, లీవ్‌ ట్రావెల్‌ అలవెన్స్‌ మొదలైన వాటిని కేవలం ఆయా పేర్లలో పేర్కొన్న వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలి.

ఇవి కాకుండా ఎన్నో స్పెషల్‌ అలవెన్సులు ఉన్నాయి. స్వభావరీత్యా నిర్దేశించినవి తప్ప అన్ని అలవెన్సులు పన్నుకి గురవుతాయి. ప్రావిడెంట్‌ ఫండ్, గ్రాట్యుటీల నిమిత్తం వీటిని తీసుకోవచ్చు.. తీసుకోకపోవచ్చు. కొన్ని పనితీరును బట్టి ఉంటాయి. కొన్ని పని పరిస్థితులను బట్టి ఉంటాయి.  1961వ చట్టంలో ఉన్న అన్ని అలవెన్సులను 2025 చట్టంలో పొందుపరిచారు. చాలా సులభంగా అర్థం అయ్యేలాగా, ఒక పట్టిక రూపంలో పొందుపరిచారు. ఇవి మూడు రకాలు..

మినహాయింపు లేని అలవెన్సులు 

  • డీఏ, సీసీఏ, పెర్ఫార్మెన్స్‌ అలవెన్స్, అటెండెంట్‌ అలవెన్స్, ప్రాజెక్ట్‌ అలవెన్స్‌ మొదలైన వాటిమీద ఎటువంటి మినహాయింపు లేదు. ఇవన్నీ జీతంలో భాగమే. పన్నుకి గురవుతాయి.  

  • కొన్ని అలవెన్సులకి షరతులకు లోబడి మినహాయింపులు ఉంటాయి. అవేంటంటే హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీఏ, స్టాండర్డ్‌ డిడక్షన్‌

  • అలవెన్స్‌ ఖర్చు పెట్టినంత వరకే మినహాయింపు. ఈ తరహా అలవెన్సులను మీరు ఖర్చు పెట్టినంత వరకే మినహాయింపునిస్తారు. ఖర్చు పెట్టని మొత్తాన్ని ఆదాయంగా భావిస్తారు. ఉదాహరణకు కన్వేయన్స్‌ అలవెన్స్, డైలీ అలవెన్స్, ట్రావెల్‌ అలవెన్స్, హెల్పర్‌ అలవెన్స్, రీసెర్చ్‌ అలవెన్స్, యూనిఫాం అలవెన్స్‌.. వీటి అన్నింటికి ఖర్చులు పెట్టాలి. ఓచర్లు ఇవ్వాలి.

పాత పద్ధతి – కొత్త పద్ధతి.. 

  • కొత్త పన్ను విధానంలో బేసిక్‌ లిమిట్‌ అధికం. ఎక్కువ శ్లాబ్‌లు, తక్కువ పన్ను రేట్లు, అందువల్ల అలవెన్స్‌లకు మినహాయింపు ఇవ్వడం లేదు. ఈ కింది అలవెన్సులను మినహాయించరు.

  • ఇంటద్దె అలవెన్సు, లీవ్‌ ట్రావెల్‌ అలవెన్సు, పిల్లల విద్య అలవెన్సు, పిల్లల హాస్టల్‌ అలవెన్సు, ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్సు (దివ్యాంగులకు కాదు), హెల్పర్, యూనిఫాం అలవెన్సు, ఇంటర్నెట్‌ అలవెన్సు, ఎంటర్‌టైన్‌మెంట్‌ అలవెన్సు.  

  • ఇవన్నీ కాకుండా ఇప్పటి 80సి కింద ఇస్తున్న.. పీఎఫ్, ఎన్నెస్సీలు, జీవిత బీమా, పిల్లల చదువు ఫీజులు.. మొదలైన వాటికి కూడా ఇవ్వరు. ఎన్‌పీఎస్‌ చెల్లింపులు, అగ్నివీర్‌ కార్పస్‌ ఫండ్‌ చెల్లింపులు.. ఈ రెండు మినహాయింపులు ఇస్తారు.  

కొత్త విధానంలో మినహాయింపులు వచ్చేవి కొన్ని..

  • స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ. 75,000. కన్వేయన్స్‌ అలవెన్స్‌ / డైలీ / ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్సు. ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ అలవెన్సు. వృత్తి పన్ను. ఫ్యామిలీ పెన్షను .. రూ. 25,000 వరకు.  

  • స్థలాభావం వల్ల అన్ని షరతులు ఇక్కడ పొందుపరచలేదు. చట్టంలోనూ, రూల్స్‌లోను వివరంగా దొరుకుతాయి.. లేదా ఉంది కదా.. గూగుల్‌ తల్లి.. సంప్రదించండి.  

1961 చట్టంతో పోల్చి కొత్త చట్టాన్ని విశదీకరిస్తే వచ్చిన మార్పులు.

  • ఎంటర్‌టైన్‌మెంట్‌ అలవెన్సుకి మినహాయింపు లేదు

  • ప్రత్యేక సామర్థ్యం ఉన్న ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్సులకు మినహాయింపులు కొనసాగుతాయి.  

  • ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌కి ఇచ్చే అలవెన్సులకు మినహాయింపు ఉంది.

  • ఫెనాన్షియల్‌ ఇయర్, అసెస్‌మెంట్‌ ఇయర్‌ అని ఉండవు. ఇకనుంచి ఒకే పదం ’ట్యాక్స్‌ సంవత్సరం’.

రాబోయే ప్రక్రియలన్నీ డిజిటల్‌ ప్రపంచంలోనే ఉంటాయి. అరకొర సిబ్బందికి ఏఐ బ్రహ్మాస్త్రంలాగా దొరికింది. అంతా డిజిటల్‌ రికార్డులు, డిజిటల్‌ పరిష్కారాలు, టెక్నాలజీమయం. కాబట్టి, మనకు డిజిటల్‌ అక్షరాస్యత కావాలి. డిజిటల్‌ సామర్థ్యాలు.. నైపుణ్యాలు సంపాదించాలి.  సర్వసన్నద్ధంగా ముందుకెళ్లాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement