ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం దూసుకుపోయింది. 2025 నాటి గణాంకాలను పరిశీలిస్తే విదేశీ పెట్టుబడిదారులు దుబాయ్‌లో ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎంతటి ఆసక్తిని చూపుతున్నారో స్పష్టమవుతోంది. కొన్ని సర్వేల ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తున్న దేశాల జాబితాలో భారతదేశం 22% వాటాతో అగ్రస్థానంలో ఉంది.
భారత్ తర్వాతి స్థానాల్లో యునైటెడ్ కింగ్‌డమ్ (17%), చైనా (14%), సౌదీ అరేబియా (11%), రష్యా (9%) నిలిచాయి. ఇది దుబాయ్ మార్కెట్ కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉందని నిరూపిస్తోంది.
దుబాయ్ రియల్టీ ఎందుకు పుంజుకుంది?
దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందడానికి కొన్ని కీలక అంశాలు దోహదపడ్డాయి. ప్రపంచ రాజకీయాల్లో అస్థిరత ఉన్నప్పటికీ దుబాయ్ ఒక సురక్షితమైన సేఫ్ హెవెన్‌గా పెట్టుబడిదారులకు కనిపిస్తోంది. ఆస్తుల కొనుగోలుపై, అద్దెలపై ఆదాయపు పన్ను లేకపోవడం అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. బుర్జ్ ఖలీఫా వంటి అద్భుత కట్టడాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పర్యాటక, నివాస రంగాలను బలోపేతం చేస్తున్నాయి. ప్రాపర్టీ లావాదేవీల్లో పారదర్శకత కోసం బ్లాక్‌చెయిన్, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలను ఉపయోగించడం వల్ల పెట్టుబడిదారులకు నమ్మకం పెరుగుతోంది.
ఇప్పుడు సమస్య ఏంటి?
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, అమెరికా ప్రమేయం వంటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై మిశ్రమ ప్రభావాన్ని చూపుతున్నాయి. పొరుగు దేశాల్లో యుద్ధం లేదా అస్థిరత నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు తమ సంపదను సురక్షితంగా ఉంచుకోవడానికి దుబాయ్‌ను ఎంచుకునేవారు. కానీ ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో నేరుగా ఇరాన్ వ్యతిరేకంగా ఉన్న అమెరికాపై దాడి చేయలేక పక్కన ఉన్న యూఏఈలోని యూఎస్ స్థావరాలపై దాడికి పాల్పడుతోంది. దాంతో ఎంతో సురక్షితంగా భావించిన దుబాయ్ కూడా అనిశ్చితిలోకి వెళ్లినట్లయింది. ఈ పరిస్థితులు దుబాయ్ రియల్టీ మార్కెట్‌ను భారీగా కుంగదీశాయి.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


