ప్లాట్ కొనేముందు ఇలా చేయండి: హైడ్రా హెచ్చరిక | Conduct Thorough Verification Before Purchasing House Sites or Plot Says Hydraa | Sakshi
Sakshi News home page

ప్లాట్ కొనేముందు ఇలా చేయండి: హైడ్రా హెచ్చరిక

Mar 17 2026 5:49 PM | Updated on Mar 17 2026 5:59 PM

Conduct Thorough Verification Before Purchasing House Sites or Plot Says Hydraa

రాజధానిలో ప్లాట్, ఇంటి స్థలం కొనేముందు పూర్తిగా విచారించి, అన్నీ సరిగా ఉంటేనే ముందుకెళ్లాలని హైడ్రా సూచించింది. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఏమైనా ఉందా? అనుమతి పొందిన లే అవుట్ అయినా.. ఇంటి నంబరు, బై నంబర్లతో అమ్ముతున్నప్పుడు మరింత అప్రమత్తంగా పరిశీలించి కొనుగోలు చేయాలని పేర్కొంది.

ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఈ హెచ్చరికలు చేసింది. కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 48 ఫిర్యాదులు వచ్చాయి.అమీన్‌పూర్‌ చెరువులో తమ లేఔట్‌ మునిగిపోయిందని సెక్రటేరియట్‌ ఎంప్లాయీస్‌ హౌసింగ్‌ సొసైటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వాపోయారు.

కాప్రా జీఆర్‌ రెడ్డి నగర్‌ హెచ్‌ఎండీఏ లే ఔట్‌లో మొత్తం నాలుగు పార్కులు ఉన్నాయి. ఒక పార్కులో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రార్థన స్థలాలు వస్తున్నాయని నివాసితులు ఫిర్యాదు చేశారు. బాలానగర్‌ శోభనా కాలనీలోని అక్షయ ఎన్‌క్లేవ్‌ పేరిట 7.12 ఎకరాల్లో 69 ప్లాట్లతో 1983లో లేఔట్‌ వేశారు. ఇందులో రెండు స్థలాలను పార్కుల కోసం కేటాయించారు. 1700 గజాల పార్కును కబ్జా చేసేందుకు స్థానికులు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 200 గజాలు ఆక్రమించి షెడ్డు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. వెంటనే హైడ్రా స్పందించి చర్యలు తీసుకోవాలని, పార్కును కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement