బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అధిక జీతాలు ఉన్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా నెలాఖరుకు పెద్దగా పొదుపు మిగలకపోవడం చాలా మంది ఉద్యోగుల వాస్తవ పరిస్థితిగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపించింది.
తన బంధువు అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ఓ యూజర్ పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడైన అతని బంధువు మొదటి సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగం కోసం నెలకు రూ.1.5 లక్షల జీతంతో బెంగళూరుకు వెళ్లాడని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అతను పెద్ద విజయాన్ని సాధించాడని భావించినప్పటికీ, కొన్ని నెలల తర్వాత నగర జీవన వ్యయం ఎంత భారంగా ఉంటుందో అతనికి అర్థమైంది.
వచ్చే జీతంలో దేనికి ఎంత ఖర్చు అవుతోందన్నది ఆయన వివరంగా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇంటి అద్దె: ఆఫీస్‌కు సమీపంలోని చిన్న అపార్ట్‌మెంట్‌కు సుమారు రూ.36,000
కిరాణా సామాగ్రి: రూ.13,000 – రూ.15,000
ప్రయాణ ఖర్చులు: ట్రాఫిక్ కారణంగా క్యాబ్‌లు, ఆటోల కోసం రూ.6,000 – రూ.8,000
ఇతర ఖర్చులు: ఆన్‌లైన్ ఫుడ్, కాఫీ, వీకెండ్ విహారాలు కోసం రూ.10,000 – రూ.12,000
ఇవి కాకుండా సబ్‌స్క్రిప్షన్లు, వైద్య ఖర్చులు, అనుకోని బిల్లులు, అలాగే ఇంటికి డబ్బు పంపడం వంటి ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అన్ని ఖర్చుల తర్వాత నెలాఖరుకు అతనికి కేవలం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు మాత్రమే పొదుపు మిగులుతుందని తెలిపారు.
ఈ అనుభవం ద్వారా అతను ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడని పోస్టులో పేర్కొన్నారు. “సొంతూరులో నెలకు రూ.1 లక్షకుపైగా జీతం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ బెంగళూరు వంటి మెట్రో నగరంలో అదే జీతం కేవలం ప్రారంభ స్థాయి మాత్రమే” అని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో భిన్న స్పందనలు
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వేలల్లో వ్యూస్, వందలాది లైక్‌లను సాధించింది. చాలా మంది నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “సొంతూరులో అదే జీతంతో ఎక్కువగా పొదుపు చేయవచ్చు”, “పెద్ద నగరాలు మీకు తెలియకుండానే డబ్బును వేగంగా ఖర్చు చేయిస్తాయి” అని కొందరు వ్యాఖ్యానించగా “సరైన ఎంపికలు చేస్తే ఖర్చులను నియంత్రించుకోవచ్చు” అని మరో యూజర్ కామెంట్ చేశారు.


