పశ్చిమాసియాలో అలుముకున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ పదకొండో రోజుకు చేరుకోవడంతో.. కేవలం చమురు, సహజ వాయువు సరఫరా మాత్రమే కాకుండా, నిత్యవసర రంగాలు సైతం సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ముఖ్యంగా ఎరువులు, అల్యూమినియం, ప్యాకేజింగ్ మెటీరియల్స్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పాటు ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
అన్నదాతపై ఎరువుల సెగ
భారతదేశంలో విత్తనాల సీజన్ (ఖరీఫ్) ప్రారంభంకానున్న తరుణంలో ఎరువుల కొరత ఆందోళన కలిగిస్తోంది. దేశీయ ఎరువుల అవసరాల్లో 30% దిగుమతుల ద్వారానే తీరుతుండగా అందులో 40% వాటా ఒక్క మధ్యప్రాచ్య దేశాలదేనని క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది.
మెరుగైన రుతుపవనాల కారణంగా డిమాండ్ పెరగడంతో 2026 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల దిగుమతులు 41% పెరిగి 22.3 మిలియన్ టన్నులకు చేరుకుంటాయని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీని కేంద్రం తొలుత రూ.1.67 లక్షల కోట్లుగా అంచనా వేసినప్పటికీ అది రూ.1.86 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అయితే, 2027 ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.1.71 లక్షల కోట్లుగా కేటాయించడం గమనార్హం.
చైనా ఆంక్షలు
చైనా విధిస్తున్న సరఫరా పరిమితులతో గత నెలలోనే యూరియా ధరలు 20% పెరిగాయని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. ఇప్పుడు యుద్ధం తోడవడంతో ఈ ఖర్చు మరింత భారమవ్వనుంది.
అల్యూమినియం రంగంలోనూ అస్థిరత
ప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో 8-9% వాటా కలిగిన గల్ఫ్ దేశాల నుంచి సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది. యుద్ధం మొదలైన వారంలోపే ‘హైడ్రో’, ‘ఆల్బా’ వంటి దిగ్గజ సంస్థలు ఫోర్స్ మేజర్ (అనివార్య కారణాల వల్ల ఒప్పందాలను అమలు చేయలేకపోవడం) ప్రకటించాయి. అల్యూమినియం స్మెల్టర్లు ముడి పదార్థాల కోసం హార్మూజ్ జలసంధిపైనే ఆధారపడతాయి. యుద్ధం కారణంగా అటు ముడి పదార్థాలు, ఇటు ఇంధన లభ్యత రెండూ ప్రశ్నార్థకంగా మారాయి.
ప్యాకేజింగ్ పరిశ్రమకు దెబ్బ
యుద్ధం కారణంగా పాలిమర్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది నేరుగా ప్యాకేజింగ్ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. ప్యాకేజింగ్ తయారీదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్న బ్రాండ్లు కొంతవరకు తట్టుకోగలిగినా స్పాట్ మార్కెట్‌లో కొనుగోలు చేసే చిన్న సంస్థలు అధిక ధరల అస్థిరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘సరఫరా అంతరాయాలు కలగకుండా కస్టమర్లతో కలిసి పనిచేస్తున్నాం. ఈ సవాళ్లను అధిగమిస్తామనే నమ్మకం ఉంది’ అని ఆల్టర్నిక్ ఎండీ, సీఈఓ తిమ్మయ్య ఎన్‌పీ ఆశాభావం వ్యక్తం చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోతే రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారం పడే ప్రమాదం పొంచి ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే దౌత్యపరమైన, ఆర్థికపరమైన చర్యలే కీలకం కానున్నాయి.


