సవాళ్ల నుంచి అవకాశాలదాకా.. కెమికల్స్‌ రంగం బూమ్‌ | India Chemical Industry Set to Outpace Economic Growth McKinsey Report | Sakshi
Sakshi News home page

సవాళ్ల నుంచి అవకాశాలదాకా.. కెమికల్స్‌ రంగం బూమ్‌

Mar 19 2026 8:32 AM | Updated on Mar 19 2026 8:32 AM

India Chemical Industry Set to Outpace Economic Growth McKinsey Report

2030 నాటికి 255 బిలియన్‌ డాలర్ల దిశగా పరుగులు

సామర్థ్య పెంపు, టెక్నాలజీతో స్పీడ్‌ 

8 ప్రధాన విభాగాల్లో మరిన్ని అవకాశాలు 

మెకిన్సీ అండ్‌ కంపెనీ నివేదిక అంచనా

దేశీ కెమికల్స్‌ పరిశ్రమ ఆర్థిక వృద్ధిని మించి పరుగుతీయనున్నట్లు కన్సల్టింగ్‌ దిగ్గజం మెకిన్సీ అండ్‌ కంపెనీ తాజా నివేదికలో పేర్కొంది. దీంతో 2030కల్లా కెమికల్స్‌ రంగం 230–255 బిలియన్‌ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. ఇందుకు అధిక వృద్ధిలో ఉన్న విభాగాలు దోహదం చేయనున్నట్లు ‘ప్రపంచ అవరోధాలమధ్య సవాళ్ల నుంచి అవకాశాలలోకి దేశీ కెమికల్‌ పరిశ్రమ’ పేరుతో విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది.

ప్రస్తుతం 155–165 బిలియన్‌ డాలర్లుగా ఉన్న కెమికల్స్‌ పరిశ్రమ అంతర్జాతీయంగా అవాంతరాలు ఎదురైనప్పటికీ వార్షిక ప్రాతిపదికన 8–9 శాతం పురోగతిని సాధించనున్నట్లు అభిప్రాయపడింది. ఈ రంగంలో ప్రధానంగా 8 విభాగాలు అధిక వృద్ధిని అందుకోనున్నట్లు పేర్కొంది. ఈ జాబితాలో సెమీకండక్టర్స్, ఎలక్ట్రిక్‌ వాహనాలు– బ్యాటరీలు, రెనెవబుల్స్, కన్‌స్ట్రక్షన్, ఏరోస్పేస్‌– డిఫెన్స్, ఆటో విడిభాగాలు, బయో– ఎక్స్, ఈకామర్స్‌ను ప్రస్తావించింది. ఈ విభాగాలు 16 శాతం వార్షిక వృద్ధితో 2030కల్లా 30–35 బిలియన్‌ డాలర్ల అదనపు డిమాండుకు తెరతీయనున్నట్లు అంచనా వేసింది. ఈ కాలంలో నిర్మాణ సంబంధ కెమికల్స్‌ రెట్టింపై 28 బిలియన్‌ డాలర్లను తాకనున్నట్లు పేర్కొంది. ఇందుకు మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది.

17 శాతం రిటర్నులు

గత దశాబ్ద కాలంలో వార్షిక ప్రాతిపదికన మొత్తం వాటాదారులకు 17 శాతం రాబడిని అందించినట్లు మెకిన్సీ నివేదిక పేర్కొంది. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు, విదేశీ కంపెనీలను అధిగమించినట్లు వెల్లడించింది. అయితే కెమికల్స్‌ రంగంలో 31 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటును ప్రస్తావిస్తూ ప్రధానంగా ఇనార్గానిక్స్‌(12 బిలియన్‌ డాలర్లు), పాలిమర్స్‌(13 బిలియన్‌ డాలర్లు)లో దిగుమతి ప్రత్యామ్నాయాలకు వీలున్నట్లు వివరించింది. ఇందుకు ఉదాహరణగా స్టైరీన్, ఎసెటిక్‌ యాసిడ్, పాలియోల్స్‌ తదితర వేల్యూ చైన్స్‌లో ప్రపంచస్థాయి సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.   

వృద్ధిని అందుకునేందుకు వీలుగా కంపెనీలు అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించవలసి ఉన్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా భాగస్వామ్యాలు నెలకొల్పుకోవడం, ఇతర సంస్థల కొనుగోళ్లు, పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ)పై వ్యయాల పెంపు, ఏఐ ఆధారిత సామర్థ్యాలను అమలు చేయడం తదితరాలను ప్రస్తావించింది. ప్రపంచస్థాయిలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునేందుకు సరఫరా చైన్, బ్యాలన్స్‌షీట్లను పటిష్టపరచుకోవడంతోపాటు.. విలువ ఆధారిత వృద్ధిపై దృష్టిపెట్టవలసి ఉన్నట్లు తెలియజేసింది. వెరసి కెమికల్స్‌ పరిశ్రమ నిర్వచనా దశాబ్దంలోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొంది.  

వాటా స్వల్పమే

గత దశాబ్ద కాలంలో దేశీ కెమికల్స్‌ పరిశ్రమ పటిష్ట వృద్ధిని సాధించినప్పటికీ అంతర్జాతీయ కెమికల్స్‌ వాణిజ్యంలో వాటా 3 శాతమే. చైనా 20 శాతం వాటాను ఆక్రమిస్తుంటే.. యూరోపియన్‌ యూనియన్‌ 15 శాతం, యూఎస్‌ 10 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. దేశీయంగా ఈ రంగంలో విలీనాలు, కొనుగోళ్ల వాటా 0.9 శాతమేకాగా.. జాతీయ సగటు 2.5 శాతంగా ఉంది. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోర్ట్‌ఫోలియో క్రమబద్ధీకరణకు తెరలేవడంతోపాటు.. యూరప్‌లో ఆస్తుల విలువ పునర్‌నిర్మితమవుతున్న నేపథ్యంలో ఇతర సంస్థల కొనుగోళ్లు, టెక్నాలజీ అందుకునేందుకు దేశీ కంపెనీలకు అవకాశాలున్నట్లు నివేదిక పేర్కొంది. 

జపాన్, యూఎస్, ఈయూలతో పోలిస్తే దేశీ కంపెనీలు చాల స్వల్ప స్థాయిలో అంటే ఆదాయంలో 0.5 శాతమే ఆర్‌అండ్‌డీపై వెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. ఈ రంగంలో ఆర్‌అండ్‌డీ కీలకమని పేర్కొంది. ఏఐ, అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌ వినియోగంతో ప్రొక్యూర్‌మెంట్, సరఫరా చైన్‌ నిర్వహణ తదితరాలలో భారీ పెట్టుబడులు చేపట్టకుండానే ఇబిటాను 8–12 శాతంమేర మెరుగుపరచుకోవచ్చని అభిప్రాయపడింది.

ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement