ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం! | India Shift to Natural Farming Food Security Health Economy Climate Risks | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం!

Mar 17 2026 3:11 PM | Updated on Mar 17 2026 5:07 PM

India Shift to Natural Farming Food Security Health Economy Climate Risks

మానవ మనుగడకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుత రోజుల్లో రసాయన ఎరువులపై మితిమీరి ఆధారపడటం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అస్థిరమైన గ్లోబల్ మార్కెట్లు మన ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ వ్యవసాయ రంగం ప్రకృతి సాగువైపు అడుగులు వేయడం కేవలం పర్యావరణ హితం మాత్రమే కాదు.. దేశ ఆర్థిక, ఆరోగ్య భద్రతకు అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుత ఆధునిక వ్యవసాయం శిలాజ ఇంధనాలతో విడదీయలేని విధంగా ముడిపడి ఉంది. ఐపీఈఎస్‌-ఫుడ​్‌ 2024-25 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లభించే పెట్రోకెమికల్స్‌లో 40%, శిలాజ ఇంధనాల్లో 15 కేవలం ఆహార వ్యవస్థలకే వినియోగిస్తున్నారు. అంటే, అంతర్జాతీయ ఇంధన ధరల్లో వచ్చే స్వల్ప మార్పు కూడా సామాన్యుడి కంచంలోని ఆహార ధరను ప్రభావితం చేస్తోంది.

రసాయన ఎరువుల సెగ

ప్రపంచవ్యాప్త ప్రోటీన్ వినియోగంలో 40% కేవలం ‘హేబర్-బోష్’(గాలిలో ఉండే నైట్రోజన్‌ను మొక్కలకు ఉపయోగపడే అమ్మోనియాగా మార్చే పద్ధతి) ప్రక్రియ ద్వారా తయారయ్యే సింథటిక్ నైట్రోజన్ ఎరువులపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం యూరియా ధర టన్నుకు 585 డాలర్ల వద్ద ఉండగా భవిష్యత్తులో ఇది 650-700 డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారతదేశం తన అమ్మోనియా, సల్ఫర్ దిగుమతుల్లో 2/3 వంతు గల్ఫ్ దేశాల నుంచే పొందుతోంది. అక్కడ తలెత్తే రాజకీయ అనిశ్చితి మన పొలాల్లో ఎరువుల కొరతకు దారితీస్తోంది.

శాస్త్రీయ వాస్తవాలు

ఐపీసీసీ(ఇంటర్‌గవర్న్‌మెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమెట్‌ చేంజ్‌) హెచ్చరికల ప్రకారం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంట కాలాలను కుదించేస్తున్నాయి. దేశంలో ఇది ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల గోధుమల దిగుబడి తగ్గుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వరిసాగులో గింజ గట్టిపడే ప్రక్రియ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యాంత్రాంగం స్పందించి వరి, గోధుమలపైనే కాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల వైపు సాగును మళ్లించాల్సిన సమయం ఆసన్నమైంది.

రసాయన సాగు వల్ల నేలతోపాటు మానవులు రోగాల బారిన పడుతున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ నివేదికల ప్రకారం, ఆహారంలో రసాయన అవశేషాల వల్ల అంటువ్యాధులు కాని రోగాలు (ఎన్‌సీడీ) వేగంగా పెరుగుతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతినడం వల్ల పరాగ సంపర్కం చేసే కీటకాలు అంతరించిపోతున్నాయి. ఇది దిగుబడుల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది.

మార్పు కోసం వ్యూహం

ప్రకృతి సాగు వైపు మార్పు అనేది ఒక్కరోజులో జరిగే పనికాదు. ఇది క్రమబద్ధంగా శాస్త్రీయంగా జరగాలి. దీనికోసం ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని సూత్రాలను నిపుణులు సూచిస్తున్నారు.

  • రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువులను ప్రోత్సహించాలి.

  • నేల ఆరోగ్యం, సూక్ష్మజీవుల పాత్ర, చెట్లు-పశువులు-పంటల కలయికపై వ్యవసాయ పరిశోధనా సంస్థలు దృష్టి సారించాలి.

  • ఎరువుల కోసమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడే రైతులకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించే వారికి ప్రోత్సాహకాలు అందించాలి.

  • ప్రకృతి సాయంతో తయారైన ఉత్పత్తులకు ప్రత్యేక సరఫరా గొలుసును నిర్మించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలి.

యుద్ధాలను, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను వెంటనే నియంత్రించలేకపోవచ్చు. కానీ, మన ఆహారాన్ని ఎలా పండించుకోవాలో మనం నిర్ణయించుకోగలం. పెట్టుబడి తగ్గించి, ప్రకృతితో మమేకమయ్యే సాగు ద్వారానే మన భూమిని, భావితరాల ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని గుర్తుంచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement