పెరిగిపోతున్న ఇంధన వ్యయాలు
ఎగుమతులకు అవరోధాలు
ఐపీఎంఏ ఆందోళన
పశ్చిమాసియా సంక్షోభంతో దేశీ పేపర్ పరిశ్రమను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇంధన వ్యయాలు పెరిగిపోవడం, ఎగుమతులకు అవరోధాలతో వ్యాపారాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మన పేపర్ పరిశ్రమకు కీలక ఎగుమతి మార్కెట్లలో పశ్చిమాసియా కూడా ఒకటిగా ఉంటోంది. 2024–25లో దేశీ పరిశ్రమ 980 మిలియన్ డాలర్ల పేపర్, పేపర్‌బోర్డును ఎగుమతి చేయగా అందులో పశ్చిమాసియా దేశాల వాటా 290 మిలియన్ డాలర్లుగా (సుమారు 30 శాతం) ఉన్నట్లు పేపర్ తయారీ సంస్థల సమాఖ్య ఐపీఎంఏ తెలిపింది.
అన్‌కోటెడ్ రైటింగ్..ప్రింటింగ్ పేపర్, కోటెడ్ పేపర్..పేపర్‌బోర్డ్, క్రాఫ్ట్ పేపర్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. తమ పరిశ్రమలో ప్రధానంగా ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుందని, దీనితో భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం తమపైనా ఉంటోందని ఐపీఎంఏ వివరించింది. ఇంధన రేట్లు పెరిగిపోవడం, సరఫరాపరమైన అవరోధాల వల్ల దేశీ పేపర్ మిల్లుల ఉత్పత్తి వ్యయాలపై నేరుగా ప్రభావం పడుతోందని వివరించింది. పేపర్ తయారీ ప్రక్రియకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్..బైండర్స్‌లాంటి ఉత్పత్తులను సమకూర్చుకోవడంలో మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.
మరో వైపు, పేపర్‌ని ఉత్పత్తి చేసే చైనా, ఇండొనేషియాలాంటి దేశాలు ఎగుమతి కోసం పశ్చిమాసియాపై ఆధారపడతాయని, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల, సదరు ఉత్పత్తులను ఇప్పుడు అవి భారత్ వైపు మళ్లించే అవకాశం ఉందని ఐపీఎంఏ తెలిపింది. దీనితో చౌక దిగుమతులు వెల్లువెత్తి, దేశీ తయారీ సంస్థలపై ఒత్తిడి పెరిగిపోయే ముప్పు ఉందని వివరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే ముప్పు నెలకొందని ఐపీఎంఏ ప్రెసిడెంట్ పవన్ అగర్వాల్ చెప్పారు.
ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు


