సియామ్‌ నివేదికలో కీలక అంశాలు: వాహన విక్రయాలు ఇలా.. | India Passenger Vehicle Wholesale Sales Rise 10 6 Percent in February SIAM Report | Sakshi
Sakshi News home page

సియామ్‌ నివేదికలో కీలక అంశాలు: వాహన విక్రయాలు ఇలా..

Mar 15 2026 7:26 AM | Updated on Mar 15 2026 12:22 PM

India Passenger Vehicle Wholesale Sales Rise 10 6 Percent in February SIAM Report

దేశీయంగా ఫిబ్రవరిలో సానుకూల పరిస్థితులతో ప్యాసింజర్‌ వాహన టోకు అమ్మకాలు (కంపెనీల నుంచి డీలర్లకు) 4,17,705 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నమోదైన 3,77,689 యూనిట్లతో పోలిస్తే 10.6 శాతం పెరిగినట్లు వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ వెల్లడించింది.

ప్యాసింజర్‌ వాహనాలు, టూ–వీలర్లు, త్రీ–వీలర్ల అమ్మకాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయని, గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు. అయితే, దేశవ్యాప్తంగా మార్చిలో పండుగలపరమైన సానుకూల అంచనాలు నెలకొన్నప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధంతో తయారీ, ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఉందని పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ పరిణామాలను పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు.

సియామ్‌ నివేదికలో మరిన్ని కీలకాంశాలు..
➤యుటిలిటీ వాహనాల అమ్మకాలు 2,08,795 యూనిట్ల నుంచి 13.5 శాతం పెరిగి 2,36,957 యూనిట్లకు చేరాయి.
➤ప్యాసింజర్‌ కార్ల విక్రయాలు 1,10,966 నుంచి 3.8 శాతం క్షీణించి 1,06,799 యూనిట్లకు పరిమితమయ్యాయి.
➤వ్యాన్ల అమ్మకాలు 1.1 శాతం పెరిగి 11,493 యూనిట్ల నుంచి 11,620 యూనిట్లకు చేరాయి.
➤ద్విచక్ర వాహన విక్రయాలు 13,84,605 యూనిట్ల నుంచి 35.2 శాతం వృద్ధితో 18,71,406కి పెరిగాయి. మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 30.8 శాతం పెరిగి 10,96,537 యూనిట్లకు, స్కూటర్లు 42.3 శాతం వృద్ధితో 5,12,783 యూనిట్లకు చేరాయి.
➤త్రీ–వీలర్ల విక్రయాలు 29 శాతం వృద్ధితో 57,788 యూనిట్ల నుంచి 74,573 యూనిట్లకు పెరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement