2035 నాటికి మార్కెట్ అంచనా
ఏఐ, డేటా సెంటర్స్ వృద్ధి దన్ను
డెలాయిట్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీ సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే 2035 నాటికి 300 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. కృత్రిమ మేధ వినియోగం పెరుగుతుండటం, ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధి చెందుతుండటం, డేటా సెంటర్లు విస్తరిస్తుండటం తదితర అంశాలు ఇందుకు దన్నుగా నిలవనున్నాయి. టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ భవిష్యత్తుపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం ప్రస్తుతం 90 శాతం సెమీకండక్టర్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, 2035 ఆఖరు నాటికి దేశీ డిమాండ్‌లో 60 శాతం చిప్స్‌ను స్థానికంగానే ఉత్పత్తి చేసుకోనుంది. ‘భారత్‌లో సెమీకండక్టర్ మార్కెట్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 45–50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, గత మూడేళ్లుగా వార్షికంగా 20 శాతం మేర వృద్ధి చెందుతోందని అంచనా.
ఈ నేపథ్యంలో ఏఐ, ఆటోమోటివ్స్, డేటా సెంటర్స్, ఎల్రక్టానిక్స్ తయారీ ఊతంతో 2030 నాటికల్లా 120 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరొచ్చు‘ అని డెలాయిట్ పేర్కొంది. దేశీయంగా సెమీకండక్టర్ల డిమాండ్‌లో మొబైల్ ఫోన్లు, ఆటోమోటివ్, కంప్యూటింగ్, డేటా సెంటర్లలాంటి సెగ్మెంట్ల వాటా 70 శాతం పైగా ఉండనుంది.
ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ..
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) కింద ఇప్పటికే 10 ప్రాజెక్టుల్లోకి 19 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ఎనిమిది ఔట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ ..టెస్ట్ (ఓఎస్‌ఏటీ) ప్లాంట్లు, ఒక సెమీకండక్టర్ ఫ్యాబ్ ఉన్నాయి. సుమారు 20–25 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో మరో 18–20 ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ‘వచ్చే ఐదేళ్లలో భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమలోకి మరో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావొచ్చు. అలాగే 2030–2035 మధ్య ఇంకో 75–80 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవస్థ మరింతగా విస్తరిస్తుంది‘ అని నివేదిక వివరించింది.
భారీగా ఉద్యోగాలు..
సెమీకండక్టర్ల వ్యవస్థ విస్తరించడంతో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన కూడా జరగనుంది. 2035 నాటికి పరిశ్రమలో సుమారు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఇందులో 30% ఉద్యోగాలు తయారీ కార్యకలాపాల్లో, 30% డిజైన్ సర్వీసుల్లో, మిగతా 40 శాతం ఇతరత్రా విభాగాల్లోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏటా 4,00,000–5,00,000 మందికి పరిశ్రమ సంబంధిత కోర్సులు, నైపుణ్యాల్లో శిక్షణనివ్వాల్సి ఉంటుందని నివేదిక వివరించింది. అయితే, ఈ సానుకూల పరిణామాలన్నీ కూడా వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంపైనే ఆధారపడి ఉంటాయని వివరించింది. స్థలం, యుటిలిటీలు, మౌలిక సదుపాయాలకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, వార్షికంగా బడ్జెట్లో కేటాయింపులు, నిర్దిష్ట కాలపరిమితితో కూడుకున్న ప్రోత్సాహక స్కీములకే పరిమితం కాకుండా నిధుల లభ్యతపరంగా కచ్చితత్వం ఉండేలా జాతీయ స్థాయి ప్రోగ్రాంను రూపొందించాలని సూచించింది.


