ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు
వారంలో ఒక్క రోజూ ఆటలు ఆడని 24 కోట్ల మంది చిన్నారులు
కిశోరుల్లో శారీరక చురుకుదనం కరువు
బాలికల్లో మరింత తీవ్రం
2030 నాటికి నిష్క్రియత తగ్గింపు లక్ష్యం గగనమే
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: బాల్యం ఆటపాటలతో కళకళలాడాలి.. పసిప్రాయంలోనే శారీరక ధృఢత్వం అలవడాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. 11 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి నలుగురిలో ఒకరు ఆటలకు దూరంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తేల్చింది. ఇలా దాదాపు 24 కోట్ల మంది బాలబాలికలు వారంలో ఒక్కరోజు కూడా కనీసం గంటపాటు శారీరక శ్రమ చేయడం లేదని వెల్లడించింది. ముఖ్యంగా బాలికలు బాలుర కంటే ఎక్కువగా శారీరక శ్రమకు దూరమవుతున్నారని తాజా అధ్యయనం హెచ్చరించింది. 140 దేశాలు, ప్రాంతాలకు చెందిన పిల్లల సమాచారాన్ని విశ్లేషించి ఈ అధ్యయనాన్ని రూపొందించింది. తాజాగా విడుదలైన పరిశోధన వివరాలు ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
లక్ష్యానికి ఆమడ దూరంలో..
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా శారీరక నిష్క్రియత(శారీరకశ్రమ లేకపోవడం)ను 15 శాతం తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఏ దేశమూ ముందుకు సాగడం లేదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. పాఠశాలల్లో ఆట స్థలాలు, సమాజంలో క్రీడా కార్యక్రమాలు, సురక్షితమైన నడక, సైక్లింగ్ మార్గాలు అందుబాటులో లేకపోవడం కూడా పిల్లల శారీరక చురుకుదనాన్ని ప్రభావితం చేస్తున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ముఖ్యంగా బాలికలకు సురక్షితమైన ఆటస్థలాలు, క్రీడల్లో సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది.
14 శాతం బాలలే శారీరక శ్రమ
» వారంలో కనీసం ఒక్కరోజు కూడా 60 నిమిషాల పాటు నడక, పరుగు, ఆటలు, సైక్లింగ్ వంటి శారీరక కార్యకలాపాల్లో పాల్గొనని కిశోరుల సంఖ్య ఆందోళనకరంగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.
» ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 శాతం మంది మాత్రమే వారంలో ఏడు రోజులూ గంటపాటు శారీరక శ్రమ చేస్తున్నారని పేర్కొంది.
» 2025 గణాంకాల ప్రకారం వారంలో ఒక్కరోజూ శారీరక శ్రమ చేయని బాలికలు 28 శాతం ఉండగా, బాలుర సంఖ్య 22 శాతంగా ఉందని తెలిపింది.
» 15 ఏళ్లుగా ఈ పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
» దేశాలవారీగా పరిశీలిస్తే సెర్బియా, కెనడా, ఐర్లాండ్, కజకిస్థాన్, ఫిన్లాండ్ దేశాల్లో కిశోరులు వారానికి సగటున 4.5 నుంచి 4.8 రోజులు శారీరకంగా చురుకుగా ఉంటున్నారు.
» కంబోడియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, నేపాల్ తదితర దేశాల్లో ఈ సగటు 1.7 నుంచి 1.9 రోజులకు మాత్రమే
పరిమితమైంది.
» ఈజిప్ట్, బ్రెజిల్, కెన్యా, దక్షిణ కొరియాల్లో బాలికలు బాలుర కంటే ఎక్కువగా శారీరక శ్రమకు దూరమవుతున్నట్లు అధ్యయనం గుర్తించింది.


