యాన్‌ క్యార్సన్‌ స్మృతిగానం | Anne Carson won the PEN Nabokov Award for Achievement in International Literature | Sakshi
Sakshi News home page

యాన్‌ క్యార్సన్‌ స్మృతిగానం

Oct 10 2026 4:28 AM | Updated on Oct 10 2026 4:28 AM

Anne Carson won the PEN Nabokov Award for Achievement in International Literature

మందలపర్తి కిషోర్‌

ఈ యేడాది(2026) నోబెల్‌ సాహిత్య పురస్కారం కెనడియన్‌ కవయిత్రి యాన్‌ క్యార్సన్‌ గెల్చుకున్నట్లు అక్టోబర్‌ ఎనిమిదో తేదీన స్వీడిష్‌ ఎకాదెమీ ప్రకటించింది. ఆ ప్రకటన వినగానే, ‘మీకందరికీ మతిపోయినట్లుంద’ని నవ్వారట యాన్‌. ఆమె నోబెల్‌ పురస్కారం గెల్చుకోవడం మరీ అంత నవ్వులాట వ్యవహారమేం కాదు! యాన్‌ అనామకురాలేం కాదు.

 1996–2026 మధ్యకాలంలో ఆమె పది జాతీయ– అంతర్జాతీయ సాహిత్య పురస్కారాలు గెల్చుకున్నారు. వాటిలో, 2001లో గెల్చుకున్న ‘టీ.యెస్‌.ఇలియట్‌ ప్రైజ్‌‘, 2021లో గెల్చుకున్న ‘పెన్‌ నబకోఫ్‌ ప్రైజ్‌‘ చెప్పుకోదగినవి. ఈ యేడాది ఆమె గెల్చుకున్న నోబెల్‌ సాహిత్యపురస్కారం వీటన్నిటికీ తలమానికమైనది.

సుప్రసిద్ధ చైనీస్‌ రచయిత్రి చాన్‌ ష్యూహ్, జపనీస్‌ నవలారచయిత హరూషీ మురకామీ నుంచి యాన్‌ కార్సన్‌కు గట్టి పోటీ ఎదురైంది. ఆమె సిసలైన పోటీ ఎదుర్కొన్నది మాత్రం సహచర– ఆమాటకొస్తే సీనియర్‌– కెనడియన్‌ రచయిత్రి మార్గరెట్‌ యాట్వుడ్‌ నుంచనే చె΄్పాలి. ఈసారి సల్మాన్‌ రష్డీ పేరు కూడా ప్రముఖంగానే వినవచ్చింది. 

ఈ నేపథ్యంలో, తనకు 2026 సంవత్సరానికిగాను నోబెల్‌ సాహిత్య పురస్కారం వచ్చే అవకాశం వుందని యాన్‌ క్యార్సన్‌ అనుమానించయినా వుండకపోవచ్చు. అందుకే, ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన మిత్రులను ఆమె ‘మతిలేనివారిగా’ పరిగణించి వుండవచ్చు! కానీ, నోబెల్‌ బుక్కీల దగ్గిర పెద్ద సంఖ్యలో బెట్టింగులను ఆకర్షించిన పేర్లలో యాన్‌ మరీ వెనకబడి లేరు. ఆ జాబితాలో ఆమె పేరు రెండో స్థానంలో ఉందని అభిజ్ఞ వర్గాల కథనం!

అన్న కోసం వెదుకులాటలో మన దేశానికి...
ప్రాచీన గ్రీకో–రోమన్‌ సంస్కృతినీ, సాహిత్యాన్నీ లోతుగా అధ్యయనం చేసిన విద్వాంసురాలిగా యాన్‌ ప్యాట్రీషియా క్యార్సన్‌ ప్రఖ్యాతి పొందారు.  ప్రాచీన సంస్కృతితో ఆమె నిర్మొహమాటంగా సాగించిన సంభాషణ, సమకాలీన సాహిత్యంలో సరికొత్త ధోరణులకు శ్రీకారం చుట్టింద’ని నోబెల్‌ సాహిత్య పురస్కార ప్రకటనలో స్వీడిష్‌ ఎకాడెమీ చేసిన వ్యాఖ్య గమనార్హం.

 నిర్దిష్ట రచనకు నోబెల్‌ సాహిత్య పురస్కారం ప్రకటించే ఆచారం ఎకాడెమీకి లేదు. అయితే, యాన్‌ క్యార్సన్‌ పేరు చెప్పగనే చదువుకున్న వాళ్ళందరికీ గుర్తొచ్చే ఆమె రచన ‘నాక్స్‌.’ రోమన్‌ కవి  క్యాటలస్‌ రాసిన 101వ గీతం లాటిన్‌ గేయ సాహిత్యంలో సుప్రసిద్ధం. తన సోదరుడి సమాధి ముందు మోకరిల్లి, క్యాటలస్‌ ఈ సుదీర్ఘ స్మృతి గీతం గానం చేశాడంటారు. యాన్‌ క్యార్సన్‌ తన అన్న మైకేయ్ల్‌ క్యార్సన్‌ స్మృత్యర్థం రచించిన సుదీర్ఘ స్మృతిగీతం ‘నాక్స్‌‘పై క్యాటలస్‌ రచన ప్రభావం అపారం. 

192 పేజీలకు విస్తరించిన ఈ స్మృతిగీతాన్ని మామూలుగా మనం చూసే పుస్తకాల్లా ముద్రించలేదు. ఒకే కాగితాన్ని ఎకార్డియన్‌ మడతల మాదిరిగా మడిచి, బైండ్‌ చెయ్యడం ఈ పుస్తకం తయారీలోని ఒక విశేషం! మైకేయ్ల్‌ మాదకద్రవ్యాల సరఫరా–వినియోగాల నేరానికి పాల్పడినట్లు కెనడా అధికారులు ఆయనపై కేసు పెట్టారంటారు. పోలీసులనుంచి తప్పించుకునే ప్రయత్నంలో మైకేయ్ల్‌ మన దేశంతో సహా ఎన్నో యూరపియన్‌ దేశాల్లో కూడా తిరిగాడట.

 అన్న గారిని వెదుక్కుంటూ యాన్‌ మనదేశానికి వచ్చి కొంతకాలం ఇక్కడా వున్నారట కూడా. ఏమైతేనేం– పాపం అన్నా చెల్లెలూ మాత్రం తిరిగి కలుసుకోనే లేదు!  కెనడాలోని టొరాంటో నగరంలో పుట్టిన యాన్‌ తండ్రి బ్యాంకు అధికారి. తండ్రి ఉద్యోగం కారణంగా యాన్‌ కెనడాలోని ఎన్నో చిన్నాచితకా పట్టణాల్లో ఉండాల్సివచ్చింది. హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనే యాన్‌ప్రాచీన గ్రీకు భాషాసాహిత్యాలతో పరిచయం ఏర్పర్చుకుంది. 

ఆమెకు ల్యాటిన్‌ భాష నేర్పే బోధకుడు ఆమెను అటువైపు మళ్ళించాడంటారు. టొరాంటో విశ్వవిద్యాలయంలోని మైకేయ్ల్‌ కాలేజ్‌లో –వాయిదా పద్ధతుల్లో– డిగ్రీ కోర్స్‌ పూర్తి చేసి, చకచకా ఎమ్మే, పీహెచ్డీ పట్టాలు కూడా పుచ్చుకున్నారామె. దాదాపు నలభయ్యేళ్ళ పాటు యాన్‌ క్యార్సన్‌ కెనడాలోనే కాక, అమెరికాలోనూ అధ్యాపక వృత్తి చేపట్టి, పలు ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో పనిచేశారు. అయితే ఆమె ప్రయాణం ‘పడిలేచే కడలితరంగం’ మాదిరే సాగడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement