గత కాల ఘనకీర్తి | Anne Carson wins Nobel prize in literature 2026 | Sakshi
Sakshi News home page

గత కాల ఘనకీర్తి

Oct 10 2026 4:02 AM | Updated on Oct 10 2026 4:02 AM

Anne Carson wins Nobel prize in literature 2026

నోబెల్‌ విజేత

ఈ సంవత్సరం నోబెల్‌ సాహిత్య బహుమతి కెనడియన్‌ రచయిత్రి యాన్‌ కార్సన్‌ను వరించింది.ప్రాచీన గ్రీకు, రోమన్‌ సాహిత్యాన్ని మథించిన కార్సన్‌ ఆ ఫలాలను వివిధ రూపాల్లో పాఠకులకు అందించారు. ‘గతమెంతో ఘన కీర్తి’ అని తన రచనల ద్వారా చెప్పకనే చెప్పిన కార్సన్‌ అంతరంగం, ఆలోచనలు, జ్ఞాపకాలు..

→ ఒంటారియా(కెనడా)ప్రావిన్స్‌లోని చిన్న చిన్న పట్టణాలలో పెరిగాను. నాన్న బ్యాంకు ఉద్యోగి. అమ్మ గృహిణి. చిన్నప్పుడు బొమ్మలంటే ఇష్టం. బొమ్మలు గీయడం రాకపోయినా వాటికి అందంగా పేర్లు పెట్టడం మాత్రం వచ్చింది. బొమ్మలకు పేర్లు పెట్టే అలవాటే నన్ను రచనలకు దగ్గర చేసింది. బొమ్మలు గీయడమైనా, రాయడమైనా మనసుకు పని కల్పిస్తాయి. ఉత్తేజాన్ని ఇస్తాయి.

→ ప్రాచీన సాహిత్యం, గ్రీకు పురాణాలతో నా అనుబంధం గురించి చె΄్పాలంటే... 1965 కాలానికి వెళ్లాలి. హమిల్టన్‌లోని ఒక బుక్‌స్టోర్‌కు వెళ్లాను. అక్కడ ఒక పుస్తకం చూశాను. ఎడమ వైపు గ్రీకు, కుడి వైపు ఇంగ్లీష్‌ ఉన్నాయి. ఆ పుస్తకం ఆకర్షణీయంగా అనిపించడమే కాదు గ్రీకు బాష నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని 
రేకెత్తించింది.

నేను చదివే హైస్కూల్‌లో లాటిన్‌ టీచర్‌ కోవాన్‌కు గ్రీకు బాగా తెలుసు. నా ఆసక్తిని గమనించి రోజూ లంచ్‌ టైమ్‌లో గ్రీకు నేర్చించేవారు. గ్రీకు నేర్చుకునే క్రమంలో పునర్జన్మ పొందిన ఆస్కార్‌వైల్డ్‌గా నన్ను నేను భావించుకునేదాన్ని. ఆయనలా మేకప్‌ వేసుకునే దానిని. ఆస్కార్‌వైల్డ్‌ కాలం నాటి మేధోప్రపంచంలో గ్రీకు, లాటిన్‌లు ఎక్కువగా ఉండేవి. గ్రీకు నేర్చుకుంటే ఆస్కార్‌వైల్డ్‌ అంతటి గొప్ప రచయిత కావచ్చు అనుకున్నాను!
 

→ నేను మొదట కొన్న అనువాద పుస్తకంలో నాకు ప్రత్యేకంగా గుర్తున్నది టిథోనస్‌ పురాణగాథ. టిథోనస్‌ అనే యువకుడు ఒక దేవతతో ప్రేమలో పడతాడు. తనను అమరుడిగా చేయమని ఒకరోజు ఆ దేవతను అడుగుతాడు. తాను కూడా దేవుడై ఆమెతో శాశ్వతంగా జీవించాలని కోరుకుంటాడు. ఆమె జ్యూస్‌ దగ్గరికి వెళ్లి...‘టిథోనస్‌కు అమరత్వాన్ని ప్రసాదించగలరా?’ అని అడుగుతుంది. ‘అలాగే!’ అంటూ జ్యూస్‌ అతడికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. అతడు మిడతలా మారిపోవడం అనేది ట్విస్ట్‌!

→ ప్రాచీనకాలం నాటి విషయాలకు నేటికాలంతో పెద్దగా సంబంధం లేదు’ అని నేను గతంలో ఒకసారి అన్నాను. దీని ఉద్దేశం గతాన్ని తిరస్కరించడం కాదు. వారి కాలానికి మనం ఎంత వరకు సరిపోతామన్నదే నా మాటల సారాంశం. వెనక్కివెళ్లి వారి కోణం నుండి ఆలోచించి, వారు ఏం చేశారో తెలుసుకోవడమే మన బాధ్యత. గతాన్ని అధ్యయనం చేయడమంటే మన అభిప్రాయాలను వారిపై రుద్దడం కాదు. వారి మాటలను శ్రద్ధగా వినడం. వారి ఆలోచనలు తాజాగా, మంచుబిందువుల తాజాదనంతో ఉన్నట్లు ఉంటాయి.

→ మిసెస్‌ కోవాన్‌ దగ్గర గ్రీకు చరిత్ర, పురాణాలు అధ్యయనం చేస్తున్న కాలంలో ‘ఇదే నా జీవిత కాల అధ్యయనం కావాలి’ అని గట్టిగా అనుకున్నాను. ఆమె చాలా విలక్షణమైన మహిళ. కొంతకాలం తరువాత కోవాన్‌ తన ఉద్యోగం వదిలేసి అదృశ్యమయ్యారు.

ఆమె ఆఫ్రికాలో ఉన్నారని ఎవరో చె΄్పారు. కొంతకాలం తరువాత... మాంట్రియల్‌లో అనుకుంటా, నేను గ్రీకు రచనలను చదివి వినిపిస్తున్నప్పుడు కోవాన్‌ గురించి ప్రస్తావించాను. అప్పుడు ఒకావిడ నా దగ్గరకు వచ్చి‘ఆమె మా అమ్మ. నార్త్‌ ఒంటారియోలోని ఒక పొలంలో నివసిస్తున్నారు. ఏకాంతవాసిలా జీవితం గడుపుతున్నారు. మీ నుండి ఏదైనా ఉత్తరం వెళితే అమ్మకు సంతోషంగా ఉంటుంది. అయితే ఆమె బదులివ్వక పోవచ్చు’ అన్నారు. దీంతో కోవాన్‌కు ఒక ఉత్తరం రాశాను. ఆమె నుండి మాత్రం నాకు ఎలాంటి ఉత్తరం రాలేదు.

సడి చేయవే గాలి!
నోబెల్‌ బహుమతి గురించి తెలియజేయడానికి కమిటీ యాన్‌ కార్సన్‌ను సంప్రదించినప్పుడు ఆమె గాలి శబ్దాన్ని వింటూ ఆస్వాదిస్తున్నారు.‘ఇక్కడ గాలి శబ్దాన్ని వినకుండా ఉండలేం. మేము గాలితోనే కలిసి జీవిస్తాం. నేను అదే చేస్తున్నాను’ అన్నారు. ఆమె రచనలలో అత్యంత ఆదరణ పొందిన పుస్తకం నాక్స్‌. 
సోదరుడు మైఖేల్‌ మరణం తరువాత ‘నాక్స్‌’ రాశారు. ఫొటోగ్రాఫ్‌లు, లేఖలు, చేతిరాతలతో అకార్డియన్‌–ఫోల్డ్‌ ఫార్మాట్‌లో ఉంటుంది.

– యాకుబ్‌ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement