breaking news
Demolition of Temple
-
హే రామ్.. ఆలయాలను కాపాడండి.. ఏపీని రక్షించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పవిత్ర ఆలయాల కూల్చివేతలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు పాలనలో ఆలయాల కూల్చివేతల పరంపర కొనసాగుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుపతి సమీపంలోని ఆంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ సోమవారం ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు. తిరుమల వేయికాళ్ల మండపం నుంచి...‘హే రామ్.. ఆలయాలను కాపాడండి.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి... చంద్రబాబు పాలనలో ఆలయాల విధ్వంస పరంపర కొనసాగుతూనే ఉంది. ఆంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడి.తిరుమలలో చారిత్రక వెయ్యికాళ్ల మండపాన్ని ధ్వంసం చేయడం మొదలుకొని కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో 40 ఆలయాలను కూల్చివేయడం... బద్వేలులోని కాశినాయన జ్యోతిక్షేత్రంలో కూల్చివేతల వరకు.. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేయడం కొనసాగుతూనే ఉంది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తే... చంద్రబాబు ప్రభుత్వం మాత్రం చారిత్రక వారసత్వ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది. మీ ప్రభుత్వం దృష్టిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఇదేనా?’ అని వైఎస్ జగన్ నిలదీశారు. -
పురాతన ఆలయం ధ్వంసం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: పుష్కరాలు, అభివృద్ధి పేరుతో గతంలో అనేక ఆలయాలను ధ్వంసం చేయించిన చంద్రబాబు.. ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో తిరుపతి సమీపంలోని అతి పురాతన, అతి విశిష్టమైన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ధ్వంసం చేయించారు. సోమవారం స్వామి విగ్రహాన్ని గునపాలతో పెకలించి, గోపురం, ఇతర విగ్రహాలను జేసీబీలతో ధ్వంసం చేసి నేలపై పడేశారు. ఈ ఆలయాన్ని అలాగే ఉంచి, రోడ్డు విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, కొందరి ప్రయోజనాల కోసం అతి పవిత్ర క్షేత్రాన్ని నేలమట్టం చేయడం చూసి స్థానికులు ఆవేదన చెందుతున్నారు.నిత్యం పూజలు చేసుకొనే ఆలయాన్ని కూల్చవద్దని స్థానికులు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం వినలేదు. ఆలయాన్ని గునపాలు, జేసీబీలతో కూల్చివేసింది. వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం రేణిగుంట – కడప జాతీయ రహదారి ఆంజనేయపురం వద్ద వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అభయాంజనేయ స్వామి ఆలయం ఉంది. అగస్త్య మహాముని, ఆయన భార్య లోపాముద్ర, తాళ్లపాక అన్నమయ్య, కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, జయేంద్ర సరస్వతి స్వామి వంటి వారు ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు, అభిషేకాలు చేశారు. ఈ ఆలయంలో వివాహాలు చేస్తే ఆ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయనేది స్థానికుల నమ్మకం. తిరుమలకు వచ్చే భక్తులు కూడా ఇక్కడ స్వామిని దర్శించుకొని వెళ్తుంటారు. తొలి పల్లవుల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇంతటి విశిష్టత ఉన్న ఈ ఆలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం సోమవారం నేలమట్టం చేసింది. స్వయంభువుగా వెలిసిన విగ్రహానికి గునపం పోటు ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలసిన ఈ ఆలయంలోని మూలవిరాట్టును తొలగించే దృశ్యాలు ప్రభుత్వ కర్కశత్వాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. విగ్రహాన్ని తొలగించే సమయంలో ఎటువంటి ఆచార సంప్రదాయాలు పాటించలేదు. కనీసం పూజలు కూడా చేయలేదు. సిబ్బంది నేరుగా గర్భాలయంలోకి వెళ్లి స్వామి విగ్రహాన్ని గునపాలతో పెకలించారు. ఆలయ గోపురాన్ని, పైన ఉన్న శ్రీఆంజనేయస్వామి విగ్రహం, సీతారామ లక్ష్మణుల విగ్రహాలను జేసీబీతో లాగిపడేశారు. ఈ దృశ్యాలు చూసి భక్తులు, స్థానికులు తీవ్ర ఆవేదన చెందారు.ప్రభుత్వ తీరుపై భూమన ఆగ్రహంఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత విషయం తెలుసుకున్న వైస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ధ్వంసం చేసిన ఆలయాన్ని పరిశీలించారు. శిథిలాల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. జాతీయ రహదారి డిజైన్‌లో మార్పులు చేసే అవకాశం ఉన్నప్పటికీ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అతి పురాతనమైన, విశిష్టత కలిగిన ఆలయాన్ని నేలమట్టం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ ఆలయాల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇదేనా అని ధ్వజమెత్తారు. పరమ పవిత్రమైన ఆలయాన్ని అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం రోజున నేలమట్టం చేయడం హిందువుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడమేనని అన్నారు. కరకంబాడి వద్ద బడా పెట్టుబడిదారులు, ధనికుల స్థలాలు రోడ్డు విస్తరణలో పోకుండా ఉండేందుకే జాతీయ రహదారిని వారికి అనుకూలంగా మలుపు తిప్పారని, అందులో భాగంగానే ఆంజనేయస్వామి ఆలయాన్ని కూలగొట్టారని తెలిపారు. ఇది వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన అత్యంత దారుణమని కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. -
విగ్రహాల తొలగింపు.. ఏలూరులో ఉద్రిక్తత
-
విగ్రహాల తొలగింపు.. ఏలూరులో ఉద్రిక్తత
సాక్షి, ఏలూరు : అర్ధరాత్రి సమయంలో ఆలయంలో విగ్రహాలను తొలగించడంతో పగోజిల్లా ఏలూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరులోని అంబికా థియేటర్ పక్కన ఓ సంస్థ యజమానులు మల్టిఫ్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు. పక్కనే ఉన్న వంద సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయంలో విగ్రహాలను ఆదివారం అర్ధరాత్రి తొలగించి, గుడి కూలగొట్టే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడిలో విగ్రహాలను సైతం జేసీబీతో చిందరవందర చేసి రోడ్డుపైనే పడేయడంతో విశ్వహిందూపరిషత్, భజరంగ్ దళ్ నాయకులు, స్దానికులు ఆగ్రహించారు. ఈ ఘటనపై స్థానికులు లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీబీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఏలూరు రూరల్ సీఐ నాయుడు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. -
స్టే విధింపునకు హైకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ: ఆలయం కూల్చివేతను అడ్డుకోవాలంటూ పిటిషన్ దాఖలుచేసిన కిర్పాల్ కో-ఆపరేటివ్ గ్రూపు హౌసింగ్ సొసైటీకి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ సొసైటీకి డీడీఏ సదరు స్థలాన్ని కేటాయించిందని రుజువు చేసుకునేందుకు కిర్పాల్ కో-ఆపరేటివ్ గ్రూపు హౌసింగ్ సొసైటీ తగు ఆధారాలు చూపలేదని పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ వి.కె.శాలి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కాగా సదరు సొసైటీ నగరంలోని ఐపీ ఎక్స్టెన్షన్లో ఓ ఆలయాన్ని నిర్మించింది. అయితే ఈ స్థలం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)కి చెందినది. సరైన పత్రాలు సమర్పించకపోకపోయినట్టయితే తామేమీ చేయలేమంది. తగినంత సిబ్బందిని పంపండి స్థానిక ఐపీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఆక్రమణల కూల్చివేత కోసం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)కి తగినంత సిబ్బందిని పంపాలంటూ పోలీసు శాఖను హైకోర్టు ఆదేశించింది. ఆ సంస్థ కోరిన మూడురోజుల వ్యవధిలోగా పంపాలంటూ జస్టిస్ వి.కె. షాలి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఆ ప్రాంతంలో యథాతథస్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించినప్పటికీ అక్కడ అక్రమ నిర్మాణాలు ఆగడం లేదని డీడీఏ ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. కొంతమంది తొలుత అక్కడ చిన్న గదిని నిర్మించారని, ఆ తర్వాత దానిని దేవాలయంగా మార్చేశారని తెలిపింది.అంతటితో ఆగకుండా అక్కడ మొక్కలు కూడా నాటారని సదరు పిటిషన్లో పేర్కొంది. దీంతో భద్రత అవసరమంటూ పోలీసు శాఖకు అనేక పర్యాయాలు లేఖలు రాశామని, అయినప్పటికీ సరిగా స్పందించలేదని ఆరోపించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం పైవిధంగా ఉత్తర్వులు జారీచేసింది. పిటిషన్ స్వీకరణకు హైకోర్టు నో నిబంధనలను గాలికొదిలేసి కార్యకలాపాలను నిర్వహిస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉబర్ కంపెనీపై దాఖలుచేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను బీజేపీ మాజీ నాయకుడు గోవిందాచార్య దాఖలు చేశారు. ఉబర్ సంస్థలో గ్రీవియెన్స్ విభాగం లేదని, అయితే హైకోర్టు గతంలో జారీచేసిన ఆదేశాల ప్రకారం అది తప్పనిసరని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ బీడీ అహ్మద్, జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ నేతృత్వంలోని ధర్మాసనం... వెబ్ ఆధారిత సంస్థల్లో గ్రీవియెన్స్ విభాగాన్ని నియమించుకోవాలని ఆదేశించనందుకుగాను ప్రభుత్వంపై ఉల్లంఘన పిటిషన్‌ను దాఖలు చేయాలని సూచించింది.


