బాబు ‘చీకటి గెలుపు’ బట్టబయలు | The Reporters Collective Investigation: 2024 Election Records Explained in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బాబు ‘చీకటి గెలుపు’ బట్టబయలు

Nov 24 2026 5:57 AM | Updated on Nov 24 2026 5:57 AM

The Reporters Collective Investigation: 2024 Election Records Explained in Andhra Pradesh

2024 ఎన్నికల్లో ‘కూటమి’ బండారాన్ని బయట పెట్టిన ‘రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ సంస్థ

బయటపడ్డ చంద్రబాబు కూటమి సిస్టమాటిక్‌ రిగ్గింగ్‌ 

చిత్తూరు లోక్‌సభ స్థానంలో ఓటింగ్‌పై పరిశోధన చేసిన జాతీయ స్థాయి జర్నలిస్టులు 

పోలింగ్‌ రోజు సాయంత్రం 6 తర్వాత పోలైన ఓట్లలో 31,471 ఓట్లు మాయమైనట్లు వెల్లడి 

ఈ లోక్‌సభ స్థానంలో సాయంత్రం 6 తర్వాత క్యూలలో 56,067 మంది ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి 

దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 6 తర్వాత పోలైన ఓట్లు 24,596గా లెక్క 

మిగతా 31,471 ఓట్లు మాయమైపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న మేధావులు, నెటిజన్లు 

పార్లమెంటుకు అసెంబ్లీకి ఏకకాలంలో పోలింగ్‌ జరిగినప్పుడు తేడా ఎందుకు వస్తుందని ప్రశ్న

చంద్రబాబుతో సహా మిగతా వారూ అక్రమంగానే గెలిచారన్న అనుమానాలు  

సాక్షి, అమరావతి/సాక్షి, చిత్తూరు: చంద్రబాబు కూటమికి ప్రజల మద్దతు లేకపోయినా.. ఓట్ల చోరీ, అక్రమాలు, మోసాలతో అధికారంలోకి వచ్చిందనడానికి 2024 ఎన్నికల్లో  పోలైన ఓట్లలో భారీ తేడాలే ప్రబల నిదర్శనం. పలు సామాజిక సంస్థలు ఈ విషయాన్ని లెక్కలు, ఆధారాలతో సహా వెల్లడించాయి. ఈ ఎన్నికలు, పోలింగ్‌ జరిగిన తీరుపై రాజకీయ పార్టీలతో పాటు పలువురు మేధావులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. పోలింగ్‌ జరిగిన రోజు అర్ధరాత్రి 2  గంటల వరకు రాష్ట్రంలో భారీగా పోలైన ఓట్లు, అందులో మోసాలను రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ గణాంకాలతో సహా వివరించిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 31,471 ఓట్లు రికార్డుల నుంచి మాయమైన విషయం బయటపడింది.

ఈ భారీ రిగ్గింగ్‌ బాగోతాన్ని జాతీయ స్థాయి జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న ‘ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ అనే సంస్థ సాక్ష్యాలతో సహా బహిర్గతం చేసింది. చంద్రబాబు కూటమి సిస్టమాటిక్‌ రిగ్గింగ్‌ను మరోసారి బయటపెట్టింది. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు గెలుపు పైనా అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం ఓటింగ్‌ సరళిపై రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ సంస్థ చేసిన పరిశోధనలో 2024 ఎన్నికల్లో చంద్రబాబు కూటమి చీకటి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ వివరాలను ఆ సంస్థ ‘ఎక్స్‌’లో వెల్లడించింది. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకుందని, రిగ్గింగ్‌ జరిగిందన్న ఆరోపణలకు ఇది బలం చేకూరుస్తోందని ఆ సంస్థ వ్యాఖ్యానించింది. ఈ నివేదిక జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అనేక రాజకీయ పార్టీలతో పాటు మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఈ మోసపూరిత ఎన్నికలను గట్టిగా నిలదీస్తున్నారు. 

రికార్డుల నుంచి తొలగించారా?
ఏ ఎన్నికలైనా పోలింగ్‌ సమయంలో క్యూలో నిల్చున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్‌ సమయం ముగిసినా కూడా అప్పటి వరకు క్యూలో ఉన్న వారికి స్లిప్పులు ఇచ్చి, పోలింగ్‌ కొనసాగిస్తారు. ఇలా పోలింగ్‌ సమయం తర్వాత ఓటు వేసిన వారి వివరాలతో అధికారులు ప్రత్యేక రికార్డులు నిర్వహించాలి. పోలింగ్‌ జరిగిన 2024 మే 13వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో క్యూలలో 56,067 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) అంతర్గత రికార్డులు చెబుతున్నాయి.

ఈవీఎంలలో లోపాలు, హింస కారణంగా పోలింగ్‌ రాత్రి 2 గంటలకు జరిగిందని ఈసీ ఆనాడు పేర్కొంది. ఇదే పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని కుప్పం, నగరి, చంద్రగిరి, జీడీ నెల్లూరు, చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏపీలో లోక్‌సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగినందున ప్రతి ఓటరు లోక్‌సభ స్థానానికి, అసెంబ్లీ స్థానానికి ఓట్లు వేయాలి. అంటే పార్లమెంటు స్థానానికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో, అసెంబ్లీ స్థానానికి కూడా అన్నే పోలవ్వాలి.

కానీ, ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత 24,596 మంది ఓట్లు వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే మిగిలిన 31,471 మంది ఓటర్ల లెక్క ఏమైపోయిందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్ధకం. వీటిని రికార్డుల నుంచి తొలగించారన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ ఎన్నికలు ఎంత మోసపూరితంగా జరిగాయో తేటతెల్లం చేస్తోంది.

ఎన్నికల మోసాలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
‘ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ ప్రచురించిన లోతైన దర్యాప్తు నివేదిక సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా నెటిజన్లు ఎన్నికల్లో జరిగిన మోసాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఒకే ఓటరు రెండు ఓట్లు వేస్తే లెక్కల్లో తేడా ఎందుకొచి్చందని ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారిగా 31 వేలకు పైగా పోలైన ఓట్లు ఎలా మాయమవుతాయని నిలదీస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఎందుకు విచారణ జరపడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఆధారాలను చెత్తబుట్టలో పడేసి, మౌనం వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రిగ్గింగ్‌ అనడానికి ఇదే నిదర్శనం
ఈ సంచలనాత్మక దర్యాప్తు నివేదిక 2024 ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్‌ జరిగిందని సూచిస్తోంది. ఈ నివేదికలో మొదటి రెండు భాగాలు దర్యాప్తులో ఈసీఐ రికార్డుల నిర్వహణలో ఉన్న తీవ్రమైన లోపాలను, పొరపాట్లను బట్టబయలు చేశాయి. మూడో కథనం రిగ్గింగ్‌ జరిగిందనే సంకేతాలు ఇస్తోంది. ఏపీలో ఒకేసారి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్‌ గణాంకాల మధ్య ఇంత భారీ వ్యత్యాసం అసాధారణం. ఏపీలో ఓటింగ్‌ మోసాలను పరకాల ప్రభాకర్‌ ఎప్పటి నుంచో అందరి దృష్టికి తీసుకువస్తూ ఉన్నారు. రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ఆయన వాదనను నిజమని నిరూపిస్తోంది.
    – యోగేంద్ర యాదవ్, సామాజికవేత్త

భారీ తేడాను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు పార్లమెంటరీ స్థానంలో సాయంత్రం 6 గంటల సమయానికి 56,067 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నట్లు ఈసీఐ అంతర్గత రికార్డులు నిర్ధారిస్తున్నాయి. చిత్తూరు పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు 24,596 మందిని మాత్రమే లెక్కించారు. హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ఈ ఎన్నికల్లో 31 వేలకు పైగా ఉన్న ఈ వ్యత్యాసాన్ని కమిషన్‌ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? దీనిపై విచారణ ఎందుకు జరపలేదు?
    – ప్రశాంత్‌ భూషణ్, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది

అక్రమాల ఆధారాలు బయటపడుతున్నాయి
అక్రమాలు, మోసాలతో ఎన్డీఏ దక్కించుకున్న అక్రమ అధికారానికి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. త్వరలోనే కోర్టుల్లో, వీధుల్లో వీరి అక్రమ అధికారాన్ని బలంగా సవాలు చేసేంతటి బలమైన ఆధారాలుగా మారుతాయి. ధైర్యంగా ఈ అక్రమాలను వెలికి తీసిన జర్నలిస్టులకు అభినందనలు.     – నేహా బోరా, అధ్యక్షురాలు, ఏఐఎస్‌ఏ

కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు విచారణ జరపడంలేదు?
ఒకేసారి పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు 6 గంటల తర్వాత నమోదైన ఓట్ల సంఖ్యలో పార్లమెంటుకు, అసెంబ్లీకి తేడా ఉండటంపై ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ సంస్థ గట్టిగా నిలదీస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు విచారణ జరపడంలేదని ప్రశ్నించింది. ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇలా అంతర్గత రికార్డులను పరిశీలించడానికి అనుమతించలేదని, తొలిసారిగా తాము ఎన్నో వ్యయప్రయాసలను ఎదుర్కొని ఈ ఆడిటింగ్‌ నిర్వహించినట్లు రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ సంస్థ విడుదల చేసిన వీడియోలో పేర్కొంది.

గతంలో జరిగిన ఆడిటింగ్‌లో దేశవ్యాప్తంగా 200కు పైగా పార్లమెంటు స్థానాలకు 6 గంటల తర్వాత నమోదైన పోలింగ్‌ వివరాలు లేకపోవడాన్ని ప్రస్తావించింది. తొలి ఆడిటింగ్‌లో రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 51 స్థానాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపించింది. 2024లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలపై మరింత పరిశోధనకు అందరూ సాయం చేయాలని అభ్యర్థించింది.

బాబు సహా వారంతా ఎలా గెల్చినట్లు?
రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ సంస్థ చేసిన పరిశోధన ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడుతో సహా చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేల గెలుపునే ప్రశ్నిస్తోంది. 2024 జూన్‌ 4వ తేదీన ఓట్లు లెక్కించారు. కుప్పంలో జరిగిన లెక్కింపు చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించింది. తొలి నాలుగు రౌండ్లలో వైఎస్సార్‌సీపీ కుప్పం అసెంబ్లీ అభ్యర్థి భరత్, ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పకు .. టీడీపీ అభ్యర్థులకు వంద ఓట్ల తేడానే ఉంది.

ఆధిక్యం ఇలాగే ఉంటే చంద్రబాబుకు ఓటమి తప్పదని అందరూ భావించారు. కానీ ఆ తరువాత రౌండ్లలో టీడీపీకి అనూహ్యంగా ఓట్లు పెరిగిపోయాయి. దీంతో చంద్రబాబు విజయం సాధించారు. ఇలా ఓట్లు అనూహ్యరీతిలో పెరగడం పలు అనుమానాలకు తావిచి్చంది. మిగతా నియోజకవర్గాల్లోనూ ఓట్ల సరళి ఇలానే ఉంది. చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో వీరంతా విజయం సాధించడానికి లెక్కల్లోంచి మాయమైన ఓట్లే కారణమన్న వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement