breaking news
tallest tower
-
ఆకాశానికి నిచ్చెనలు వద్దు..ఎత్తయిన భవన నిర్మాణాలకు బ్రేక్
ఆకాశహర్మ్యాలకు పారిస్ పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ దగ్గర్నుంచి ఎన్నో భవంతులు నింగికి నిచ్చెన వేసినట్టుగా ఆకర్షిస్తూ ఉంటాయి. పారిస్ ఇప్పుడు వాటి నిర్మాణానికి బ్రేక్ వేసింది. మొట్టమొదటి ఆకాశాన్నంటే భవనాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్ సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటే భవన నిర్మాణాలు ఇంకా కొన సాగితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై సాధారణ భవనాలదే భవిష్యత్ అన్నది పర్యావరణ వేత్తల మాట. ప్రపంచ పర్యాటక స్వర్గధామం పారిస్. ఫ్యాషన్లకు పుట్టినిల్లయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది కోట్లాదిమంది విదేశీయులు తరలివస్తుంటారు. ఈఫిల్ టవర్, మోపానాసే టవర్, లౌవ్రే పిరమిడ్ వంటి ఆకాశహర్మ్యాలను సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటారు. అంతస్తుల మీద అంతస్తులు నింగికి నిచ్చెనలా వేసుకుంటూ నిర్మించిన భవనాల అందాలు వర్ణించ వీల్లేదు. 330 మీటర్ల ఎత్తైన ఈఫిల్ టవర్ , 210 మీటర్ల ఎత్తయిన మోపానాస్ టవర్ (689 అడుగులు) పారిస్‌కున్న సిటీ ఆఫ్ లైట్స్‌కి ప్రత్యామ్నాయంగా నిలిచాయి. పారిస్‌లో ఎత్తైన భవన నిర్మాణాలు మనకి ఇక కనిపించవు. వాటి నిర్మాణంపై పారిస్ నగర కౌన్సిల్ నిషేధం విధించింది. స్థానికంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కొత్తగా నిర్మించే భవనాలేవైనా 12 అంతస్తులు లేదంటే 37 మీటర్లకు మించకూడదని ఆంక్షలు విధించింది. ఇటీవల కాలంలో అంతటి అందాల నగరం మురికి కూపంలా మారిపోయింది. పారిస్‌కు తిరిగి పూర్వ వైభవం కల్పించాలంటే కాలుష్య కారకమైన ఆకాశహర్మ్యాల నిర్మాణాన్ని నిలిపివేశారు. 18వ శతాబ్దంలో పారిస్ అంటే చిన్న చిన్న ఇళ్లతో చూడముచ్చటగా ఉండేది. ఆ దేశ మొట్ట మొదటి అధ్యక్షుడు నెపోలియన్ –3 రాజధానిపై ఎన్నో కలలు కన్నారు. ఆధునిక, చైతన్యవంతమైన నగరంగా పారిస్‌ను రూపొందించడానికి ప్రత్యేకంగా కొందరు ఇంజనీర్లను నియమించారు. చిన్న చిన్న భవనాలు, ఉద్యాన వనాలు అండర్ డ్రైనేజీ వంటి వ్యవస్థలతో పారిస్ అత్యంత పరిశుభ్రంగా పచ్చదనంతో అలరారేలా మారింది. ఆరు అంతస్తుల రాతి నిర్మాణాలు చూడడానికి అందంగా , నివాస యోగ్యంగా ఉండేవి. ఈఫిల్ టవర్ మినహాయించి మరో ఎత్తైన భవనం లేదనే చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధంలో నగరం చాలా వరకు ధ్వంసం కావడంతో ఆ శిథిలాల నుంచి ఇప్పుడు మనందరం చూస్తున్న సరికొత్త పారిస్ నగరం పుట్టింది. అప్పటికే ఆకాశాన్నంటే భవంతులతో అందరినీ ఆకట్టుకుంటున్న న్యూయార్క్, లండన్ వంటి నగరాల బాటలో పారిస్ నడిచింది. 40 అంతస్తులు, 50 అంతస్తులు, 59 అంతస్తులు ఇలా కట్టుకుంటూ వెళ్లిపోయింది. 1973లో తొలిసారిగా అత్యంత ఎత్తైన మోపానాస్ టవర్ నిర్మాణం జరిగింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెతలా మళ్లీ ఆ నాటి నిర్మాణాల వైపు చూస్తోంది. ప్రజలకి తగ్గిన మోజు రానురాను ప్రజలకీ ఈ హంగు ఆర్భాటాల్లాంటి భవనాలపై మోజు తగ్గింది. మళ్లీ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నాటి పారిస్‌గా మారిపోవాలని వారు కోరుకుంటున్నారు. పైగా అన్నేసి అంతస్తులున్న భవనాల్లో నివాసం మా వల్ల కాదంటూ ఒక దండం పెట్టేస్తున్నారు. ఒకప్పుడు 50 అంతస్తుల భవనం నిర్మిస్తే పై అంతస్తులో నివాసం కోసం ప్రజలు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు వాటికి డిమాండ్ బాగా తగ్గిపోయింది. దీనికి పలు కారణాలున్నాయి. పై అంతస్తుల్లో ఉండే వారిలో ఒంటరితనం వెంటాడుతోంది. సమూహం నుంచి దూరంగా ఉన్న భావన పెరిగిపోయి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంత ఎత్తు నుంచి కిందకి రావడమే ఒక ప్రసహనంగా మారుతోంది. దీంతో నాలుగ్గోడల మధ్య అధికంగా కాలక్షేపం చేయడంతో శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రజలు కూడా ఎత్తైన భవనాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పర్యావరణానికీ దెబ్బే అతి పెద్ద అంతస్తులు పర్యావరణానికి కూడా హానికరంగా మారుతున్నాయి. ఇంధనం వినియోగం విపరీతంగా ఉంటుంది. సాధారణ భవనంలో ప్రతీ చదరపు మీటర్‌కి ఖర్చు అయ్యే ఇంధనానికి ఆకాశహర్మ్యాలలో రెట్టింపు ఖర్చు అవుతుంది. కాలుష్యం 145% అధికంగా విడుదల అవుతుంది. పై అంతస్తులకి నీళ్లు పంప్ చెయ్యడానికి అధికంగా విద్యుత్ వినియోగించాలి. భవనాల నిర్వహణ ఖర్చు కూడా తడిసిమోపెడవుతోంది. ఈ భవన నిర్మాణాలతో ఇంధనం 48% , కర్బన ఉద్గారాలు విడుదల 45% , వ్యర్థాలు 25% వస్తూ ఉంటే నీటి వినియోగం 15% ఉంటోంది. భావితరాలు వినియోగించాల్సిన సహజ వనరుల్ని ఇప్పుడే మనం ఖర్చు చేసేయడంపై పర్యావరణవేత్తల్లో ఆందోళన కూడా నెలకొంది.అందుకే ఇక భవిష్యత్ అంతా సాధారణ భవనాలదేనని పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. చైనా కూడా పారిస్ బాటలోనే నడుస్తూ ఎత్తయిన భవన నిర్మాణాలను నిలిపివేసింది. గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరుగుతూ ఉంటే ఇతర దేశాల్లో అతి పెద్ద నగరాలు కూడా పారిస్ బాటలో నడవక తప్పదు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌదీలో ప్రపంచ ఎనిమిదో వింత!
మీకు స్కై స్క్రాపర్ అంటే తెలుసుగా.. అదేనండీ ఆకాశహర్మ్యం.. వందలాది అడుగుల ఎత్తైన భారీ భవనం. మరి సైడ్‌వే స్కైస్క్రాపర్ గురించి ఎప్పుడైనా విన్నారా? సౌదీ అరేబియాలో త్వరలో అత్యంత భారీ స్థాయిలో నిర్మాణం కానుంది. పేరుకు తగ్గట్లే ఇది ఎత్తుకన్నా పక్కలకు ఎక్కువగా విస్తరించి ఉంటుందన్నమాట. ఆ ఇందులో పెద్ద విశేషం ఏముందిలే అనుకోకండి.. ఎందుకంటే ఈ నిర్మాణం ఏకంగా 120 కిలోమీటర్ల పొడవు ఉండనుంది మరి!! మరోలా చెప్పాలంటే దీని పొడవు దాదాపుగా అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం అంత ఉండనుంది!! ప్రపంచంలోని ఎనిమిదో వింతగా అందరినీ అబ్బురపరచనుంది. ఈ భారీ ప్రాజెక్టులో మరిన్ని విశేషాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే.. ఎన్నెన్నో ప్రత్యేకతలు... సౌదీ యువరాజు, ఉప ప్రధాని మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏకంగా 26,500 చదరపు కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన భవిష్యత్ నగరం ‘నియోమ్ సిటీ’లో భాగంగా 120 కి.మీ. పొడవైన రెండు సైడ్‌వే స్కైస్క్రాపర్లను నిర్మించనున్నారు. వాయవ్య సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రానికి చెందిన గల్ఫ్ ఆఫ్ అకాబా తీరం నుంచి ఎడారిలో ఉన్న కొండల మధ్య దాకా ఈ ప్రాజెక్టు విస్తరించనుంది. ఈ రెండు భవనాలను అద్దాలతో అలంకరించనున్నందున దీనికి ‘మిర్రర్ లైన్’ అని పేరు పెట్టారు. ఎత్తులోనూ ఇవి ప్రపంచంలోని ఇతర ఆకాశహర్మ్యాల స్థాయిలో రూపుదిద్దుకోనున్నాయి. 490 మీటర్ల వరకు అంటే దాదాపుగా అర కిలోమీటర్ ఎత్తు వరకు ఈ భవనాలను కట్టనున్నారు. న్యూయార్క్‌లో ఉన్న 102 అంతస్తుల ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చిట్టచివరి కొన వరకు ఉన్న ఎత్తు 443 మీటర్లకన్నా ఈ జంట భవనాలు మరెంతో ఎత్తు వరకు కనిపించనున్నాయన్నమాట. ఇంత పొడవైన జంట భవనాల్లో కిలోమీటర్లకొద్దీ కట్టబోయే ఇళ్లలో ఏకంగా 50 లక్షల మంది నివసించవచ్చట! రోజుకు మూడపూటలా భోజనానికి ‘సబ్‌స్క్రైబ్’ చేసుకున్న వారికి అవసరమైన పంటలను సైతం ఈ విస్తీర్ణంలోనే పండిస్తారట. భవనాల ఒక చివరి నుంచి మరో చివరి వరకు 20 నిమిషాల్లో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా భూగర్భంలో హైస్పీడ్ రైల్వే లైన్, పాదచారుల కోసం వాక్ వేస్, నేల నుంచి వెయ్యి అడుగుల ఎత్తులో భారీ స్టేడియం వంటి ఎన్నో హంగులు ఇందులో ఉండనున్నాయి. ఈ పే...ద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు కూడా అత్యంత భారీగానే ఉండనుంది. సుమారు 50 ఏళ్లు పట్టే ఈ ప్రాజెక్టు పూర్తికి ఏకంగా రూ. 80 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా! సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆకాశంలో కిలోమీటర్ ఎత్తున టవర్..!
కిలోమీటర్ ఎత్తున.. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే ప్రపంచంలోనే అతి పెద్ద, పొడవైన నిర్మాణాన్ని సౌదీ ప్రభుత్వం చేపట్టింది. ఈ భారీ కట్టడం నిర్మాణంలో 57 లక్షల చదరపు గజాల కాంక్రీట్, 80 వేల టన్నుల స్టీల్ ను వినియోగించి, దుబాయ్ లోని అతిపెద్ద టవర్, గిన్నిస్ రికార్డులకెక్కిన 'బుర్జ్ ఖలిఫా' ను తలదన్నే రీతిలో నిర్మిస్తున్న ఈ కట్టడం... అనుకున్నలక్ష్యాన్ని చేరితే ప్రపంచ గుర్తింపు తెచ్చుకోగలదని భావిస్తున్నారు. అతిపెద్ద జెద్ టవర్ ప్రాజెక్టు ఆకర్షణీయంగా నిర్మించేందుకు సుమారు ఏడువేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. జెడ్ ఎకనమిక్ కంపెనీ, సౌదీ అరేబియాకు చెందిన అలిన్మా ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు సంయుక్తంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలను వెచ్చించి జెద్ నగరంలో ఈ నిర్మాణం చేపట్టేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సౌదీ ప్రభుత్వం ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 26వ అంతస్తు వరకు పూర్తయిందని, 3 వేల 280 అడుగుల ఎత్తైన ఈ ఆకాశహర్మ్యం 2020 లోగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ నిర్మాణంతో స్థానికంగా రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందుతుందని, ఆధునిక జీవన శైలిని కూడా అందిస్తుందని, అనుకున్న లక్ష్యాన్ని చేరితే ఓ ప్రపంచ స్థాయి పట్టణ కేంద్రంగా ఈ ప్రాంతం రూపు దిద్దుకుంటుందని జెడ్దా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మౌనిబ్ హమ్మౌద్ అంటున్నారు.