ఐఫోన్ ఈఎంఐ మరణాల కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. అసలు గుట్టు విప్పిన పోలీసులు | iPhone EMI Claims False: Relative Demands End to Rumours in Maharashtra Tragedy | Sakshi
Sakshi News home page

ఐఫోన్ ఈఎంఐ మరణాల కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. అసలు గుట్టు విప్పిన పోలీసులు

Aug 24 2026 6:20 PM | Updated on Aug 24 2026 7:06 PM

iPhone EMI Claims False: Relative Demands End to Rumours in Maharashtra Tragedy

ముంబై: ఐఫోన్ ఈఎంఐ చెల్లించలేకనే మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మృతుడు కునాల్ పిన్ని పల్లవి పాటిల్ స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఎలాంటి ఫోన్ ఈఎంఐ వ్యవహారం లేదని, దయచేసి తప్పుడు ప్రచారాలు ఆపేయాలని ఆమె   విజ్ఞప్తి చేశారు. 

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా తీస్‌గావ్‌లో ఆగస్టు 21న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల కునాల్ చంద్‌గుడే ఈఎంఐ పద్ధతిలో యాపిల్ ఐఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే నెలవారీ వాయిదాలు చెల్లించలేక కుటుంబ సభ్యుల సహాయం కోరాడు. ఈ చిన్న విషయమే కుటుంబంలో వివాదానికి దారితీసింది.

ఆవేశంతో ఖావడ్యా కొండపైకి వెళ్లిన కునాల్, తాను కొండపై నుంచి దూకేస్తానని బెదిరించాడు. కొండ అంచున ఉన్న కునాల్‌ను కాపాడేందుకు తండ్రి మురళీధర్ ప్రయత్నించగా.. ఇద్దరూ ప్రమాదవశాత్తూ అదుపుతప్పి 400 నుంచి 500 అడుగుల లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. భర్త, కుమారుడు కళ్లెదుటే లోయలో పడిపోవడాన్ని తట్టుకోలేక తల్లి సంగీత కూడా అదే కొండపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు.

ఐఫోన్ ప్రచారంపై పిన్ని ఆవేదన 
కుటుంబ సభ్యుల అస్థికలను ఇంటికి తీసుకొచ్చే సమయంలో పల్లవి పాటిల్ ఒక వీడియో విడుదల చేశారు. ‘ఐఫోన్ ఈఎంఐ చెల్లించలేకనే వారు ప్రాణాలు తీసుకున్నారనేది పూర్తిగా అవాస్తవం. మా కుటుంబం గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేసి మమ్మల్ని మరింత వేదనకు గురిచేయవద్దు. వృద్ధులైన మా తల్లిదండ్రులకు ఈ సోషల్ మీడియా ప్రచారాలు తెలిస్తే తట్టుకోలేరు’ అంటూ ఆమె కన్నీటిపర్యమంత అయ్యారు.

భార్యాభర్తల మధ్య విభేదాలే కారణమా?
మరోవైపు,ఐఫోన్‌ ఈఎంఐ కట్టలేకే కునాల్‌ ప్రాణాలు తీసుకున్నారనే అంశంలో వాస్తవం లేదని పోలీసులు సైతం గుర్తించారు. అందుకు సంబంధించిన ఆధారాల్ని సేకరించారు. ఆ ఆధారాల్లో కునాల్‌ తండ్రి మురళీధర్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, సంగీత గృహిణి. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో పెద్ద కుమారుడిని కోల్పోవడం వల్ల వీరి కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు విడివిడిగా ఉంటున్నారు. గత మూడు నెలలుగా దూరంగా ఉన్న మురళీధర్.. ఘటనకు రెండు రోజుల ముందే ఇంటికి రావడంతో గొడవలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో సంగీతకు సంబంధించిన ఒక పాత వీడియో పోలీసులకు లభించింది. ‘ఆస్తి కోసం నాకు, నా కొడుక్కి దక్కాల్సిన హక్కును నిరాకరించారు. నా సంతోషకరమైన కుటుంబాన్ని నాశనం చేశారు. దీనికి కారణమైనవారు రాబోయే ఏడు తరాలు మూల్యం చెల్లించుకుంటారు’ అంటూ ఆ వీడియోలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలోని అంతరార్థంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కునాల్‌ తల్లి సంగీత ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలిస్తే.. ఈ కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement