‘హి’..స్టోరీమోహన్ లాల్
మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటన గురించి దక్షిణాది సినీ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేదు. దశాబ్ధాల తరబడి ఆకాశమే హద్దుగా సాగుతున్న ఆయన అభినయ ప్రయాణం గురించి తెలియని ఫిల్మ్ లవర్స్ ఉండరు. అయితే ఆయన గురించి చెప్పుకోవడానికి నటనను మించినవి కూడా ఉన్నాయి. గత కొంతకాలంగా ఆయన ఆస్వాదిస్తున్న అభిరుచులు, తెరవెనుక పోషిస్తున్న పాత్రల్ని గమనిస్తే ఆ వ్యక్తిగత జీవితం కూడా ఆయన అత్యుత్తమ అభినయం లాగే ఆకట్టుకుంటుంది.
కుస్తీ మే సవాల్...
ఈ దిగ్గజ నటుడు ఒకప్పుడు రాష్ట్ర స్థాయి కుస్తీ ఛాంపియన్ అని, 1977–78లోనే టైటిల్‌ను గెలుచుకున్నారని చాలా తక్కువ మందికి తెలుసు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, మోహన్ లాల్ కుస్తీలోని మెలకువలను నేర్చుకుని, రెజ్లింగ్ ఫెడరేషన్ దృష్టిని ఆకర్షించారు. దీంతో న్యూఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీలలో కేరళకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా లభించింది. అయితే, దాదాపు అదే సమయంలో ఒక సినిమా ఆడిషన్ అవకాశం రావడం ఓ కుస్తీ ఛాంపియన్ కావాల్సిన వ్యక్తిని టాప్ హీరోగా మార్చేసింది.
మెజీషియన్...
మ్యాజిక్ అంటే చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న మోహన్‌లాల్ 2008లో ప్రముఖ భారతీయ మెజీషియన్ గోపీనాథ్ ముత్తుకాడ్ దగ్గర 18 నెలల పాటు శిక్షణ కూడా పొందారు. తర్వాత తిరువనంతపురంలో ‘బర్నింగ్ ఇల్యూజన్’ పేరుతో అగ్నికీలల నుంచి తప్పించుకునే విన్యాస ప్రదర్శనకు సిద్ధమయ్యారు. అయితే, ప్రమాద భయాలతో ఆయన అభిమాన సంఘాల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగా ఆ ప్రదర్శన రద్దయింది. అయినా ఆయనలోని ఇంద్రజాలికుడు వెనకడుగు వేయలేదు. ఆ తరువాత 2014లో త్రివేండ్రంలో మ్యాజిక్ ΄్లానెట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా వేదికపై ‘ఫ్లోటింగ్ లేడీ’ అనే ఇల్యూషన్ ను ప్రదర్శించి అబ్బురపరచారు. మంచి సినిమా కూడా ఓ ‘మ్యాజిక్’ లాంటిదేనని, ప్రేక్షకుడు మరో ప్రపంచంలోకి వెళ్లిపోయేలా చేయగలిగే మాయాజాలమని ఆయన వర్ణిస్తారు.
కవితా గానం...
పాటలు వినడం మాత్రమే కాదు అప్పుడప్పుడు వేదికపై పాడడం కూడా ఆయనకు ఇష్టం. ఆయనకు రచన పట్ల చక్కని అభిరుచి ఉంది, తరచుగా తన మాతృభాష అయిన మలయాళంలో చేతితో వ్రాసిన, భావోద్వేగభరితంగా తన బ్లాగులలో పంచుకుంటారు, పలు రంగస్థల నాటకాలలో కూడా మెప్పించారు.
సేంద్రియ రైతు...
ఆర్గానిక్ వ్యవసాయం అంటే మోహన్‌లాల్‌కు చాలా ఇష్టం. కోవిడ్ లాక్‌డౌన్ సమయం నుంచి తన ఇంటి పక్కనే సేంద్రియ తోటను ఏర్పాటు చేసి కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. వ్యవసాయం మనసుకు ప్రశాంతతనిస్తుందని అంటారాయన.
చెఫ్‌గా...
పాకశాస్త్రంలోనూ ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది. ఖాళీ దొరికితే ఇంటిల్లిపాదికీ స్వయంగా వండిపెడతారు. కేరళ సంప్రదాయ వంటకాలు వండడం తనకు ఎంతో ఆనందం కలిగించే విషయమని పలు సందర్భాల్లో చె΄్పారు.
కరాటే ఫైటర్...
ఫిట్‌నెస్‌పై ఎప్పుడూ దృష్టి పెట్టే మోహన్‌లాల్‌కు మార్షల్ ఆర్ట్స్‌పై కూడా ఆసక్తి ఉంది. ఆయన కుక్కివాన్ (ప్రపంచ తైక్వాండో ప్రధాన కార్యాలయం) వద్ద శిక్షణ పొంది, తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించారు.
– సత్యబాబు


