మోహన్‌లాల్‌ అదిరిపోయే సర్‌ప్రైజ్‌.. ఒకేసారి 7 సినిమాలు! | Mohanlal Announces 7 News Film, Here Full Details | Sakshi
Sakshi News home page

మోహన్‌లాల్‌ అదిరిపోయే సర్‌ప్రైజ్‌.. ఒకేసారి 7 సినిమాలు!

Aug 19 2026 12:23 PM | Updated on Aug 19 2026 12:37 PM

Mohanlal Announces 7 News Film, Here Full Details

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. యువ హీరోలతో పోటీ పడేలా వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్న ఆయన.. తాజాగా తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఒకేసారి ఏకంగా ఏడు కొత్త సినిమాలను ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

మోహన్‌లాల్‌ ప్రకటించిన ఈ ఏడు చిత్రాలకు మలయాళ చిత్రసీమలోని ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహించనున్నారు. ప్రియదర్శన్‌, జీతూ జోసెఫ్‌, సత్యన్‌ అంతికాడ్‌, దిలీశ్‌ పోతన్‌, విష్ణు మోహన్‌, అనూప్‌ సత్యన్‌, జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో కొందరితో మోహన్‌లాల్‌కు ఇప్పటికే విజయవంతమైన కాంబినేషన్లు ఉన్నాయి. మరికొందరితో తొలిసారి కలిసి పనిచేయనున్నారు.

ముఖ్యంగా జీతూ జోసెఫ్‌తో మోహన్‌లాల్‌ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘దృశ్యం’ సిరీస్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రియదర్శన్‌తోనూ మోహన్‌లాల్‌ ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశారు. ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్లు తెరపైకి రానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక సత్యన్‌ అంతికాడ్‌, దిలీశ్‌ పోతన్‌, విష్ణు మోహన్‌, అనూప్‌ సత్యన్‌, జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ వంటి విభిన్న శైలులున్న దర్శకులతో మోహన్‌లాల్‌ సినిమాలు చేయనుండటం విశేషం. దీంతో ఈ ఏడు చిత్రాల్లో విభిన్న కథలు, జానర్లను చూసే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ ఏడు సినిమాల్లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. మరోవైపు మోహన్‌లాల్‌ ఇప్పటికే ‘అతిమనోహరం’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తరుణ్‌ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా క్రిస్మస్‌ 2026 సందర్భంగా విడుదల కానున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మోహన్‌లాల్‌ ‘తుడక్కం’, ‘దృశ్యం 3’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఏడు సినిమాలను ప్రకటించడం ద్వారా ఆయన కెరీర్‌ ఎంత జోరుగా సాగుతోందో మరోసారి స్పష్టమైంది. 66 ఏళ్ల వయసులోనూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్న మోహన్‌లాల్‌.. రాబోయే రోజుల్లో ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement