ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ సిరీస్ ‘షక్... ట్రస్ట్ నో వన్’ ఒకటి. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.
ఎవరి జీవితంలోనైనా ఏదైనా అనుకోని అవాంతరం జరిగితే అప్పుడు పుట్టుకొస్తుంది అనుమానం. ఆ క్షణంలో దగ్గర, దూరం అనే భేదం లేకుండా మరీ పక్కనున్నవారిని కూడా అనుమానించే పరిస్థితి వస్తుంది. అందుకే అంటారు కాబోలు అనుమానం పెనుభూతం అని. అదే నేపథ్యంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ నెట్ ఫ్లిక్స్ సిరీస్ ‘షక్... ట్రస్ట్ నో వన్’(Shaque: No One Trust ). రెన్సిల్ డి సిల్వా తాను రాసుకున్న కథను తానే తెరకెక్కించిన విధానం అభినందనీయం.
ఏడు భాగాలతో స్ట్రీమ్ అవుతున్న ఈ ‘షక్’ సిరీస్ ఊహకందని ట్విస్టులతో మొదటి భాగం నుండి చివరకు కలిపే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తుందనే చెప్పాలి. పరిణీతి చోప్రా ఈ సిరీస్ ప్రధాన పాత్రధారిగా ఆ పాత్రకు న్యాయం చేశారు. సిరీస్ కథామూలం తెలియగానే ఎట్టి పరిస్థితిల్లోనైనా సరే చూడాలనుకుంటారు. అంతలా ఏముందీ సిరీస్ కథలో ఓసారి చూద్దాం.
అన్విత, అలోక్‌కి పెళ్ళై చాలా ఏళ్ళైనా పిల్లలు కలగరు. కానీ చాలా కాలం తరువాత అన్విత గర్భవతై, పండంటి పాపకు జన్మనిస్తుంది. పుట్టిన ఆ బిడ్డకు ‘ఆపేక్ష’ అని పేరు పెట్టుకుంటారు ఆ దంపతులు. పుట్టిన బిడ్డ, అన్విత ఇంకా హాస్పిటల్‌లో ఉండగానే ఓ రాత్రి ఆపేక్షను ఎవరో ఎత్తుకెళతారు. లేకలేక పుట్టిన బిడ్డ కనుమరుగవడంతో అన్విత, ఆలోక్‌లు బావురుమంటారు. ఎంత వెతికినా ఆపేక్ష జాడ కనిపించదు. అన్విత అలుపు లేకుండా ఆపేక్ష కోసం వెతుకుతూనే ఉంటుంది. ఎనిమిదేళ్ళు గడిచినా ఆపేక్ష ఆచూకీ అందదు. కాకపోతే ప్రతి ఏటా ఆపేక్ష పుట్టినరోజు నాడు కిడ్నాపర్ అన్వితకు ఆపేక్ష ఫొటో పంపిస్తూ ఉంటాడు.
దాంతో అన్విత పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ, ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ ఉంటుంది. మరి... అన్వితకు ఆపేక్ష దొరుకుతుందా? అసలు ఆపేక్షను ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఎవరు? అలాగే ఆపేక్ష ఫొటోలు ఎవరు పంపుతున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ‘షక్’ సిరీస్‌లోనే చూడాలి. దీని మాతృక హిందీ అయినా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ లభ్యమవుతోంది. ఊహకందని ట్విస్టులు, ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ సిరీస్ సాగుతుంది. మరీ ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఓ కన్నులపండగ. ఇంకెందుకాలస్యం... అనుమానం లేకుండా ఈ సిరీస్‌ని వీకెండ్‌లో చూసేయండి.
– హరికృష్ణ ఇంటూరు


