22ఏ భూములపై సీఎం చంద్రబాబుది ఒక లెక్క.. మంత్రి అనగానిది మరోలెక్క
22ఏ నుంచి తీసింది 16 లక్షల ఎకరాలని సీఎం.. 28 లక్షల ఎకరాలని మంత్రి
ఒక్కరోజులో 12 లక్షల ఎకరాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి?
కలెక్టర్ల సదస్సు సాక్షిగా బయటపడిన దొంగ లెక్కలు
సీఎం స్థాయిలో నోటికొచ్చినట్లు మాట్లాడడం తగునా?
రెండేళ్లుగా 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం
ఇప్పుడు తీరిగ్గా సక్రమంగా ఉన్న 9 లక్షల ఎకరాలను ఫ్రీ చేస్తామని వెల్లడి.. మరి ఇన్నాళ్లు ఎందుకు ఆపారు?
మిగిలిన 4 లక్షల ఎకరాలు కొట్టేసేందుకేనా?
సాక్షి, అమరావతి: కలెక్టర్లు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల సమక్షంలో భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న దొంగలెక్కల చిట్టా బయటపడింది. చంద్రబాబు, ఆయన మంత్రులు నోటికి వచ్చిన అంకెలు చెబుతూ జనాన్ని నిత్యం తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఈ సదస్సులో బహిర్గతమైంది. 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల విషయంలో చంద్రబాబు ఒకలెక్క చెబుతుంటే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరోలెక్క చెప్పి అధికారులే నివ్వెరపోయేలా చేశారు. 22ఏ నుంచి 16 లక్షల ఎకరాలు తొలగించామని బుధవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం పండువారికోటలో జరిగిన సభలో సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో మంత్రి అనగాని 28 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించామని సెలవిచ్చారు.
అంటే 24 గంటల వ్యవధిలో 12 లక్షల ఎకరాలు అదనంగా పుట్టుకొచ్చాయి. ఆ భూములు ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ సర్వే నంబర్లలో ఉన్నాయో ఆ దేవుడికే ఎరుక. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భూముల గణాంకాలను వాస్తవాలతో సంబంధం లేకుండా నోటికొచ్చినట్లు ప్రకటించడంపై అధికారవర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకవైపు 22ఏ జాబితాలో ఉన్న తమ భూములకు విముక్తి కల్పించాలని వేలాదిమంది కలెక్టరేట్లు, అధికారుల చుట్టూ తిరుగుతుంటే వారిని పట్టించుకోకుండా లక్షల ఎకరాలను తొలగించేసినట్లు చెప్పుకోవడం ఏమిటో రెవెన్యూ వర్గాలకే అంతుబట్టడంలేదు.
28 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించామని చెప్పిన మంత్రి అనగాని అసలు సత్యాన్ని ఆ ప్రసంగంలోనే బయటపెట్టారు. రెండేళ్లలో 22ఏ నుంచి తొలగించాలని 28,790 ఎకరాలకు దరఖాస్తులు వస్తే వాటిలో 1,100 ఎకరాలు తొలగించామని చెప్పారు. నిజంగా 28 లక్షల ఎకరాలను తొలగించి ఉంటే ఈ 28 వేల ఎకరాల కోసం రైతులు ఇంకా దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నకు జవాబు లేదు.
ఫ్రీహోల్డ్ భూములపై పగ సాధింపు ఎందుకు?
ఫ్రీహోల్డ్ భూముల విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం తమ బండారాన్ని బయటపెట్టుకుంది. దశాబ్దాలుగా సాగుకే పరిమితమై భూమిపై ఎలాంటి హక్కులు లేని పేద అసైన్డ్ రైతులకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించింది. దీంతో 27.40 లక్షల ఎకరాల అసైన్డ్ రైతులకు సంపూర్ణ హక్కులు దక్కాయి. 2024 ఎన్నికల నాటికి 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ కాగా, సుమారు 20 లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులు తమ భూములకు యజమానులయ్యారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం వాటిలో అక్రమాలు జరిగాయంటూ 22ఏ జాబితాలో పెట్టేసింది. వాస్తవానికి 13.59 లక్షల ఎకరాల్లో క్రయవిక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలకే. దీన్ని నిర్ధారించింది టీడీపీ కూటమి ప్రభుత్వమే. కేవలం 1.8 శాతం భూములను సాకుగా చూపి మిగిలిన 98 శాతానికిపైగా భూములను 22ఏ జాబితాలో పెట్టేశారు.
కొండను తవ్వి ఎలుకను పట్టారు
రెండేళ్లుగా ఫ్రీహోల్డ్ భూములపై విచారణల మీద విచారణలు నిర్వహించారు. పలుమార్లు వెరిఫికేషన్ చేశారు. ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మరీ విచారణ జరిపించారు. ఆ సంఘం డజనుసార్లు సమావేశమైనా అక్రమాలు లేకపోవడంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. నిజానికి రెవెన్యూశాఖ విచారణలోనే సుమారు 10 లక్షల ఎకరాలు సక్రమంగానే ఫ్రీహోల్డ్ అయినట్లు తేలింది. మిగిలిన 4 లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు ఉన్నాయని చెబుతున్నా, ఆ ఉల్లంఘనలు ఏమిటన్నది ఇప్పటికీ కచ్చితంగా తేల్చలేకపోయారు. ఇప్పుడు మంత్రి అనగాని మాత్రం నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాలకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇస్తామని ప్రకటించారు.
సక్రమం అయితే ఇన్నాళ్లు ఎందుకు ఆపినట్లు?
ఆ 9 లక్షల ఎకరాలు నిబంధనల ప్రకారమే ఉన్నాయని ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే తేలిపోయింది. అయినా వాటిపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగించారు. కేవలం వైఎస్ జగన్ హయాంలో ఆ రైతులకు భూములపై హక్కులు వచ్చాయనే కారణంతోనే వాటిని ఇంతకాలం 22ఏ జాబితాలో ఉంచారు. రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడు ఫ్రీహోల్డ్ చేస్తామని చెబుతున్నారు. ఇంతకాలం రిజి్రస్టేషన్ కాక, రుణం రాక, భూమి అమ్ముకోలేక లక్షలాది కుటుంబాలు పడిన కష్టానికి, నష్టానికి ఎవరు జవాబుదారీ అన్నదానిపై మాత్రం నోరు మెదపడంలేదు. తప్పు ఒప్పుకోవడం మానేసి.. ఇప్పుడు తామే హక్కులు కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం క్రెడిట్ చోరీగాక మరేమిటని రైతుసంఘాలు ప్రశి్నస్తున్నాయి.
మిగిలిన 4 లక్షల ఎకరాలపై అనుమానాలు
మిగిలిన 4 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. రెండేళ్లలో అనేక వెరిఫికేషన్లు, అధికారుల కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలు జరిగినా ఉల్లంఘనలు ఏమిటో తేల్చలేకపోయిన ప్రభుత్వం ఇంకెంతకాలం విచారణ పేరుతో కాలయాపన చేస్తుందన్నది ప్రశ్న. 9 లక్షల ఎకరాలపై నిర్ణయం తీసుకోగలిగినప్పుడు 4 లక్షల ఎకరాలపై ఎందుకు తీసుకోలేకపోతున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ భూములను అధికారపార్టీ నేతలు చేజిక్కించుకునే ఎత్తుగడ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


