నంద్యాల జిల్లాలో ఆక్సిజన్ అందక మహిళ మృతి
ఆళ్లగడ్డ: విద్యుత్ కోత వల్ల ఆక్సిజన్ అందక ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. రుద్రవరం మండలం ముత్తలూరు దళిత కాలనీకి చెందిన పద్మావతి(45) కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందిగా ఉంటే ఇంటి వద్దే ఆక్సిజన్ పెట్టుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఓ మిషన్ తీసుకొచ్చి ఎప్పుడు అవసరమైతే అçప్పుడు దానితో ఆక్సిజన్ అందిస్తున్నారు. బుధవారం సా.6 గంటలకు గ్రామంలో విద్యుత్ కోత విధించడంతో ఉక్కపోతకు గురైన పద్మావతి ఉక్కిరిబిక్కిరితో శ్వాస పీల్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బందిపడింది. ఎంతకూ విద్యుత్ రాకపోవడంతో పద్మావతి పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆళ్లగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది.


