సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో రైలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలుకు చెందిన కొన్ని వ్యాగన్లు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో పాటు సమీపంలోని సిగ్నలింగ్ వ్యవస్థకు కూడా అంతరాయం ఏర్పడింది.
కాగా, ప్రధాన రైలు మార్గం దెబ్బతినడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలు ప్రయాణికుల రైళ్లు, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి.తుని రైల్వే స్టేషన్‌లో యాలంక , అన్నవరంలో ఉదయ్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు. గంటల తరబడి రైళ్లలోనే వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు అవస్థలు పడుతున్నట్లు సమాచారం.
గూడ్స్ రైలు సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దెబ్బతిన్న ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు భారీ క్రేన్లు, ప్రత్యేక యంత్రాలను రంగంలోకి దించి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. ట్రాక్ పునరుద్ధరణ పూర్తయ్యే వరకు రైళ్ల రాకపోకలపై ప్రభావం కొనసాగే అవకాశం ఉంది.
ఈ రైళ్లు ఆలస్యం..
- భువనేశ్వర్ వెళ్లే ప్రశాంతి,
- విశాఖపట్నం వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు ప్రత్యేక రైళ్లపై ప్రభావం
- తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు స్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు
ఇదీ చదవండి: గోదావరిలో 23 కేజీల పండుగప్ప.. 16వేలకు వేలం!


