ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
టెన్త్ క్లాస్ లవ్..
ఫోన్ తీసుకోవాలంటూ గర్ల్‌ఫ్రెండ్ ఒత్తిడి
ఇంటినుంచి వెళ్లి రెండురోజులు సికింద్రాబాద్‌లో గడిపిన బాలుడు
సాక్షి, హైదరాబాద్: తనకు స్మార్ట్‌ఫోన్ కొనివ్వాలని తల్లితో వాగ్వివాదానికి దిగిన ఓ బాలుడు తల్లి నిరాకరించేసరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బంజారాహిల్స్ ఎన్‌బీటీనగర్ బస్తీలో నివసించే ఓ విద్యార్థి (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజులుగా ఏపీలోని తునికి చెందిన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు.
చాటింగ్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసుకోవడానికి ఫోన్ లేకపోవడంతో బాలిక అఖిల్‌పై ఒత్తిడి పెంచింది. దీంతో తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలంటూ కొద్ది రోజుల నుంచి అఖిల్ తల్లితో గొడవ పడుతున్నాడు. పదో తరగతిలో బుద్ధిగా చదువుకోవాలని, ఈ వయస్సులో స్మార్ట్‌ఫోన్ వద్దంటూ తల్లి వారించినా వినిపించుకోలేదు.
దీంతో రెండు రోజుల క్రితం తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పడుకున్నాడు. అక్కడే గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ తీసుకుని తన తల్లికి ఫోన్ చేసి ‘ఫోన్ కొనిస్తే వస్తా.. లేకపోతే చస్తా..’అంటూ చెప్పాడు. అప్పటికే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కాల్ నెంబర్ ఆధారంగా అఖిల్‌ను గుర్తించారు. ఠాణాకు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లికి అప్పగించారు. బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


